న్యూఢిల్లీ: ప్రభుత్వం శుక్రవారం రూ.2,000 కోట్ల విలువైన 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రెండు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను తుది ఆమోదం కోసం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)కి నివేదించింది. 10 ప్రతిపాదనలను వాయిదా వేసింది. సీసీఈఏకు నివేదించిన వాటిల్లో రూ.10,668 కోట్ల విలువైన మైలాన్ ప్రతిపాదన, రూ. 5,500 కోట్ల విలువైన ఐడీఎఫ్‌సీ ట్రస్టీ కంపెనీ ప్రతిపాదనలు ఉన్నాయి.
ఈ రెండు ప్రతిపాదనల విలువ రూ.1,200 కోట్ల మించి ఉండటంతో వీటిని సీసీఈఏకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదించింది. గత నెల 27న జరిగిన ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) సమావేశం సూచనల మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ 15 ఎఫ్‌డీఐలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటి వివరాలు..., జుబిలంట్ ఫార్మా, సింగపూర్(రూ.1,145 కోట్లు), లోటస్ సర్జికల్ స్పెషాల్టీస్(రూ.150 కోట్లు), సిమ్‌బయోటెక్ ఫార్మాల్యాబ్(రూ.306 కోట్లు), అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్నాలజీస్(రూ.200 కోట్లు).