కేజీ బేసిన్‌లో కొత్త బావులపై ఓఎన్‌జీసీ దృష్టి
- 40 బావుల్లో వెయ్యి ఎంఎంసీఎండీ నిక్షేపాలు
- రూ. 440 కోట్లతో డ్రిల్లింగ్‌కు ప్రణాళిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కృష్ణా, గోదావరి బేసిన్‌లో కొత్తగా ఆఫ్‌షోర్ నుంచి చమురు, సహజవాయువు నిక్షేపాలను వెలికితీయవచ్చని ఓఎన్‌జీసీ గుర్తించింది. మూడు జిల్లాల్లో విస్తరించిన ఈ బేసిన్ పరిధిలో 40 కొత్త బావులను ఎంపిక చేసి, వాటి డ్రిల్లింగ్ ద్వారా రోజుకు వెయ్యి మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంసీఎండీ) ఆయిల్ లేదా చమురుతో కూడిన సహజ వాయువు లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేసింది.
ఈ డ్రిల్లింగ్ కోసం రూ.440 కోట్లు వెచ్చించాలనే నిర్ణయానికి వచ్చింది. గత కొంతకాలంగా ఈ బేసిన్‌లో నిర్వహిస్తున్న సెస్మిక్ సర్వే ఫలితాలను బట్టి అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందనే అంచనాకు వచ్చింది. డ్రిల్లింగ్ చేపట్టేందుకు పర్యావరణ అనుమతి కోసం శుక్రవారం రాజోలులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఈ బేసిన్‌లో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధప్రాతిపదికన డ్రిల్లింగ్ నిర్వ హించనుంది.
ఎకడెక్కడ ఎన్ని బావులు..
కృష్ణా జిల్లాలో ఐదు, తూర్పుగోదావరి జిల్లాలో 22, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 బావుల్లో నిక్షేపాలు ఉన్నట్టుగా ఓఎన్‌జీసీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కృష్ణా జిల్లా కైకలూరులో మూడు, ముదినేపల్లి మండలం పెద్దకామనపల్లిలో ఒకటి, బంటుమిల్లి మండలం ముంజులూరులో ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఏలేటిపాడులో రెండు, పెనుగొండ మండలం చిన్నంవారిపాలెంలో ఎనిమిది, అదే మండలం సిద్ధాంతంలో ఒకటి, నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో ఒకటి, పెరవలి మండలం పి.వేమవరంలో ఒకటి, తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో మూడు, మండపేటలో ఐదు, సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఒకటి, మలికిపురం మండలం కేశనపల్లి వెస్ట్ పరిధిలో ఐదు, రాజోలు మండలం శివకోడు కమ్మపాలెం పరిధిలో ఏడు, అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో ఒక బావిలో ఆయిల్, గ్యాస్ ఉన్నట్టు గుర్తించారు.
గతంలో ఫలించిన అంచనాలు
తూర్పు గోదావరిలో 22 బావుల్లో డ్రిల్లింగ్ కోసం రూ.242 కోట్లు, కృష్ణా జిల్లాలో ఐదు బావులకు రూ.55 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 13 బావులకు రూ.143 కోట్లు కేటాయించారు. 40 బావుల ద్వారా వెయ్యి మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు లేదా ఆయిల్‌తో కూడిన గ్యాస్ లభిస్తుందని ఓఎన్‌జీసీ అంచనా. ఇదే మాదిరి రెండేళ్ల క్రితం కేజీ బేసిన్ పరిధిలోని మూడు జిల్లాల్లో డ్రిల్లింగ్ చేపట్టగా అంచనాలు నిజమయ్యాయి. అప్పట్లో ఆ బావుల్లో రోజుకు 840 టన్నుల ఆయిల్, 3.8 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు గ్యాస్ లభిస్తుందనే అంచనాలు ఫలించాయి. ఈ సారి కూడా అదే స్థాయిలో చమురు, సహజవాయువు నిక్షేపాలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
భూ సేకరణ కోసం...
ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ కార్యక్రలాపాలు నిర్వహించేందుకు ప్రతి బావి కోసం ఐదు నుంచి ఆరు ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా జిల్లాల యంత్రాంగాలకు ఓఎన్‌జీసీ ప్రతిపాదనలు పంపింది. పూర్తిస్థాయిలో చమురు అన్వేషణ చేపట్టి మూడు నుంచి నాలుగు నెలల్లో డ్రిల్లింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది.