ఎగుమతులకు కేంద్రం ఊతం | Government provides funds to ECGC, NEIA to boost exports | Sakshi
Sakshi News home page

ఎగుమతులకు కేంద్రం ఊతం

Published Wed, Jun 27 2018 11:31 PM | Last Updated on Wed, Aug 15 2018 2:40 PM

Government provides funds to ECGC, NEIA to boost exports - Sakshi

న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల ఎగుమతులకు తోడ్పాటునిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎగుమతులకు బీమాపరంగా మరింత విస్తృత ప్రయోజనం కల్పించేలా ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌కు రూ. 2,000 కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. అలాగే, నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇన్సూరెన్స్‌ ఇన్సూరెన్స్‌ అకౌంట్‌ ట్రస్టుకు (ఎన్‌ఈఐఏ)కి రూ. 1,040 కోట్లు గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్‌ కింద అందించే ప్రతిపాదననూ ఆమోదించింది.

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఈసీజీసీకి ప్రతిపాదిత నిధులు దశలవారీగా అందించడం జరుగుతుంది. చిన్న, మధ్య తరహా సంస్థల ఎగుమతులకు మరింత బీమా కవరేజీనివ్వడంతో పాటు, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికన్‌ దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు దోహదపడగలవని కేంద్రం ఒక ఆధికారిక ప్రకటనలో వివరించింది.  

మరో రెండు చమురు స్టోరేజీలకు ఓకే..
ఇంధన భద్రత సాధించే దిశగా మరో రెండు వ్యూహాత్మక భూగర్భ ముడిచమురు గిడ్డంగులను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటి ఏర్పాటుతో అత్యవసర పరిస్థితుల్లో 22 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 12 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటున్నాయి.

ఒడిశాలోని చండీకోల్‌లో 4 మిలియన్‌ టన్నులు, కర్ణాటకలోని పాదూరులో 2.5 మిలియన్‌ టన్నుల నిల్వ సామర్ధ్యంతో స్టోరేజీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, మంగళూరు, పాదూరులో మొత్తం 5.33 మిలియన్‌ టన్నుల నిల్వ సామర్ధ్యంతో స్టోరేజీ కేంద్రాలు ఉన్నాయి.  

ఇథనాల్‌ రేటు పెంపు..
ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో ఇంధనాల్లో ఇథనాల్‌ వాడకాన్ని పెంచేలా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇథనాల్‌ ధరను లీటరుకు దాదాపు రూ. 3 మేర పెంచింది. దీంతో.. లీటరు ఇథనాల్‌ ధర రూ. 43.70కి చేరింది. పెట్రోల్‌లో 10 శాతం దాకా ఇథనాల్‌ను కలపాల్సి ఉంటుంది.

కానీ ఇథనాల్‌ లభ్యత అంతంతమాత్రంగానే ఉండటంతో ఇది కేవలం 4 శాతానికే పరిమితమవుతోంది. సి–మొలాసిస్‌ నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్‌కు డిసెంబర్‌ 2018 నుంచి మొదలయ్యే షుగర్‌ మార్కెటింగ్‌ సంవత్సరం నుంచి అధిక రేటు వర్తిస్తుందని గోయల్‌ పేర్కొన్నారు. మరోవైపు మధ్యరకం మొలాసిస్‌ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌కు కేంద్రం తొలిసారిగా లీటరు ధర రూ. 47.49గా  నిర్ణయించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement