న్యూఢిల్లీ: వంటగ్యాస్ (ఎల్‌పీజీ) కూడా అతి త్వరలో ఓపెన్‌మారెక్ట్ (సబ్సిడీ రహిత) కానుందా..? కేంద్ర ప్రభుత్వ తీరును చూస్తే సామాన్యుడికి సైతం ఈ సందేహం రాకమానదు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రెట్టింపయ్యాయి. కానీ, సర్కారు సబ్సిడీ మాత్రం ఇదే కాలంలో రెండంకెల స్థాయికి దిగిపోయింది. వంటగ్యాస్‌పై ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని గణనీయంగా తగ్గించుకుందని స్పష్టంగా అర్థమవుతోంది.
దీంతో ప్రైవేటు సంస్థలైన గోగ్యాస్, ప్యూర్‌గ్యాస్, రిలయన్స్ గ్యాస్ తదితర కంపెనీలకు ఈ విభాగంలో ద్వారాలు తెరుచుకున్నట్టయింది. ఈ సంస్థలు ప్రధానంగా వాణిజ్య ఎల్‌పీజీ విక్రయాలకే ఇంతకాలం పరిమితం అయ్యాయి. ఎందుకంటే కేంద్ర సర్కారు ప్రభుత్వరంగ చమురు/గ్యాస్ కంపెనీలకే ఎల్‌పీజీ విక్రయాలపై సబ్సిడీలను పరిమితం చేసింది.
అంటే ఈ సబ్సిడీయే ప్రైవేటు సంస్థలకు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిందని చెప్పుకోవాలి. కానీ, ఈ సబ్సిడీలకు కేంద్రం మంగళం పాడటం మొదలుపెట్టింది. ఇప్పటికీ సబ్సిడీ ఇస్తున్నా కానీ.. ఒక్కో గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఇది రూ.40–50ను మించడం లేదు. వాస్తవానికి పెరుగుతున్న ధరలకు తగ్గట్టు కేంద్రం సబ్సిడీ కూడా పెరగాలి. కానీ, కేంద్ర సర్కారు తెలివిగా ఈ భారం మొత్తాన్ని క్రమంగా వినియోగదారుల నెత్తినే రుద్దే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పుకోవాలి.
ఇదీ పరిస్థితి..
ప్రస్తుతానికి ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.884గా ఉంది. గత ప్రభుత్వాలు ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.500లోపే పరిమితం చేశాయి. కానీ, కేంద్రంలోని మోదీ సర్కారు.. డీజిల్, పెట్రోల్‌పై క్రమంగా సబ్సిడీని ఎత్తివేసిన తీరులోనే.. ఎల్‌పీజీ సబ్సిడీని గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు ఒక్కో సిలిండర్ (ఏడాదికి గరిష్టంగా ఒక వినియోదారుకు 12 సిలిండర్లకే సబ్సిడీ)కు ఇస్తున్న నామమాత్రపు రూ.40 సబ్సిడీని ఎత్తివేయడానికి ఎక్కువ సమయం పట్టేట్టు లేదు.
ఓపెన్ మార్కెట్..
ప్రభుత్వ విధానం.. ప్రైవేటు సంస్థలకు వ్యాపార వరంగా మారనుంది. భారత్ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎల్‌పీజీ మార్కెట్లోకి దూకుడుగా వెళ్లే ప్రణాళికలతో ఉంది. ఈ సంస్థ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లో వంటగ్యాస్ కనెక్షన్ల విక్రయాలను చేపట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అతిపెద్ద రిఫైనరీ ఉండడంతో చుట్టుపక్కల ఉన్న ఈ రాష్ట్రాలకు సులభంగా సిలిండర్లను చేరవేయగలదు.
