CCEA
-
రైతులకు గుడ్‌న్యూస్.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) రబీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రబీ సీజన్ 2022-23(జూలై-జూన్), మార్కెటింగ్ సీజన్ 2023-24 కాలానికి గానూ ఎంఎస్పీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీసీఈఏ. గోదుమలకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్విటాలుకు రూ.400 పెంచింది. తాజా పెంపుతో గోదుమలు 2021-22లో క్వింటాలుకు రూ.2015 ఉండగా.. ప్రస్తుతం రూ.2,125కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ.5,450కి చేరింది. రబీ పంటకాలానికి గోదుమల పెట్టుబడి వ్యయం రూ.1,065గా అంచనా వేసింది కేంద్రం. పంటలకు క్వింటాలుకు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. ► మసూర్ పప్పుకు రూ.500 ► గోధుమలకు రూ.100 ► బార్లీ రూ.100, ► శనగలు రూ.150 ► సన్ ఫ్లవర్ రూ.209 ►ఆవాలు రూ.400 రూపాయలు -
బ్రెజిల్లో బీపీసీఎల్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: బ్రెజిలియన్ ఆయిల్ బ్లాక్‌లో అదనంగా 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం, బీపీసీఎల్ అనుబంధ సంస్థ భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్ (పీపీఆర్ఎల్) బ్రెజిల్‌లోని బీఎం–సీల్–11 కన్సెషన్ ప్రాజెక్ట్‌లో మరో 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ బ్లాక్‌లో 2026–27లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఈ బ్లాక్‌లో బీపీఆర్ఎల్కు 40 శాతం వాటా ఉంది. బ్రెజిల్ జాతీయ చమురు కంపెనీ పెట్రోబ్రాస్ 60 శాతం వాటాతో ఆపరేటర్‌గా ఉంది. చదవండి: New Delhi: దేశంలో ఆఫీస్ స్పేస్.. ఆ నగరం చాలా కాస్ట్లీ గురూ! -
మధ్యాహ్న భోజన పథకానికి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత మధ్యాహ్న భోజన పథకం పేరును ‘నేషనల్ స్కీమ్ ఫర్ పీఎం పోషణ్ ఇన్ స్కూల్స్’గా మారుస్తూ మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2021–22 నుంచి 2025–26 వరకూ ఐదేళ్లపాటు పథకాన్ని కొనసాగిస్తారు. ఇందుకు కేంద్రం రూ.54,061.73 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్ల మేరకు వ్యయాన్ని భరించనున్నాయి. అలాగే ఆహార ధాన్యాల కోసం కేంద్రం రూ.45 వేల కోట్లు అదనంగా వెచ్చించనుంది. మొత్తంగా ఐదేళ్లలో పీఎం పోషణ్ పథకం అమలుకు రూ.1,30,794.90 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడ్ పాఠశాలల్లో వండి, నిత్యం ఒకపూట వేడిగా భోజనం అందించే ఈ పథకంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. గతంలో ఈ పథకం పేరు ‘నేషనల్ స్కీమ్ ఫర్ మిడ్డే మీల్ ఇన్ స్కూల్స్’గా ఉండగా ఇప్పుడు ‘నేషనల్ స్కీమ్ ఫర్ పీఎం పోషణ్ ఇన్ స్కూల్స్’గా మార్చినట్టు కేంద్రం వెల్లడించింది. 2007 వరకు ఈ పథకం పేరు ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్’ అని ఉండగా, 2007లో ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మిడ్ డే మీల్ ఇన్ స్కూల్స్’గా మార్చారు. దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల మంది విద్యార్థులకు పీఎం పోషణ్ స్కీమ్ వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.24,400 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. పిల్లలకు ‘తిథి భోజనం’ ► పీఎం పోషణ్ పథకాన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ ప్రీ–ప్రైమరీ లేదా బాల వాటికలకు కూడా వర్తింపజేయాలని కేంద్రం యోచిస్తోంది. 11.80 కోట్ల విద్యార్థులకు ఇది అదనం. ► తిథి భోజనం కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ► ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయాల్లో ప్రత్యేకమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ఉద్దేశించిన సామాజిక భాగస్వామ్య కార్యక్రమం ఈ తిథి భోజనం. ► పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్స్ అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తోటల పెంపకాన్ని విద్యార్థులకు పరిచయం చేయడమే దీని ఉద్దేశం. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ► అన్ని జిల్లాల్లో సామాజిక తనిఖీలు తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అనుబంధ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారు. -
యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఓకే!
న్యూఢిల్లీ: యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ రూ.15,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనకు ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. మౌలిక రంగంలో పెట్టుబడులకు ఉద్దేశించి యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ (కెనడా పెన్షన్ ఫండ్‌కు అనుబంధ విభాగం) ఈ భారీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనను చేసింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వాటా యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్‌కు బదలాయింపు కూడా పెట్టుబడుల్లో భాగంగా ఉంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) విధానానికి, ఉపాధి కల్పనకు తాజా ఎఫ్‌డీఐ ప్రతిపాదన భారీ మద్దతునిస్తుందని ఈ మేరకు వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. -
ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాబోతుంది. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినేట్ ఎకనామిక్ అఫైర్స్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించింది. విశాఖ ఉక్కు సంస్థలో 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 22 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం 2002 నుంచి 2015 వరకు లాభాలు ఆర్జించింది. 2015 నుంచి 2018 వరకు నష్టాలు చవిచూసింది. 2018-19లో 97 కోట్ల రూపాయలు లాభం సాధించినా తర్వాత మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకుంది. చదవండి: 'విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాజేయాలని చూస్తే ఊరుకోం' -
ఎగుమతులకు కేంద్రం ఊతం
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల ఎగుమతులకు తోడ్పాటునిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎగుమతులకు బీమాపరంగా మరింత విస్తృత ప్రయోజనం కల్పించేలా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌కు రూ. 2,000 కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. అలాగే, నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అకౌంట్ ట్రస్టుకు (ఎన్‌ఈఐఏ)కి రూ. 1,040 కోట్లు గ్రాంట్–ఇన్–ఎయిడ్ కింద అందించే ప్రతిపాదననూ ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఈసీజీసీకి ప్రతిపాదిత నిధులు దశలవారీగా అందించడం జరుగుతుంది. చిన్న, మధ్య తరహా సంస్థల ఎగుమతులకు మరింత బీమా కవరేజీనివ్వడంతో పాటు, ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు దోహదపడగలవని కేంద్రం ఒక ఆధికారిక ప్రకటనలో వివరించింది. మరో రెండు చమురు స్టోరేజీలకు ఓకే.. ఇంధన భద్రత సాధించే దిశగా మరో రెండు వ్యూహాత్మక భూగర్భ ముడిచమురు గిడ్డంగులను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ఏర్పాటుతో అత్యవసర పరిస్థితుల్లో 22 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 12 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటున్నాయి. ఒడిశాలోని చండీకోల్‌లో 4 మిలియన్ టన్నులు, కర్ణాటకలోని పాదూరులో 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్ధ్యంతో స్టోరేజీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, మంగళూరు, పాదూరులో మొత్తం 5.33 మిలియన్ టన్నుల నిల్వ సామర్ధ్యంతో స్టోరేజీ కేంద్రాలు ఉన్నాయి. ఇథనాల్ రేటు పెంపు.. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో ఇంధనాల్లో ఇథనాల్ వాడకాన్ని పెంచేలా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇథనాల్ ధరను లీటరుకు దాదాపు రూ. 3 మేర పెంచింది. దీంతో.. లీటరు ఇథనాల్ ధర రూ. 43.70కి చేరింది. పెట్రోల్‌లో 10 శాతం దాకా ఇథనాల్‌ను కలపాల్సి ఉంటుంది. కానీ ఇథనాల్ లభ్యత అంతంతమాత్రంగానే ఉండటంతో ఇది కేవలం 4 శాతానికే పరిమితమవుతోంది. సి–మొలాసిస్ నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్‌కు డిసెంబర్ 2018 నుంచి మొదలయ్యే షుగర్ మార్కెటింగ్ సంవత్సరం నుంచి అధిక రేటు వర్తిస్తుందని గోయల్ పేర్కొన్నారు. మరోవైపు మధ్యరకం మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌కు కేంద్రం తొలిసారిగా లీటరు ధర రూ. 47.49గా నిర్ణయించింది. -
పప్పు ధాన్యాల ధరలకు కళ్లెం..!
న్యూఢిల్లీ: నింగిని తాకుతున్న పప్పుధాన్యాల ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. పప్పుధాన్యాల నిల్వలను భారీ ఎత్తున పెంచాలని ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది. ప్రస్తుతం 8 లక్షలుగా ఉన్న బఫర్ స్టాక్ ను 20 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. దేశీయ సేకరణ ద్వారా 10 లక్షల టన్నులు, దిగుమతి ద్వారా 10 లక్షల టన్నులను సేకరించనున్నట్టుతెలిపింది. పప్పుధాన్యాల నిల్వలు పెంచితే అది భవిష్యత్తులో ధరలకు కళ్లెం వేయడానికి ఉపయోగపడుతుందని సీసీఈఏ అంచనా వేస్తోంది. కాగా ఈ ఏడాది జూన్ లో సబ్సిడీపై కిలో రూ.120కు విక్రయించేందుకు వీలుగా పప్పుధాన్యాల నిల్వలను 8లక్షల టన్నులకు పెంచిన సంగతి తెలిసిందే. -
సామాన్యుడికీ విమానయోగం!
