Private agencies
-
వంటగ్యాస్.. ప్రైవేటు రూట్!
న్యూఢిల్లీ: వంటగ్యాస్ (ఎల్పీజీ) కూడా అతి త్వరలో ఓపెన్మారెక్ట్ (సబ్సిడీ రహిత) కానుందా..? కేంద్ర ప్రభుత్వ తీరును చూస్తే సామాన్యుడికి సైతం ఈ సందేహం రాకమానదు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రెట్టింపయ్యాయి. కానీ, సర్కారు సబ్సిడీ మాత్రం ఇదే కాలంలో రెండంకెల స్థాయికి దిగిపోయింది. వంటగ్యాస్‌పై ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని గణనీయంగా తగ్గించుకుందని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ప్రైవేటు సంస్థలైన గోగ్యాస్, ప్యూర్గ్యాస్, రిలయన్స్ గ్యాస్ తదితర కంపెనీలకు ఈ విభాగంలో ద్వారాలు తెరుచుకున్నట్టయింది. ఈ సంస్థలు ప్రధానంగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలకే ఇంతకాలం పరిమితం అయ్యాయి. ఎందుకంటే కేంద్ర సర్కారు ప్రభుత్వరంగ చమురు/గ్యాస్ కంపెనీలకే ఎల్పీజీ విక్రయాలపై సబ్సిడీలను పరిమితం చేసింది. అంటే ఈ సబ్సిడీయే ప్రైవేటు సంస్థలకు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిందని చెప్పుకోవాలి. కానీ, ఈ సబ్సిడీలకు కేంద్రం మంగళం పాడటం మొదలుపెట్టింది. ఇప్పటికీ సబ్సిడీ ఇస్తున్నా కానీ.. ఒక్కో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై ఇది రూ.40–50ను మించడం లేదు. వాస్తవానికి పెరుగుతున్న ధరలకు తగ్గట్టు కేంద్రం సబ్సిడీ కూడా పెరగాలి. కానీ, కేంద్ర సర్కారు తెలివిగా ఈ భారం మొత్తాన్ని క్రమంగా వినియోగదారుల నెత్తినే రుద్దే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పుకోవాలి. ఇదీ పరిస్థితి.. ప్రస్తుతానికి ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.884గా ఉంది. గత ప్రభుత్వాలు ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.500లోపే పరిమితం చేశాయి. కానీ, కేంద్రంలోని మోదీ సర్కారు.. డీజిల్, పెట్రోల్‌పై క్రమంగా సబ్సిడీని ఎత్తివేసిన తీరులోనే.. ఎల్పీజీ సబ్సిడీని గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు ఒక్కో సిలిండర్ (ఏడాదికి గరిష్టంగా ఒక వినియోదారుకు 12 సిలిండర్లకే సబ్సిడీ)కు ఇస్తున్న నామమాత్రపు రూ.40 సబ్సిడీని ఎత్తివేయడానికి ఎక్కువ సమయం పట్టేట్టు లేదు. ఓపెన్ మార్కెట్.. ప్రభుత్వ విధానం.. ప్రైవేటు సంస్థలకు వ్యాపార వరంగా మారనుంది. భారత్ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎల్పీజీ మార్కెట్లోకి దూకుడుగా వెళ్లే ప్రణాళికలతో ఉంది. ఈ సంస్థ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లో వంటగ్యాస్ కనెక్షన్ల విక్రయాలను చేపట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అతిపెద్ద రిఫైనరీ ఉండడంతో చుట్టుపక్కల ఉన్న ఈ రాష్ట్రాలకు సులభంగా సిలిండర్లను చేరవేయగలదు. అహ్మదాబాద్‌లో రిలయన్స్ గ్యాస్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 15 కిలోలు ధర ప్రస్తుతం రూ.1,200గా ఉంది. అంటే కిలో ధర రూ.80. ఏజిస్ లాజిస్టిక్స్‌కు చెందిన ప్యూర్గ్యాస్ ఒక్కో సిలిండర్‌ను రూ.1,300కు విక్రయిస్తోంది. అంటే కిలో ధర రూ.87. గోగ్యాస్ (కాన్ఫిడెన్స్ పెట్రోలియం) 15 కిలోల ఎల్పీజీ సిలిండర్‌కు రూ.1,200 వసూలు చేస్తోంది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) విక్రయిస్తున్న సిలిండర్ ధరలు రూ.900 స్థాయిలో ఉన్నాయి. మా సేవలు చూడండి.. వేగవంతమైన సేవలకు మాది పూచీ.. ఇది ప్రైవేటు సంస్థలు చెబుతున్న మాట. కనెక్షన్‌ను వెంటనే జారీ చేయడం.. సిలిండర్‌ను 48 గంటల్లోనే డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల నుంచి కనెక్షన్‌కు రోజుల నుంచి వారాలు కూడా పట్టే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంటోంది. ‘‘ఓఎంసీలు కనెక్షన్ ఇచ్చే ముందు ఎంతో పరిశీలన చేస్తాయి. సబ్సిడీ గణనీయంగా తగ్గిపోయినా కానీ వారి విధానం మారలేదు’’ అంటూ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ ఒకరు వాపోవడం గమనార్హం. పైగా గృహ వినియోగ గ్యాస్ వాణిజ్య అవసరాలకు మళ్లకుండా ఓంఎసీలు ప్రయతి్నస్తుంటాయి. గృహ ఎల్పీజీపై 5 శాతం జీఎస్టీ అమల్లో ఉంటే.. వాణిజ్య ఎల్పీజీపై ఇది 18%గా ఉండడం గమనార్హం. ప్రైవేటుకు బాటలు.. పెట్రోలియం శాఖ సమాంతర మార్కెటింగ్ వ్యవస్థ (పీఎంఎస్) కింద కల్పించిన సరళీకరణలు ప్రైవేటు సంస్థలకు అనుకూలించాయి. పీఎంఎస్ కింద ఎల్పీజీ దిగుమతి, నిల్వ, రవాణా, బాట్లింగ్, మార్కెటింగ్, పంపిణీ, విక్రయాలకు అవకాశాలు పెరిగాయనేది క్రిసిల్ అంచనా. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఎల్పీజీని ప్రభుత్వ ఓఎంసీలకే సరఫరా చేయాలన్న 2014 నాటి ఆదేశాలను పెట్రోలియం శాఖ పక్కన పెట్టేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతీ నెలా 10,000 టన్నుల ఎల్పీజీని ప్రైవేటు సంస్థలకు విక్రయించుకునేందుకు 2015లో అను మతించింది. దీంతో ప్రైవేటు సంస్థలు రిలయన్స్ నుంచి గ్యాస్‌ను కొనుక్కునే అవకాశం ఏర్పడింది. ఇదొక్కటీ మారితే.. ఓఎంసీ సంస్థలతో పోలిస్తే ఎల్పీజీ గ్యాస్ మార్కెట్లో రిలయన్స్ మినహా మిగిలిన సంస్థలకు అంత సానుకూలతలు ఇప్పటికైతే కనిపించడం లేదు. ఎందుకంటే అవి దేశీయ రిఫైనరీ సంస్థల నుంచి ఎల్పీజీని కొనుగోలు చేసుకోవడం లేదంటే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ‘ఓఎంసీలు విక్రయించే ఎల్పీజీని చమురు నుంచి ఉత్పత్తి చేస్తున్నాయి. దాంతో వాటిపై దిగుమతి సుంకం (5%) ఉండడం లేదు. ప్రైవే టు సంస్థలు రిఫైనరీలు లేకపోతే (ప్రైవేటులో రిలయన్స్‌కే రిఫైనరీలున్నాయి).. దిగుమతి చేసుకోవడం లేదంటే దేశీయ సంస్థల నుంచి కొనుగో లు చేసుకోవడం చేయాలి. దీంతో తయారీ వ్య యాలు పెరుగుతాయి. ఇది ధరలపై ప్రభా వం చూపిస్తోంది’ అని ఐవోసీ అధికారి చెప్పారు. -
రోడ్లు మిలమిల
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో రోడ్ల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు త్వరలో సమసిపోనున్నాయి. ఇకపై ప్రధాన రహదారుల మార్గాల్లోని 709కి.మీ. మేర రోడ్ల పనుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలు చూసుకోనున్నాయి. ఈ మేరకు జోన్ల వారీగా 7 ప్యాకేజీలుగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. దీనిలో 4 ప్యాకేజీలకు అనుమతులిస్తూ ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. మిగతా 3 ప్యాకేజీలకు ఆర్థిక శాఖ అనుమతి రాగానే.. జీవోలు వెలువడనున్నాయి. తర్వాత వారం రోజుల్లోగా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అమల్లోకి రానుంది. దీంతో టెండరు దక్కించుకున్న సంస్థలు నెలరోజుల్లో గ్రేటర్ రోడ్ల గుంతల పూడ్చివేతను పూర్తిచేస్తాయి. అనంతరం 6 నెలల్లోగా స్వల్ప మరమ్మతులు, ప్యాచ్‌వర్క్‌లు వంటివి పూర్తిచేసి వాహనాలు సాఫీగా ప్రయాణించేలా చేస్తాయి. ఆ తర్వాత కాంట్రాక్ట్ మేరకు తొలి ఏడాది 50%, రెండో ఏడాది 30%, మూడో ఏడాది 20% పనుల వంతున కొత్తగా రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తాయి. ఆ తర్వాత రెండేళ్లు నిర్వహణ వెరసి మొత్తం ఐదేళ్ల కాంట్రాక్టు. బీటీతో సహా ఎక్కడ ఏ విధానం అవసరమనుకుంటే దాన్ని పాటించవచ్చు. 10% వరకు ఆధునిక సాంకేతికతనూ వినియోగించుకోవచ్చు. ఎటొచ్చీ రోడ్లు తళతళలాడుతూ, నిత్యం సాఫీ ప్రయాణానికి అనువుగా ఉండాలి. అంతేకాదు రోడ్ల వెంబడి ఫుట్‌పాత్‌లు, పచ్చదనం, రోడ్లపై పారిశుధ్యం బాధ్యతలు కూడా కాంట్రాక్టు ఏజెన్సీలే చూసుకోవాలి. సామర్థ్యమున్న సంస్థలే ఎంపిక ఈ మొత్తం ప్రక్రియలో భాగంగా రోడ్ల నిర్వహణలో ఎక్కడా జాప్యం జరగకుండా ఉండేందుకు టెండర్లో నిబంధనలు చేర్చారు. తగిన ఆర్థిక సామర్థ్యంతోపాటు అవసరమైన యంత్రాంగం, సిబ్బంది ఉన్న సంస్థలనే టెండర్లో పాల్గొనేందుకు అర్హమైనవిగా నిబంధన విధించారు. ఏడాదికి కనీసం రూ.400 కోట్ల టర్నోవర్ నిబంధన విధించగా, అంతకు 4 రెట్ల టర్నోవర్ ఉన్న ఏజెన్సీలు వచ్చాయని చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్ తెలిపారు. రోడ్ల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడమనేది ఇప్పటివరకు నేషనల్ హైవే రోడ్లకు ఉంది. స్థానిక సంస్థల పరిధిలో మాత్రం ఇదే ప్రథమమని ఇంజనీర్లు పేర్కొన్నారు. వీటి పర్యవేక్షణాధికారం తదితరమైనవన్ని జోనల్ కమిషనర్లవే. సమగ్ర రోడ్ నిర్వహణ కాంట్రాక్ట్ (సీఆర్ఎంసీ) పేరిట జీహెచ్ఎంసీ దీన్ని చేపట్టింది. రోడ్ల నిర్వహణ, నిబంధనలు ఇలా.. క్యాచ్పిట్స్, డ్రెయిన్లు, నాలాలు, సివర్ లైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం. రోడ్లపై నిల్వనీరు లేకుండా చర్యలు. చెత్తాచెదారం తొలగింపు. నీటినిల్వ ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాలు లేకుండా ఏర్పాట్లు. ఫుట్‌పాత్, టేబుల్ డ్రెయిన్, స్పీడ్ బ్రేకర్లు, బార్ మార్కింగ్స్, సెంట్రల్ మీడియన్, లేన్ మార్కింగ్, రోడ్ స్టడ్స్, సైనేజీ బోర్లు, కెర్బ్ పెయింటింగ్, సుందరీకరణ పనులు. వీటన్నింటినీ ఏడాదిలోగా పూర్తిచేయాలి. ఆయా సంస్థల అవసరాల మేర రోడ్ల కటింగ్‌లకు అనుమతుల అధికారం కాంట్రాక్టు సంస్థకే అప్పగింత. పనులు పూర్తయ్యాక పూడ్చే బాధ్యత కూడా.. నిర్ణీత వ్యవధుల్లో› పనులు పూర్తికాకుంటే సమీక్షించి పెనాల్టీ విధించే అధికారం జీహెచ్ఎంసీకి ఉంటుంది నగరంలోని ముఖ్యమైన మార్గాలు.. నగరంలో మొత్తం 9 వేల కిలోమీటర్లకు పైగా రహదారులుండగా.. వాటిల్లో 900 కి.మీ.ల మేర ప్రదాన రహదారులున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్‌కు ఇచ్చిన మార్గాల్లో ఇన్నర్ రింగ్‌రోడ్ మార్గాలతో సహా దాదాపుగా నగరంలోని ముఖ్యమైన మార్గాలన్నీ ఉన్నాయి. వాటిల్లో కొన్ని.. గచ్చిబౌలి – కొండాపూర్ – హెచ్ఐసీసీ ఎస్పీ రోడ్ – సంగీత్ జంక్షన్ తార్నాక – మెట్టుగూడ – ఉప్పల్ మాసాబ్‌ట్యాంక్ – బంజారాహిల్స్ రోడ్ నంబర్– 1, 2, 3 – జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 అమీర్‌పేట – అసెంబ్లీ – ఎంజే మార్కెట్ మలక్‌పేట – దిల్‌సుక్‌నగర్ – ఎల్బీ నగర్ – హయత్‌నగర్ అంబర్‌పేట – రామంతాపూర్ – ఉప్పల్ – నల్లచెరువు హైకోర్టు – జూపార్క్ – ఆరాంఘర్ అత్తాపూర్ – రేతిబౌలి బాలానగర్ – బోయిన్పల్లి – ప్యారడైజ్ ఇందిరాపార్క్ – ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ – వీఎస్టీ, హిందీ మహావిద్యాలయ కాంట్రాక్టు ప్యాకేజీలు.. పొందిన సంస్థలు ఎల్బీ నగర్ బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చార్మినార్ ఎం.వెంకరావ్ ఇన్ఫ్రా ప్రాజెక్టŠస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖైరతాబాద్–(1) కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ ఖైరతాబాద్–(2) మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ శేరిలింగంపల్లి ఎన్సీసీ లిమిటెడ్ కూకట్పల్లి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సికింద్రాబాద్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ నోట్: వీటిల్లో ఖైరతాబాద్–1, 2, సికింద్రాబాద్ ప్యాకేజీలకు జీవోలు వెలువడాల్సి ఉంది. -
గుండె గుబిల్లు
- విద్యుత్ శాఖ ప్రయోగం.. వినియోగదారులపై భారం - స్పాట్ బిల్లింగ్ ఏజెన్సీలకు క్రాస్‌చెక్ - 1/3వ వంతు సర్వీసుల బిల్లు విద్యుత్ శాఖ సిబ్బందిచే సేకరణ - ఆలస్యంగా బిల్లింగ్.. కొన్ని చోట్ల ఇవ్వడమే లేదు పుష్ప అనే మహిళ ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె ఇంటి విద్యుత్ సర్వీస్ నెం.60000-047 65. మే 10న 332 యూనిట్ల వినియోగానికి గాను ఈ సర్వీసుపై రూ.1,840 విద్యుత్ బిల్లు వచ్చింది. జూన్‌లో 20వ తేదీన జారీచేసిన బిల్లులో 561 యూనిట్లు నమోదైంది. అందుకు గాను రూ. 