జెట్-ఎతిహాద్ డీల్‌కు ఓకే
జెట్-ఎతిహాద్ డీల్‌కు ఓకే
Published Fri, Oct 4 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
న్యూఢిల్లీ: దాదాపు రూ. 2,058 కోట్ల విలువ చేసే జెట్ ఎయిర్‌వేస్-ఎతిహాద్ డీల్‌కి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగాయి. గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) దీనికి ఆమోదముద్ర వేసింది. ఇది దేశీయ విమానయాన రంగానికి, ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చగలదని పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. వివిధ నియంత్రణ సంస్థలు ఈ డీల్‌కి ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు ఆయన వివరించారు. ఈ ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ పరిశీలిస్తుండటమనేది..నిరంతర ప్రక్రియలో భాగమని పేర్కొన్నారు. ప్రతిపాదిత డీల్ కింద జెట్ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటాలను అబుదాబి సంస్థ ఎతిహాద్ కొనుగోలు చేస్తోంది.
ఇది పూర్తయ్యాక జెట్ ప్రమోటర్ నరేష్ గోయల్‌కి 51 శాతం, ఎతిహాద్‌కి 24 శాతం వాటాలు ఉంటాయి. మిగతాది పబ్లిక్ షేర్‌హోల్డర్ల చేతిలో ఉంటుంది. దేశీయ విమానయాన రంగంలో ఇదే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కానుంది. ఏప్రిల్‌లోనే ఈ డీల్‌ని ప్రకటించినప్పటికీ నియంత్రణ సంస్థల అభ్యంతరాల కారణంగా జాప్యం జరిగింది. ఒప్పందం సాకారమైతే... విదేశీ సంస్థ ఎతిహాద్‌కి జెట్‌ఎయిర్‌వేస్‌పై యాజమాన్య అధికారాలు దఖలు పడతాయన్న ఆందోళనే ఇందుకు కారణం. ఈ పరిణామాలతో ఒప్పందంలో పలు సవరణల అనంతరం తాజాగా డీల్‌కి ఆమోదం లభించింది.
మొజాంబిక్-ఓవీఎల్ ఒప్పందానికీ ఓకే..
మొజాంబిక్ గ్యాస్ క్షేత్రంలో ఓఎన్‌జీసీ విదేశ్ (ఓవీఎల్), ఆయిల్ ఇండియా (ఆయిల్) 20 శాతం వాటాలను కొనుగోలు చేసే ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ క్షేత్రంలో 65 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉంటుందని అంచనా. రెండు విడతలుగా ఈ కొనుగోలు జరగనుంది. ముందుగా ఓవీఎల్, ఆయిల్ కలిసి .. ఈ క్షేత్రంలో వీడియోకాన్‌కి చెందిన 10 శాతం వాటాలను 2.475 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తాయి. ఆ తర్వాత అందార్కో పెట్రోలియంకి చెందిన 10 శాతం వాటాలను ఓవీఎల్ స్వయంగా 2.64 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేస్తుంది.
Advertisement
Advertisement