♦ కొత్త పౌర విమానయాన పాలసీకి కేబినెట్ ఆమోదం ♦ అరగంట ప్రయాణ వ్యవధికి చార్జీ రూ.1,250 మాత్రమే... ♦ వివాదాస్పద 5/20 నిబంధనకు చెల్లు... ♦ ప్రాంతీయ కనెక్టివిటీ పెంపునకు పాలసీలో పెద్దపీట... ♦ దీనికోసం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు... టికెట్లపై అదనపు పన్ను ♦ ప్రయాణాల రద్దు రుసుములపైనా పరిమితి.. బ్యాగేజీ చార్జీల తగ్గింపు న్యూఢిల్లీ: సామాన్యుడికి విమానయానాన్ని మరింత చేరువచేయడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు నడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విమానయాన పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు రూ.2,500 మాత్రమే టికెట్ చార్జీని వసూలు చేయాల్సి ఉంటుంది. అదే అరగంటకైతే రూ.1,250 మాత్రమే చార్జీ ఉండాలి. అంతేకాకుండా దేశంలోకి మరిన్ని ఎయిర్‌లైన్ కంపెనీలు అడుగుపెట్టేందుకు వీలుగా వివాదాస్పద 5/20 నిబంధనకు కూడా చరమగీతం పాడింది. ప్రయాణికులకు టికెట్ రద్దుపై భారీగా కోతపెట్టకుండా పరిమితి విధింపు, అదనపు బ్యాగేజీపై రుసుము తగ్గింపుతోపాటు అకస్మాత్తుగా ప్రయాణాలను రద్దు చేసే ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం అందేవిధంగా నిబంధనలను చేర్చారు. బుధవారమిక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఏవియేషన్ పాలసీకి ఆమోదముద్ర పడింది. ఇప్పటిదాకా విమానసర్వీసులు లేని రూట్లలో విమానాలను నడిపే ఆపరేటర్లు, ఎయిర్‌లైన్స్ కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలను కూడా పాలసీలో కల్పించారు. మరోపక్క, ప్రాంతీయంగా విమాన సర్వీసులను పెంచేందుకు వీలుగా రీజినల్ కనెక్టివిటీ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రయాణికులపై అదనంగా స్వల్ప పన్నును విధించనున్నారు. గేమ్ చేంజర్ పాలసీ ఇది: అశోక్ గజపతి రాజు దేశీ విమానయాన రంగాన్ని సమూలంగా మార్చివేసే(గేమ్ చేంజర్) పాలసీగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు దీన్ని అభివర్ణించారు. భారత్‌లో మొట్టమొదటి సమీకృత జాతీయ పౌర వియానయాన పాలసీని తీసుకొచ్చిన ఘనత తమ ఎన్డీఏ ప్రభుత్వానిదేనని ట్వీట్ చేశారు. ఈ కొత్త విధానం కారణంగా 2022 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించనుందని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా విమానయాన ప్రయాణాన్ని మరింత మందికి చేరువచేసేలా టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేలా చర్యలు తీసుకోవడం, ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటకం, మౌలిక వసతుల ను మెరుగుపరచడం ద్వారా వ్యాపారాలకు మెరుగైన పరిస్థితులను కల్పించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యాలని అశోక్ గజపతి వివరించారు. కాగా, 5/20 నిబంధన రద్దుపై కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. అసంబంద్ధమైన ఈ నిబంధనను చెత్తబుట్టలోకి విసిరేశామన్నారు. కొత్త పాలసీ విమానయాన పరిశ్రమకు కీలక మలుపు అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు, నిపుణులు పేర్కొన్నారు. ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు రావడానికి, సామాన్యునికి విమాన సేవలను చేరువ చేయడానికి దోహదం చేస్తుందన్నారు. ఇతర ముఖ్యాంశాలివీ... ♦ హెలికాప్టర్ సర్వీసులకు సంబంధించి విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రత్యేక నిబంధనలను రూపొందించనుంది. నిషేధిత ఎయిర్‌స్పేస్ వెలుపల 5,000 అడుగుల కంటే తక్కువ ఎత్తులో తిరిగే హెలీకాప్టర్లకు ఇప్పటిదాకా అనేక ♦ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇకపై ఈ అడ్డంకులు తొలగించనుండటంతో ప్రమాద, నిర్మాణ ప్రదేశాల నుంచి సులువుగా ల్యాండింగ్, టేకాఫ్‌లకు వీలు కలగనుంది. ♦ భారత్‌ను విమాన మరమ్మతులు, మెయింటెనెన్స్ కార్యకాలాపాలకు(ఎంఆర్ఓ) ప్రధాన గమ్యం(హబ్)గా చేసేందుకు పాలసీలో చర్యలు చేపట్టారు. పాలసీ ఆమోదం పొందిన తర్వాత నుంచి ఐదేళ్లపాటుఎంఆర్ఓ బిజినెస్ సంస్థలకు ఎయిర్‌పోర్టు ఆపరేటర్లు అదనపు చార్జీలు, రాయల్టీలను విధించకూడదు. అదేవి దంగా తగినంత స్థలాన్ని కూడా చూపాల్సి ఉంటుంది. ఈ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను విధించకూడదు. ♦ కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ) కొనసాగించనుంది. ఇప్పటికే ఏఏఐ ఎయిర్‌పోర్టు ఉన్న 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టుకు గనుక అనుమతిస్తే.. ఏఏఐకి తగువిధంగా నష్టపరిహారాన్ని ఇవ్వనున్నారు. ♦ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం. గంట ప్రయాణానికి చార్జీ రూ.2,500 మాత్రమే...! విమానయానాన్ని చౌకగా, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇకపై అరగంట ప్రయాణ వ్యవధిగల టికెట్లపై రూ.1,250... గంట ప్రయాణ వ్యవధిగల టికెట్ చార్జీ రూ.2,500కు మాత్రమే పరిమితమయ్యేలా పాలసీలో ఫిక్స్ చేశారు. 130 కోట్ల మంది ప్రజలున్న మన దేశంలో ఏటా 80 లక్షల మంది మాత్రమే విమాన ప్రయాణం చేస్తున్నారని.. తాజా పాలసీ చర్యలతో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మంత్రి అశోక్ గజపతి చెబుతున్నారు. ఈ రేట్లను కంపెనీలు భరించేందుకుగాను ప్ర భుత్వం పన్ను రాయితీలను కల్పిస్తోంది. విమాన ఇంధనం(ఏటీఎఫ్)పై అన్ని రాష్ట్రాలూ ఇక వ్యాట్‌ను 1 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్రం కూడా ఎయిర్‌లైన్స్ కంపెనీలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను కల్పించనుంది. 5/20 రూల్ ఇక 0/20... విదేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు కొత్త ఎయిర్‌లైన్స్ కంపెనీలకు అడ్డంకిగా ఉన్న వివాదాస్పద 5/20 రూల్‌ను కొత్త పాలసీలో పూర్తిగా రద్దు చేశారు. ఏదైనా దేశీ ఎయిర్‌లైన్స్ విదేశీ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించాలంటే కార్యకలాపాలు ప్రారంభించి 5 ఏళ్లు పూర్తవడంతోపాటు కనీసం 20 విమానాలు కంపెనీకి ఉండాలనేది 5/20 నిబంధన. కొత్తగా ప్రారంభమైన ఎయిర్ఏషియా, విస్తారా వంటి ఎయిర్‌లైన్స్ దీన్ని రద్దు చేయాలని వాదించగా.. పాత ఎయిర్‌లైన్స్ మాత్రం తమకు వర్తింపజేసిన ఈ రూల్‌ను అర్ధంతరంగా ఎలా రద్దు చేస్తారంటూ అభ్యంతరాలను లేవనెత్తాయి. అయితే, కేంద్రం ఈ రూల్‌ను తొలగించే విషయంలో కొంత మధ్యేమార్గాన్ని అనుసరించింది. 5/20 స్థానంలో ఇప్పుడు 0/20 నిబంధనను ప్రవేశపెట్టనున్నారు. అంటే విదేశీ రూట్లకు విస్తరించాలంటే కనీసం 20 విమానాలు ఉంటే సరిపోతుంది. లేదంటే తమకున్న విమానాల్లో 20 శాతాన్ని దేశీయ కార్యకలాపాలకు ఉపయోగిస్తే చాలు అనుమతి లభిస్తుంది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్... దేశంలో విమాన సర్వీసులకు ప్రాంతీయ అనుసంధాన్ని పెంచేందుకు దీన్ని ప్రవేశపెడుతున్నారు. దీనిప్రకారం నిరుపయోగంగా ఉన్న 350 ఎయిర్‌స్ట్రిప్‌లు, ఎయిర్‌పోర్టులను ప్రభుత్వం గుర్తించింది. వీటిని డిమాండ్‌కు అనుగుణంగా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రీజినల్ కనెక్టివిటీ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేశీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన టికెట్లపై అదనంగా స్వల్ప పన్ను విధింపు ద్వారా ఈ ఫండ్‌కు నిధులను సమకూర్చనున్నట్లు పాలసీలో ప్రకటించారు. రద్దు ఫీజులు, రిఫండ్స్ ఇలా... ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకుంటే ఇకపై ఎయిర్‌లైన్స్ చార్జీలో బేస్ ధర కంటే ఎక్కువగా ఫీజు రూపంలో కోతవేయడానికి లేకుండా పాలసీలో పరిమితి విధించారు. అదేవిధంగా ఫ్లైట్ లేదా టికెట్ రద్దయితే ప్రయాణికుడికి 15 రోజుల్లోగా రిఫండ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక, రాయితీ ధరలపై విక్రయించే టికెట్లపై కూడా ఇకపై రిఫండ్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ అవకాశం లేదు. మరోపక్క, బోర్డింగ్ పాస్ ఇచ్చాక ఏ కారణంగానైనా ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్‌ను రద్దు చేయడం, ప్రయాణానికి అనుమతించకపోతే ఇకపై భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తుంది. కొత్త పాలసీ ప్రకారం తొలుత నిర్దేశించిన ప్రయాణ సమయానికి 24 లోపు మళ్లీ ప్రయాణానికి వీలుకల్పిస్తే... నష్టపరిహారం 200%(బేస్ ధర, ఇంధన సర్‌చార్జీలపై) ఉంటుంది. దీనికి గరిష్ట పరిమితి రూ.10,000. అదే 24 గంటల తర్వాత ప్రత్యామ్నాయ ఫ్లైట్ చూపిస్తే... నష్టపరిహారం 400%(గరిష్టంగా రూ.20,000) చెల్లించాలి. గంటలోపు మరో ఫ్లైట్‌కు గనుక పంపిస్తే ఎలాంటి నష్టపరిహారం ఉండదు. అదనపు బ్యాగేజీపై ఫీజు తగ్గింపు.. ఇప్పటివరకూ విమానాల్లో చెక్-ఇన్ కింద ఉచితంగా 15 కేజీల వరకూ బ్యాగేజీని అనుమతిస్తున్నాయి. చార్జీ చెల్లిస్తే గరిష్టంగా 20 కేజీలకు అనుమతి ఉంది. ప్రస్తుతం అదనపు బ్యాగేజీపై ప్రతి కేజీకి ఎయిర్‌లైన్స్ రూ.250-350 వరకూ చార్జీని విధిస్తున్నాయి. పాలసీలో దీన్ని తగ్గిస్తూ కేవలం రూ.100కే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. అయితే, ఎయిరిండియా ఫ్లైట్లలో 25 కేజీల వరకూ ఉచిత బ్యాగేజీకి అనుమతిస్తుండటంతో ఈ రూల్ దీనికి వర్తించదు. -
మూడు హెచ్ఎంటీ కంపెనీల మూసివేత
న్యూఢిల్లీ: హిందూస్థాన్ మెషీన్ టూల్స్ (హెచ్ఎంటీ) చెందిన మూడు కంపెనీలను మూసివేసేందుకు కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ(సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. హెచ్ఎంటీ వాచెస్, హెచ్ఎంటీ చినార్ వాచెస్, హెచ్ఎంటీ బేరింగ్స్ కంపెనీలను మూసివేయనున్నారు. ఈ మూడు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వీఆర్ఎస్, వీఎస్ఎస్ కింద చెల్లింపులు జరుపుతామని సీసీఈఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రూ.427.48 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులకు 2007 పే స్కేల్ కింద చెల్లింపులు జరుతామని తెలిపింది. ఈ మూడు హెచ్ఎంటీ కంపెనీలకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయిస్తామని ప్రకటించింది. -
సీసీఈఏకు అరబిందో ఎఫ్‌డీఐ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రభుత్వం 11 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.1,076 కోట్లుగా ఉంది. ఇక ఫార్మా కంపెనీలు-గ్లెన్‌మార్క్, ఆరబిందో ఫార్మాల రూ.4,187 కోట్ల విలువైన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఆఫైర్స్(సీసీఈఏ)కు నివేదించింది. రూ.2,165 కోట్ల విదేశీ పెట్టుబడులను క్విబ్ ద్వారా సమీకరించాలన్న హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరబిందో ఫార్మా ప్రతిపాదను సీసీఈఏ పరిశీలనకు పంపించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 4న జరిగిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) సూచనల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించింది. -
ముడిచక్కెర ఎగుమతి సబ్సిడీకి కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: చక్కెర మిల్లులకు ఊరటనిచ్చే విధంగా ప్రస్తుత మార్కెటింగ్ సీజన్లో (2014 అక్టోబర్-2015 సెప్టెంబర్) దాదాపు 14 లక్షల టన్నుల వరకూ ముడి చక్కెర ఎగుమతులకు సబ్సిడీనివ్వాలని కేంద్రం నిర్ణయించింది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం టన్నుకు రూ. 4,000 చొప్పున ఎక్స్పోర్ట్ సబ్సిడీ లభిస్తుంది. క్రితం ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో నిర్ణయించిన రూ. 3,371 కన్నా ఇది అధికం. చెరకు రైతులకు బకాయిలు చెల్లించలేక సతమతమవుతున్న మిల్లర్లకు తోడ్పాటునిచ్చే దిశగా దాదాపు 40 లక్షల టన్నుల ముడి చక్కెర ఎగుమతులపై గతేడాది ప్రభుత్వం సబ్సిడీనిచ్చింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరానికి పొడిగించకపోవడంతో ఈ స్కీమును గతేడాది సెప్టెంబర్‌తో ముగిసింది. తాజాగా దీన్ని కొనసాగిస్తూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. తాజా గణాంకాల ప్రకారం మిల్లర్లు రూ. 12,300 కోట్లు బకాయిపడ్డారు. -
కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఈ వారంలో నిర్ణయం!
