Rangarajan committee
-
గ్యాస్ ధరపై జీఎస్పీసీ అసంతృప్తి
న్యూఢిల్లీ: మోదీ సర్కారు నిర్ణయించిన సహజవాయువు ధరపై గుజరాత్ ప్రభుత్వానికి చెందిన గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్(జీఎస్పీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. కేజీ బేసిన్లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు మార్కెట్ ధర కావాలని డిమాండ్ చేసింది. ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకు గ్యాస్‌ను అమ్మాలంటూ ఒత్తిడి చేయడం సరికాదని చమురు శాఖకు రాసిన లేఖలో జీఎస్పీసీ పేర్కొంది. మార్కెట్ ధర కల్పిస్తే.. ఇక్కడున్న తమ దీన్‌దయాల్ వెస్ట్(డీడీడబ్ల్యూ) క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు కూడా లేఖలో తెలిపింది. తద్వారా కొత్త ధరల విధానంపై తొలిసారి అసంతృప్తి గళం వినిపించినట్లయింది. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు ధరను ఇప్పుడున్న 4.2 డాలర్ల(ఒక్కో యూనిట్‌కు) నుంచి 5.61 డాలర్లకు పెంచుతూ కేంద్రం గత నెల 18న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గత యూపీఏ సర్కారు రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం గ్యాస్ రేటును రెట్టింపు చేయగా(8.4 డాలర్లు).. దీన్ని సమీక్షించిన మోదీ ప్రభుత్వం రేటును 33 శాతం మాత్రమే పెంచడం గమనార్హం. -
32 రూపాయలొస్తే.. పేదలు కానట్లే!!
పేదరికం ప్రమాణాలు మారిపోతున్నాయి. గ్రామాల్లో రోజుకు 32 రూపాయలు, నగరాల్లో 47 రూపాయల కంటే ఎక్కువగా ఖర్చుపెట్టేవాళ్లెవరినీ పేదల కింద లెక్క వేయక్కర్లేదని కేంద్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ ఒకటి సూచించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది పెద్ద దుమారాన్నే లేపేలా ఉంది. ప్రతిపక్షాలతో పాటు అధికారపక్షానికి చెందినవాళ్లు, సాక్షాత్తు కేంద్ర మంత్రులు కూడా ఈ పేదరికం లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, దీన్ని తాను తగిన స్థాయిలో లేవనెత్తుతానని కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రంగరాజన్ నేతృత్వంలోని ఓ కమిటీ ఈ పేదరికం అంచనాలను రూపొందించింది. ఈ లెక్కప్రకారం చూస్తే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పేదవారు. ఇంతకుముందు 2011 సంవత్సరంలో అయితే గ్రామాల్లో రూ. 27, నగరాల్లో రూ. 33 కంటే ఎక్కువ ఖర్చుపెట్టేవాళ్లు పేదలు కారని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆ మొత్తం కొంత పెరిగిందన్నమాట. పేదలు కానివాళ్లంతా తమ ఆహారానికి, విద్యకు, ఆరోగ్యానికి తగినంత సంపద కలిగి ఉంటారని చెబుతున్నారు. అంటే.. భవిష్యత్తులో అలాంటివాళ్లకు ప్రభుత్వం అందించే ఉచిత పథకాలను వీరికి వర్తింపజేయక్కర్లేదని కూడా ప్రభుత్వాలు చెప్పే అవకాశం ఉంది. సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు నరేష్ అగర్వాల్ కూడా ఈ లెక్కలను ఖండించారు. రంగరాజన్‌కు తాము రోజుకు వంద రూపాయలు ఇచ్చి, పల్లెలో ఎలా బతకాలో చూపించమంటామని అగర్వాల్ అన్నారు. -
ప్రతి 10 మందిలో ముగ్గురు పేదలే!
2011-12లో పేదరికంపై రంగరాజన్ కమిటీ నివేదిక న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పదిమందిలో ముగ్గురు పేదవారేనని రంగరాజన్ కమిటీ స్పష్టం చేసింది. పేదరికంపై సురేశ్ టెండూల్కర్ కమిటీ అంచనాలను తోసిపుచ్చుతూ.. దేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉందని, 2011-12లో భారతదేశ జనాభాలో 29.5% మంది పేదవారేనని పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్‌కు సమర్పించింది. టెండూల్కర్ కమిటీ అంచనాల ఆధారంగా ప్రణాళిక సంఘం విడుదల చేసిన పేదరికం వివరాలపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దాంతో టెండూల్కర్ కమిటీ అంచనా విధానాన్ని పునఃపరిశీలించి, పేదరిక అంచనాలపై స్పష్టతనివ్వాలంటూ ప్రభుత్వం గత సంవత్సరం ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం * నగరాల్లో రోజుకు రూ. 47(నెలకు రూ. 1407) కన్నా తక్కువ ఖర్చు చేస్తున్నవారిని పేదలుగా గుర్తించారు. టెండూల్కర్ కమిటీ ఆ మొత్తాన్ని రూ. 33గా సూచించింది. * రూ. 32(నెలకు రూ. 972) కన్నా తక్కువ ఖర్చు చేసేవారిని పేదవారిగా గుర్తించారు. *2011 -12లో దేశంలో 36.3 కోట్ల మంది పేదలున్నారు. * 2009-10లో దేశంలో పేదరికం 38.2% ఉంది. అది 2011-12 నాటికి 29.5 శాతానికి తగ్గింది. అదే 2009-10 సంవత్సరంలో టెండూల్కర్ కమిటీ అంచనా ప్రకారం దేశంలో పేదరికం 29.8% ఉంది.