జిల్లాలో సహజవాయు నిక్షేపాలు?
జిల్లాలో సహజవాయు నిక్షేపాలు?
Published Wed, Jun 7 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
–ఏడాది కాలంగా ఓఎన్‌జీసీ అన్వేషణ
– ఆత్మకూరు పట్టణ శివార్లలో పరిశోధనలు
ఆత్మకూరురూరల్: కర్నూలు జిల్లాలో చమురు, సహజవాయు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయా? బొగ్గు నిక్షేపాలు కూడా ఉండవచ్చా? ఈ ప్రశ్నలకు త్వరలో సమాధానమిచ్చేందుకు చమురు సహజవాయు సంస్థ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కర్నూలు జిల్లా తూర్పు భాగమైన ఆత్మకూరు మొదలుకుని మహానంది, పాణ్యం, ఓర్వకల్ మండలాల పరిధిలో భారీ మొత్తంలో చమురు సహజవాయు నిక్షేపాలు ఉండవచ్చని ఇటీవల ఉపగ్రహ సమాచారం మేరకు ఓఎన్‌జీసీఓ నిర్ధారణకు వచ్చింది. సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు పలు బృందాలను రంగంలోకి దించింది. తొలుత ఈ ప్రాంతంలో హెలికాప్టర్ సహాయంతో çసర్వే జరపగా ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తూ వివిధ బృందాలు తమ సర్వేను కొనసాగిస్తున్నాయి. ఆత్మకూరు పట్టణ శివార్లలోని సాధుల మటం పరిసరాల్లో మంగళవారం ఓఎన్‌జీసీ సర్వేయర్ల బృందం సర్వే చేస్తూ కనిపించింది. ఈ ప్రాంతంలో కొన్ని పాయింట్లను గుర్తించిన ఈ బృందం ఆ కేంద్రాలపై సూచికలను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆధునిక పరికరాలను ఉంచి భూగర్భంలో ఉండే సహజవాయు, బొగ్గు నిక్షేపాల సాంధ్రతను నమోదు చేస్తున్నారు. భూమిలో ఎంత లోతులో ఈ నిక్షేపాలున్నాయి. వాటిని తవ్వితే పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందా లేదా అన్న అంశాలపై ఓఎన్‌జీసీ సమగ్ర సమాచారాన్ని శాస్త్రీయ పద్ధతిలో సేకరిస్తోంది. ఇదిలా ఉండగా ఓఎన్‌జీసీ ప్రయోగాల ఫలితాల గురించి అక్కడి సర్వేయర్లను ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
Advertisement