న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో 10 శాతం వాటా విక్రయం ప్రతిపాదనకు ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్రవేసే అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో కంపెనీ డిజిన్వెస్ట్మెంట్కు ఓకే చెప్పవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీలో కేంద్రానికి 89.65 శాతం వాటా ఉంది. గురువారంనాటి షేరు ముగింపు ధర(రూ.356) ప్రకారం చూస్తే 10 శాతం వాటా(63.16 కోట్ల షేర్లు) అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ.22,428 కోట్లు లభించవచ్చని అంచనా. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న రూ.43,425 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ మొత్తంలో ఒక్క కోల్ ఇండియా వాటా విక్రయం ద్వారానే సగానికిపైగా ఖజానాకు సమకూరనుండటం గమనార్హం. ఓఎఫ్‌ఎస్‌లలో రిటైలర్లకు 20% కోటా: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల వాటా అమ్మకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లకు మరింత భాగస్వామ్యం కల్పించేందుకు ఆర్థిక శాఖ లైన్‌క్లియర్ చేసింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో షేర్ల విక్రయంలో ప్రస్తుతం 10 శాతంగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల కోటాను 20 శాతానికి పెంచినట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భవిష్యత్తులో చేపట్టే పీఎస్‌యూ డిజిన్వెస్ట్‌మెంట్‌లకు దీన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. -
సహజవాయువు ధర అక్కడే..
- పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసిన కేంద్ర కేబినెట్ - మరో 3 నెలల వరకూ ప్రస్తుత రేట్లే... న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర గ్యాస్ ఉత్పత్తి కంపెనీల ఎదురుచూపులు ఫలించలేదు. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు ధర పెంపుపై నిర్ణయాన్ని కేంద్రం మరో మూడు నెలలు వాయిదా వేసింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) భేటీలో ధరల పెంపు అంశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో గతేడాది ఆమోదించిన వివాదాస్పద గ్యాస్ ధరల పెంపు ఫార్ములాపై విస్తృతస్థాయిలో సమీక్ష జరపడం కోసం ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు ఆయన చెప్పారు. రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ధరను ప్రస్తుతం ఉన్న 4.2 డాలర్ల స్థాయి(ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు) నుంచి 8.8 డాలర్లకు పెంచాల్సి ఉంది. వాస్తవానికి దీన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలు చేయాల్సిఉన్నప్పటికీ... ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో జూలై 1 నుంచి పెంపు అమలుచేయవచ్చని కంపెనీలు భావించాయి. అయితే, గ్యాస్ ధర పెంపు విషయంలో గతంలో యూపీఏపై ఎదురుదాడి చేసిన బీజేపీ... ఇప్పుడు ఎకాఎకిన గత ప్రభుత్వం నిర్ణయాన్నే అమలుచేస్తే తమపై ప్రతికూలతకు దారితీయొచ్చనే కారణంతో వాయిదా మంత్రాన్ని జపించింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటాం... ‘కేబినెట్ భేటీలో గ్యాస్ ధరను సెప్టెంబర్ చివరివరకూ ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించాం. ఈ అంశంపై అన్ని పక్షాలతోనూ మరింత విస్తృతంగా సంప్రదింపులు జరపాలని కేబినెట్ భావించింది. ముఖ్యంగా ధర పెంపు విషయంలో ప్రజాప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ప్రధాన్ చెప్పారు. గత శుక్రవారం నుంచి ఈ విషయంపై ప్రధాని మోడీతో మూడుసార్లు ప్రధాన్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కాగా, మరోసారి సమీక్ష కోసం నిపుణుల కమీటీ లేదా మంత్రుల బృందం వంటివి ఏర్పాటు చేస్తారాలేదా అనేది ప్రధాన్ చెప్పలేదు. అయితే, ప్రధాని కార్యాలయం(పీఎంఓ), చమురు శాఖలు ఈ సమీక్ష యంత్రాంగాన్ని నిర్ణయిస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అయితే, పూర్తిగా కొత్త ఫార్ములాను ప్రతిపాదిస్తారా లేదంటే రంగరాజన్ ఫార్ములాలోనే మార్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ధర పెంపును 7-7.5 డాలర్లకు పరిమితం చేయడం, కొత్త బ్లాక్‌ల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు మాత్రమే ధర పెంపును వర్తింపజేయడం ఇతరత్రా కొన్ని ప్రతిపాదనలను ఇందుకోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుత గ్యాస్ ధరలతో కొత్త క్షేత్రాల అభివృద్ధి తమకు లాభసాటికాదని.. తక్షణం రేట్లు పెంచాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడుతున్న రిలయన్స్.. దాని భాగాస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)లకు మోడీ సర్కారు వాయిదా నిర్ణయం మింగుడుపడని అంశమే. ఏప్రిల్ 1 నుంచి ధర పెంపును అమలు చేయనందుకుగాను రిలయన్స్ ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం) నోటీసును కూడా జారీ చేసింది. ధర పెంపుతో ప్రజలపై తీవ్ర ప్రభావం రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం సహజవాయువు ధరను 8.8 డాలర్లకు గనుక పెంచితే అది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా విద్యుత్ చార్జీలు ఒక్కో యూనిట్‌కు రూ.2 వరకూ ఎగబాకవచ్చని అంచనా. దీంతోపాటు వాహనాలకు వాడే సీఎన్జీ రేట్లు కూడా ఒక్కో కేజీకి రూ.12 వరకూ(ఢిల్లీలో) పెరిగే అవకాశాలున్నాయి. పైపుల ద్వారా సరఫరా చేసే వంటగ్యాస్ ధర కూడా పెరిగిపోనుంది. ఎరువుల కంపెనీలకు గ్యాస్ ధర భారం కావడంతో వాటికి ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల సబ్సిడీలు కూడా ఎగబాకేందుకు దారితీయనుంది. ఒక్కో డాలరు గ్యాస్ ధర పెంపుతో యూరియా ఉత్పత్తి ధర టన్నుకు రూ.1,370 చొప్పున ఎగబాకుతుంది. ఈ పరిణామాలతో ద్రవ్యోల్బణం దూసుకెళ్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. -
రిలయన్స్ గ్యాస్ ధర పెంపునకు పచ్చజెండా..
గ్యాస్ అక్రమ నిల్వ(హోర్డింగ్), ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించారనే అంశాలకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ ఇచ్చే పక్షంలో వచ్చే ఏప్రిల్ నుంచి సహజ వాయువు ధరను దాదాపు రెట్టింపు పెంచడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను అనుమతించాలని సీసీఈఏ గురువారం నిర్ణయించింది. కొత్త ధర(యూనిట్‌కు 8.4 డాలర్లు-ప్రస్తుత ధర 4.2 డాలర్లు) ప్రకారం ఆర్ఐఎల్కు పెరిగే ఆదాయానికి సమాన స్థాయిలో బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కేజీ-డీ6 బ్లాకులోని డీ1, డీ3 క్షేత్రాల్లో 2010-11 నుంచి గ్యాస్‌ను హోర్డింగ్ చేశారని, ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని తగ్గించారని రుజువైన పక్షంలో బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వం నగదుగా మార్చుకుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్ఐఎల్ గ్యాస్ ధర పెంపును తిరస్కరించాలని చమురు శాఖ ముందుగా భావించింది. గత మూడేళ్లలో ఉత్పత్తి లోటును ఆర్ఐఎల్ భర్తీ చేసేవరకు లేదా ఉత్పత్తి లక్ష్యఛేదనలో వైఫల్యానికి తమ బాధ్యత ఏమీ లేదని సంస్థ రుజువు చేసేంతవరకు ధర పెంపును అంగీకరించకూడదని ప్రతిపాదించింది. అయితే, ఈ వివాద పరిష్కారానికి మధ్యేమార్గంగా బ్యాంకు గ్యారంటీని తెరపైకి తెచ్చారు. -
చక్కెర మిల్లులకు తీపి కబురు..
న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న చక్కెర కర్మాగారాలకు తీపి కబురు ఇది. చెరకు రైతులకు చెల్లింపులు చేసేందుకు మిల్లులకు రూ.6,600 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాలపై వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.2,750 కోట్ల మేరకు ఉండే వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. గురువారం నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ తెలిపారు. ద్రవ్య సంక్షోభం నుంచి చక్కెర మిల్లులు గట్టెక్కడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సారథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం చేసిన సిఫార్సుల మేరకు సీసీఈఏ ఈ నిర్ణయం తీసుకుంది. షుగర్ మిల్లులకు ఈ రుణాలను బ్యాంకులు సమకూరుస్తాయి. చెరకు రైతులకు చెల్లించడానికి మాత్రమే ఈ సొమ్మును వినియోగించాలి. రైతుల పాత బకాయిలనూ తీర్చవచ్చు. గత మూడేళ్లలో చక్కెర మిల్లులు చెల్లించిన ఎక్సైజ్ సుంకానికి సమాన స్థాయిలో రుణాలలిస్తారు. వీటిని ఐదేళ్లలో తిరిగి చెల్లించాలి. రుణ చెల్లింపుపై తొలి రెండేళ్లు మారటోరియం సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అంటే మూడో ఏట నుంచి రుణ చెల్లింపు ప్రారంభించవచ్చు. పరిమాణపరంగా ఎలాంటి ఆంక్షల్లేకుండా పంచదార ఎగుమతులను కొనసాగించాలన్న ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. దేశీయ మార్కెట్లో అవసరానికి మించి చక్కెర నిల్వలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖల మంత్రి మనీష్ తివారీ చెప్పారు. బొగ్గు గనుల నుంచి గ్యాస్ ఉత్పత్తికి అనుమతి తమ అధీనంలోని బొగ్గు గనుల సహజ వాయువు ఉత్పత్తి చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్‌కు లెసైన్స్ ఇవ్వాలని సీసీఈఏ నిర్ణయించింది. కోల్ ఇండియాకు చెందిన బొగ్గు గనుల్లో కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) అన్వేషణ, ఉత్పత్తికి అనుమతించినట్లు బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ తెలిపారు. ఆహార భద్రతా ప్రణాళిక, వాణిజ్య సహకార ఒప్పందాలపై ఇటీవలి డబ్ల్యుటీఓ సదస్సులో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరిని సీసీఈఏ సమర్థించింది. భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ సబ్సిడీలపై శాశ్వత పరిష్కారం కనుగొనే వరకు ఈ అంశాన్ని సవాలు చేయరాదని బాలిలో జరిగిన డబ్ల్యుటిఓ సదస్సులో నిర్ణయించారు. -
పవర్‌గ్రిడ్ ఎఫ్‌పీవోకు క్యాబినెట్ అనుమతి
న్యూఢిల్లీ: విద్యుత్‌రంగ దిగ్గజం పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ మలి పబ్లిక్ ఇష్యూ(ఎఫ్‌పీవో)కు గురువారం ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం అనంతరం విద్యుత్ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌పీవో నిర్వహణకు ఎస్బీఐ క్యాప్స్, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్సహా ఐదు మర్చంట్ బ్యాంకర్ సంస్థలను సైతం ప్రభుత్వం ఎంపిక చేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం మొత్తం 17% వాటాను విక్రయించనుంది. దీనిలో ప్రభుత్వ వాటా4%(18.51 కోట్ల షేర్లు) కాగా, మిగిలిన 13%(60.18 కోట్ల షేర్లు) వాటాను కంపెనీ కొత్తగా జారీ చేయనుంది. వీటిలో 2.4% షేర్లను ఉద్యోగులకు కంపెనీ కేటాయించనుంది. ప్రస్తుత ధర ప్రకారం ఎఫ్‌పీవో ద్వారా కంపెనీకి రూ. 5,700 కోట్లు, కేంద్రానికి రూ. 1,700 కోట్లు చొప్పున లభించనున్నాయి. బీఎస్ఈలో గురువారం షేరు ధర 1.1% నష్టపోయి రూ. 95 వద్ద ముగిసింది. ఎఫ్‌పీవో తరువాత కంపెనీలో ప్రభుత్వ వాటా 57.89 శాతానికి పరిమితంకానుంది. ఇంతక్రితం కూడా షేరుకి రూ. 90 ధరలో ప్రభుత్వం 2010 నవంబర్‌లో 10% వాటాను ఎఫ్‌పీవో ద్వారా విక్రయించింది. -
2014 నుంచి షేల్ గ్యాస్ ఉత్పత్తి: ఓఎన్జీసీ
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ కంపెనీ వాణిజ్యపరంగా షేల్ గ్యాస్ ఉత్పత్తిని వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. ఈ ఏడాది 10 బావులను డ్రిల్ చేయాలని యోచిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తిని చేపట్టే అవకాశాలున్నాయని ఓఎన్జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ శుక్రవారం చెప్పారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) నిర్వహించిన ఇండియా ఆయిల్ అండ్ గ్యాస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. నామినేషన్ ప్రాతిపదికన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు కేటాయించిన బ్లాకుల్లో షేల్ గ్యాస్ ఉత్పత్తికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఇటీవలనే అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే గుజరాత్లో షేల్‌గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నామని, దీని కోసం కొనాకొ ఫిలిప్స్ సంస్థ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నామని వాసుదేవ వివరించారు. గుజరాత్‌లోని కాంబే బేసిన్లో తొలి షేల్ గ్యాస్ బావిని ఈ సంస్థే డ్రిల్లింగ్ చేస్తోంది. -