అహ్మదాబాద్‌లో రిలయన్స్ గ్యాస్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 15 కిలోలు ధర ప్రస్తుతం రూ.1,200గా ఉంది. అంటే కిలో ధర రూ.80. ఏజిస్ లాజిస్టిక్స్‌కు చెందిన ప్యూర్‌గ్యాస్ ఒక్కో సిలిండర్‌ను రూ.1,300కు విక్రయిస్తోంది. అంటే కిలో ధర రూ.87. గోగ్యాస్ (కాన్ఫిడెన్స్ పెట్రోలియం) 15 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌కు రూ.1,200 వసూలు చేస్తోంది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) విక్రయిస్తున్న సిలిండర్ ధరలు రూ.900 స్థాయిలో ఉన్నాయి.
మా సేవలు చూడండి..
వేగవంతమైన సేవలకు మాది పూచీ.. ఇది ప్రైవేటు సంస్థలు చెబుతున్న మాట. కనెక్షన్‌ను వెంటనే జారీ చేయడం.. సిలిండర్‌ను 48 గంటల్లోనే డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల నుంచి కనెక్షన్‌కు రోజుల నుంచి వారాలు కూడా పట్టే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంటోంది. ‘‘ఓఎంసీలు కనెక్షన్ ఇచ్చే ముందు ఎంతో పరిశీలన చేస్తాయి.
సబ్సిడీ గణనీయంగా తగ్గిపోయినా కానీ వారి విధానం మారలేదు’’ అంటూ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ ఒకరు వాపోవడం గమనార్హం. పైగా గృహ వినియోగ గ్యాస్ వాణిజ్య అవసరాలకు మళ్లకుండా ఓంఎసీలు ప్రయతి్నస్తుంటాయి. గృహ ఎల్‌పీజీపై 5 శాతం జీఎస్‌టీ అమల్లో ఉంటే.. వాణిజ్య ఎల్‌పీజీపై ఇది 18%గా ఉండడం గమనార్హం.
ప్రైవేటుకు బాటలు..
పెట్రోలియం శాఖ సమాంతర మార్కెటింగ్ వ్యవస్థ (పీఎంఎస్) కింద కల్పించిన సరళీకరణలు ప్రైవేటు సంస్థలకు అనుకూలించాయి. పీఎంఎస్ కింద ఎల్‌పీజీ దిగుమతి, నిల్వ, రవాణా, బాట్లింగ్, మార్కెటింగ్, పంపిణీ, విక్రయాలకు అవకాశాలు పెరిగాయనేది క్రిసిల్ అంచనా. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఎల్‌పీజీని ప్రభుత్వ ఓఎంసీలకే సరఫరా చేయాలన్న 2014 నాటి ఆదేశాలను పెట్రోలియం శాఖ పక్కన పెట్టేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతీ నెలా 10,000 టన్నుల ఎల్‌పీజీని ప్రైవేటు సంస్థలకు విక్రయించుకునేందుకు 2015లో అను మతించింది. దీంతో ప్రైవేటు సంస్థలు రిలయన్స్ నుంచి గ్యాస్‌ను కొనుక్కునే అవకాశం ఏర్పడింది.
ఇదొక్కటీ మారితే..
ఓఎంసీ సంస్థలతో పోలిస్తే ఎల్‌పీజీ గ్యాస్ మార్కెట్‌లో రిలయన్స్ మినహా మిగిలిన సంస్థలకు అంత సానుకూలతలు ఇప్పటికైతే కనిపించడం లేదు. ఎందుకంటే అవి దేశీయ రిఫైనరీ సంస్థల నుంచి ఎల్‌పీజీని కొనుగోలు చేసుకోవడం లేదంటే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ‘ఓఎంసీలు విక్రయించే ఎల్‌పీజీని చమురు నుంచి ఉత్పత్తి చేస్తున్నాయి. దాంతో వాటిపై దిగుమతి సుంకం (5%) ఉండడం లేదు. ప్రైవే టు సంస్థలు రిఫైనరీలు లేకపోతే (ప్రైవేటులో రిలయన్స్‌కే రిఫైనరీలున్నాయి).. దిగుమతి చేసుకోవడం లేదంటే దేశీయ సంస్థల నుంచి కొనుగో లు చేసుకోవడం చేయాలి. దీంతో తయారీ వ్య యాలు పెరుగుతాయి. ఇది ధరలపై ప్రభా వం చూపిస్తోంది’ అని ఐవోసీ అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment