మూడు వారాల కనిష్టం
- 251 పాయింట్లు పతనం
- 25,063 వద్ద ముగిసిన సెన్సెక్స్
- ఆయిల్, రియల్టీ రంగాలు బోర్లా
- అదే బాటలో బ్యాంకింగ్, మెటల్
- మళ్లీ భారీగా పెరిగిన టర్నోవర్
- 7,493కు దిగిన నిఫ్టీ-76 పాయింట్లు డౌన్
సహజవాయువు ధరల పెంపు నిర్ణయాన్ని కేంద్రం 3 నెలలు వాయిదా వేయడంతో ఆయిల్ రంగ షేర్లు దెబ్బతిన్నాయి. మరోవైపు జూన్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో కొనుగోళ్లు కరువయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 25,063 వద్ద ముగిసింది. గత వారం రోజుల్లో ఇదే గరిష్ట పతనంకాగా, ఒక దశలో కనిష్టంగా 25,021ను తాకింది. ఇక నిఫ్టీ కూడా 76 పాయింట్లు క్షీణించింది.
7,500 పాయింట్ల కీలక స్థాయికి దిగువన 7,493 వద్ద నిలిచింది. మంగళవారంనాటి స్థాయిలో మరోసారి ఎక్స్ఛేంజీలలో టర్నోవర్ భారీగా పుంజుకుంది. ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌వోలో రూ. 4.29 లక్షలకోట్లకుపైగా నమోదుకాగా, బీఎస్‌ఈలో రూ. 2.31 లక్షల కోట్లు జరిగింది. వెరసి మొత్తం టర్నోవర్ రూ. 6.83 లక్షల కోట్లకు చేరింది. ఇది మార్కెట్ చరిత్రలో రెండో అత్యధిక టర్నోవర్ కావడం విశేషం! వర్షాభావ పరిస్థితులపై వాతావరణ శాఖ తాజా అంచనాలు కూడా సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు అంచనా.
ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్ డీలా..: ఆయిల్ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ 6% పతనంకాగా, ఆర్‌ఐఎల్ 4% దిగజారింది. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్ 5-2% మధ్య నీర సించాయి. బీఎస్‌ఈ ఆయిల్ ఇండెక్స్ 4% పడిపోగా, రియల్టీ 3% క్షీణించింది. రియల్టీ షేర్లలో డీబీ దాదాపు 7% పతనంకాగా, యూనిటెక్, డీఎల్‌ఎఫ్, అనంత్‌రాజ్, ఇండియాబుల్స్, హెచ్‌డీఐఎల్ 4-3% మధ్య నష్టపోయాయి. కాగా, బ్యాంకింగ్, మెటల్ రంగాలు సైతం 1% చొప్పున నష్టపోయాయి.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు..: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 602 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ట్రేడైన షేర్లలో 1,539 నష్టపోగా, 1,490 లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో ఎస్‌ఈ ఇన్వెస్ట్‌మెంట్స్, శ్రేయుంజ్, ఎడిల్‌వీజ్ ఫైనాన్షియల్, బీఈఎంఎల్, సియట్, మహీంద్రా సీఐఈ, జిందాల్ స్టీల్ 7-4% మధ్య క్షీణించాయి. అయితే మరోవైపు కేశోరాం, బాష్, దివాన్ హౌసింగ్, శ్రేయీ ఇన్‌ఫ్రా, టాటా ఎలక్సీ, ఎస్సార్ ఆయిల్, హెచ్‌సీసీ, ఫినొలెక్స్ ఇండస్ట్రీస్, అబాన్ ఆఫ్‌షోర్, పేజ్ ఇండస్ట్రీస్, జీఎస్‌పీఎల్, యూనికెమ్ 8.5-4.5% మధ్య పుంజుకున్నాయి.