జెట్-ఎతిహాద్ డీల్‌కు ఓకే
న్యూఢిల్లీ: దాదాపు రూ. 2,058 కోట్ల విలువ చేసే జెట్ ఎయిర్వేస్-ఎతిహాద్ డీల్‌కి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగాయి. గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) దీనికి ఆమోదముద్ర వేసింది. ఇది దేశీయ విమానయాన రంగానికి, ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చగలదని పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. వివిధ నియంత్రణ సంస్థలు ఈ డీల్‌కి ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు ఆయన వివరించారు. ఈ ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ పరిశీలిస్తుండటమనేది..నిరంతర ప్రక్రియలో భాగమని పేర్కొన్నారు. ప్రతిపాదిత డీల్ కింద జెట్ ఎయిర్వేస్లో 24 శాతం వాటాలను అబుదాబి సంస్థ ఎతిహాద్ కొనుగోలు చేస్తోంది. ఇది పూర్తయ్యాక జెట్ ప్రమోటర్ నరేష్ గోయల్‌కి 51 శాతం, ఎతిహాద్‌కి 24 శాతం వాటాలు ఉంటాయి. మిగతాది పబ్లిక్ షేర్‌హోల్డర్ల చేతిలో ఉంటుంది. దేశీయ విమానయాన రంగంలో ఇదే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కానుంది. ఏప్రిల్‌లోనే ఈ డీల్‌ని ప్రకటించినప్పటికీ నియంత్రణ సంస్థల అభ్యంతరాల కారణంగా జాప్యం జరిగింది. ఒప్పందం సాకారమైతే... విదేశీ సంస్థ ఎతిహాద్‌కి జెట్ఎయిర్వేస్పై యాజమాన్య అధికారాలు దఖలు పడతాయన్న ఆందోళనే ఇందుకు కారణం. ఈ పరిణామాలతో ఒప్పందంలో పలు సవరణల అనంతరం తాజాగా డీల్‌కి ఆమోదం లభించింది. మొజాంబిక్-ఓవీఎల్ ఒప్పందానికీ ఓకే.. మొజాంబిక్ గ్యాస్ క్షేత్రంలో ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్), ఆయిల్ ఇండియా (ఆయిల్) 20 శాతం వాటాలను కొనుగోలు చేసే ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ క్షేత్రంలో 65 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉంటుందని అంచనా. రెండు విడతలుగా ఈ కొనుగోలు జరగనుంది. ముందుగా ఓవీఎల్, ఆయిల్ కలిసి .. ఈ క్షేత్రంలో వీడియోకాన్‌కి చెందిన 10 శాతం వాటాలను 2.475 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తాయి. ఆ తర్వాత అందార్కో పెట్రోలియంకి చెందిన 10 శాతం వాటాలను ఓవీఎల్ స్వయంగా 2.64 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేస్తుంది. -
15 ఎఫ్‌డీఐలకు ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వం శుక్రవారం రూ.2,000 కోట్ల విలువైన 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రెండు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను తుది ఆమోదం కోసం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)కి నివేదించింది. 10 ప్రతిపాదనలను వాయిదా వేసింది. సీసీఈఏకు నివేదించిన వాటిల్లో రూ.10,668 కోట్ల విలువైన మైలాన్ ప్రతిపాదన, రూ. 5,500 కోట్ల విలువైన ఐడీఎఫ్సీ ట్రస్టీ కంపెనీ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ రెండు ప్రతిపాదనల విలువ రూ.1,200 కోట్ల మించి ఉండటంతో వీటిని సీసీఈఏకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదించింది. గత నెల 27న జరిగిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) సమావేశం సూచనల మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ 15 ఎఫ్‌డీఐలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటి వివరాలు..., జుబిలంట్ ఫార్మా, సింగపూర్(రూ.1,145 కోట్లు), లోటస్ సర్జికల్ స్పెషాల్టీస్(రూ.150 కోట్లు), సిమ్బయోటెక్ ఫార్మాల్యాబ్(రూ.306 కోట్లు), అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్(రూ.200 కోట్లు). -
పన్ను ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం
న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో ప్రత్యేకంగా పన్నుల కార్యాలయం(రాజశ్వ భవన్) నిర్మాణానికి తొలి అడుగు పడింది. రూ.485 కోట్ల అంచనా వ్యయంతో న్యూఢిల్లీలో ఈ కార్యాలయం నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకూ నార్త్‌బ్లాక్ నుంచి పన్నులకు సంబంధించి ప్రధాన కార్యకలాపాల నిర్వహణ జరుగుతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ఒకే భవనం నుంచి పనిచేయడానికి తాజా నిర్ణయం దోహదపడనుంది. -
హైదరాబాద్‌కు మరో భారీ ఐటి హబ్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు మరో భారీ ఐటి హబ్ ను ఏర్పాటు చేసేందుకు సీసీఈఏ పచ్చజెండా ఊపింది. 2.19 లక్షల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ ఐటీ హబ్ ను ఏర్పాటు చేయడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం ఐటీఐఆర్ గా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనపై ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) శుక్రవారం పరిశీలించింది. ఐటీఐఆర్‌లో ఉత్పాదక యూనిట్లు, లాజిస్టిక్స్, పబ్లిక్ యుటిలిటీస్, పర్యావరణ పరిరక్షణ, గృహ సముదాయాలు, పాలనా సంబంధ సర్వీసుల వంటివి ఏర్పాటవుతాయి. వీటిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్ఈజెడ్), పారిశ్రామిక పార్క్‌లు, స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలు, గిడ్డంగులు(వేర్‌హౌసింగ్), ఎగుమతి యూనిట్లు తదితరాలను కూడా నెలకొల్పే అవకాశముంది. 25 ఏళ్ల కాలంలో 50,000 ఎకరాలలో రెండు దశలలో ఐటీఐఆర్ ఏర్పాటవుతుంది. తద్వారా 15 లక్షల మంది యువకులకు ప్రత్యక్ష ఉపాధి లభించగలదు. దేశ ఐటీ ఎగుమతుల్లో రాష్ర్టం వాటా 12.4%కాగా, 4వ ర్యాంక్‌లో ఉంది. 2011-12లో రాష్ట్రం నుంచి ఐటీ సేవల ద్వారా రూ.53,246 కోట్ల టర్నోవర్ నమోదైంది. -
గ్యాస్ ఆధారిత విద్యుత్‌పై సబ్సిడీ!
