రిలయన్స్ గ్యాస్ ఓఎన్‌జీసీదే..
* విలువ దాదాపు రూ. 9వేల కోట్లు..
* కన్సల్టెన్సీ డీఅండ్‌ఎం ముసాయిదా నివేదిక
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య గ్యాస్ వివాదానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ డెగోల్యె అండ్ మెక్‌నాటన్ (డీఅండ్‌ఎం) శుక్రవారం ముసాయిదా నివేదికను సమర్పించింది. రెండు కంపెనీలతో పాటు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)కి కూడా నివేదికను అందించింది.
దీని ప్రకారం రిలయన్స్ (ఆర్‌ఐఎల్) కేజీ-డీ6 క్షేత్రం నుంచి వెలికి తీసిన గ్యాస్‌లో 9 మిలియన్ ఘనపు మీటర్ల సహజ వాయువు.. ఓఎన్‌జీసీకి చెందిన జీ4 బ్లాకు నుంచి వచ్చి ఉండొచ్చని డీఅండ్‌ఎం పేర్కొంది. దీని విలువ దాదాపు రూ. 9,000 కోట్లు ఉంటుందని తెలిపింది. ఉపరితలంపై సరిహద్దుల రీత్యా జీ4, కేజీ-డీ6 బ్లాకులు వేరువేరు అయినప్పటికీ, ఈ రెండింటికి ఉమ్మడిగా అనేక మీటర్ల లోతున ఒకే గ్యాస్ నిక్షేపం ఉందని డీఅండ్‌ఎం వివరించింది.
అందువల్లే రిలయన్స్ ఉత్పత్తి చేసిన గ్యాస్‌లో ఓఎన్‌జీసీ సహజ వాయువు కలిసిపోయి ఉంటుందని తెలిపింది. యూనిట్‌కు 4.2 డాలర్ల చొప్పున ఈ గ్యాస్ విలువ రూ. 8,675 కోట్లు ఉండగలదని అభిప్రాయపడింది. దీనిపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలిపిన తర్వాత డీఅండ్‌ఎం తుది నివేదిక రూపొందించనుంది.
ఆర్‌ఐఎల్ ఉద్దేశపూర్వకంగా సరిహద్దుల వెంబడి బావులు తవ్వి, తమ గ్యాస్‌ను తరలించుకుపోతోందంటూ 2013లో ఓఎన్‌జీసీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం రేగిన దరిమిలా రెండు సంస్థలు కలసి వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు డీఅండ్‌ఎం కన్సల్టెన్సీని నియమించుకున్నాయి. దీనిపై డీఅండ్‌ఎం తుది నివేదిక ఇచ్చిన ఆరు నెలల్లోగా ఓఎన్‌జీసీకి ఆర్‌ఐఎల్ నుంచి పరిహారం ఇప్పించడంపై కేంద్ర చమురు శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.