న్యూఢిల్లీ: దేశీయంగా సహజవాయువు(గ్యాస్) లభ్యత అడుగంటిపోయి విద్యుత్ ప్లాంట్లకు సరఫరాలు ఆవిరవుతున్న నేపథ్యంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ భారీ సబ్సిడీ ప్రణాళికకు తెరలేపింది. అధిక గ్యాస్ రేట్ల కారణంగా పెరిగిపోతున్న కరెంట్ చార్జీల భారం ప్రజలపై పడకుండా ప్లాంట్లకు సుమారు రూ.11 వేల కోట్ల సబ్సిడీని చెల్లించే ప్రతిపాదనను రూపొందించింది. దీనికి సంబంధించి ముసాయిదా నోట్‌ను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)కి సమర్పించింది. దీని ప్రకారం దేశీయంగా లభిస్తున్న చౌక గ్యాస్, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఖరీదైన ద్రవీకృత సహజవాయువు(ఎన్ఎన్జీ) ధరల సగటు రేటును(దీన్నే పూలింగ్గా కూడా వ్యవహరిస్తారు) అన్ని గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లకు ఏకరూప(యూనిఫాం) రేటుగా వర్తింపజేయాలనేది కూడా తాజా ప్రతిపాదనలో ఉంది. ‘ఇలాచేసిన తర్వాత కూడా యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం సుమారు రూ.10 వరకూ అయ్యే అవకాశం ఉంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ మాత్రం కేవలం యూనిట్‌కు రూ.5.50ను మాత్రమే వినియోగదారులపై చార్జీగా విధించగలదు. మిగతా భారాన్ని ప్లాంట్లకు ప్రత్యక్ష నగదు చెల్లింపుద్వారా ప్రభుత్వం సబ్సిడీగా భరించాల్సి ఉంటుంది’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2015-16 నాటికి... రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోవడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు సరఫరాలు లేక మూతపడేస్థాయికి చేరాయి. దేశీ గ్యాస్ క్షేత్రాల నుంచి విద్యుత్ ప్లాంట్లకు రోజుకు 71.29 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్ కేటాయించగా.. కేవలం 17.25 ఎంఎంఎస్‌సీఎండీలు మాత్రమే సరఫరా జరుగుతోంది. మరో 3.5 ఎంఎంఎస్‌సీఎండీల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంటున్నా అనేక ప్లాంట్లు ఇంధనం లేక నిలిచిపోయాయి. దీంతె ఈ ఆర్థిక సంవత్సరం నుంచే గ్యాస్ పూలింగ్/సగటు ధర విధానాన్ని అమలు చేయాలనేది విద్యుత్ శాఖ వాదన. దీని ప్రకారం చూస్తే ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) గ్యాస్ రేటు 11.43 డాలర్లుగా పడుతుంది. ఈ లెక్కన ప్లాంట్లకు విద్యుదుత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10.47కు చేరుతుంది. ఇంత భారీ రేటును వినియోగదార్లు భరించే అవకాశం లేదనేది విద్యుత్ శాఖ వాదన. అందుకే యూనిట్ చార్జీ రూ.5.50కి మించి.. ఆపై పడే రేటును ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించాలని ప్రతిపాదించింది. దీనికి సీసీఈఏ ఆమోదం తెలిపి అమల్లోకివస్తే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలలకు ప్రభుత్వం విద్యుత్ ప్లాంట్లకు రూ.2,498 కోట్లను సబ్సిడీగా చెల్లించాల్సి వస్తుందని అంచనా. వచ్చే ఏడాది ఈ సబ్సిడీ మొత్తం రూ.8,646 కోట్లకు, 2015-16లో రూ.10,849 కోట్లకు చేరనుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. దేశీ గ్యాస్ ధర ఎంబీటీయూకి 4.2 డాలర్లే ఉన్నా ఉత్పత్తి పడిపోవడంతో తీవ్ర కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ పూలింగ్ విధానం అమలుతో క్రమంగా అన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అవకాశం లభిస్తుందని, తద్వారా రుణాలను తిరిగి చెల్లించేందుకు వీలవుతుందని విద్యుత్ శాఖ అభిప్రాయపడింది. కాగా, గతంలో గ్యాస్ పూలింగ్ను వ్యతిరేకించిన ఈ శాఖ.. విద్యుదుత్పత్తి కంపెనీల అసోసియేషన్ విజ్ఞప్తుల మేరకు తాజా ప్రతిపాదనను సీసీఈఏకు సమర్పించడం గమనార్హం.