3,752 బిల్లు వచ్చింది. ఇది సగటున వచ్చే బిల్లుకు రెండింతలు. దీంతో ఆమె అవాక్కయ్యారు. మేలో 10న బిల్లు ఇవ్వగా, జూన్‌లో 20వ తేదీన ఇవ్వడంతో 30 రో జులు కాకుండా 40 రోజుల యూనిట్లు నమోదైంది. ఈ సమస్య ఆమె ఒక్కరిదే కాదు. పట్టణంలో పలువురు వినియోగదారులది.. ఆదిలాబాద్ : ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించే స్పాట్ బిల్లింగ్‌ను క్రాస్ చెకింగ్ కోసం ఆదిలాబాద్ విద్యుత్ శాఖ సర్కిల్లో చేపడుతున్న ప్రయోగం వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇదివరకు ప్రైవేట్ ఏజెన్సీలే స్పాట్‌బిల్లింగ్ చేసేవి. అయితే స్పాట్ బిల్లింగ్ సిబ్బంది బిల్లుల జారీలో యూనిట్ల పరంగా అక్రమాలకు పాల్పడుతున్నారని, వినియోగదారుల నుంచి కొంత డబ్బు తీసుకుని యూనిట్లు తక్కువగా నమోదు చేసి విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతో గత ఫిబ్రవరి నుంచి విద్యుత్ శాఖ మొత్తం కనెక్షన్లలో 1/3వ వంతు తమ సిబ్బందితో బిల్లు జారీ ప్రక్రియను ప్రారంభించింది. ప్రతి వంద కనెక్షన్లలో 33 కనెక్షన్లు విద్యుత్‌శాఖ సిబ్బంది ఏరియా మారుస్తూ ప్రతినెలా బిల్లులు జారీ చేయాలి. అయితే.. క్రాస్ చెక్ చేయాలనే ఉద్దేశం మంచిదే అయినా, చేపట్టిన విధానంలో లోటుపాట్లు ఉంటున్నాయి. దీంతో ఈ ప్రయోగం పూర్తిగా బెడిసికొడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సేకరణలో లోటుపాట్లు.. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 1/3వ వంతు సర్వీసు కనె క్షన్ల బిల్లులు శాఖ సిబ్బందితో జారీ చేయించాలని అప్పట్లో ఎన్పీడీసీఎల్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. మిగితా జిల్లాల్లో సిబ్బంది ఈ అదనపు భారం తమతో కాదని చెప్పడంతో ఆయా జిల్లాల్లో స్పాట్ బిల్లింగ్ సిబ్బందే వంద శాతం బిల్లింగ్ జారీ చేస్తున్నాయి. ఆదిలాబాద్ సర్కిల్లో మాత్రం దీనిని ఫిబ్రవరి నుంచే అమలుపర్చారు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, మంచిర్యాల, సిర్పూర్కాగజ్నగర్ డివిజన్లు ఉండగా.. మొత్తం 7,39,669 గృహ అవసర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీంట్లో 1/3 వంతు విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది బిల్లులు జారీ చేయా లి. అయితే.. స్పాట్ బిల్లింగ్ యంత్రాలపై లైన్మెన్లకు సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్రేక్‌డౌన్, బిల్లుల వసూళ్లు, మరమ్మతులు, ఇతరత్రా బాధ్యతల పరంగా స్పాట్ బిల్లింగ్‌ను లైన్మెన్లు సరిగా చేపట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్పాట్‌బిల్లింగ్ యంత్రంలో బిల్లు జారీ చేసే క్రమంలో 11 పద్ధతులుంటాయి. దాని ప్రకారంగా బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం, ఈ పద్ధతులపై వారికి సరైన అవగాహన లేకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. ప్రతినెలా ఒక్కో ఏరియాలో నిర్ణీత గడువులోగా బిల్లు చేయాలి. అయితే.. లైన్మెన్లు అవగాహన లోపంతో ఈ ప్రక్రియను చేపట్టలేకపోతున్నారు. దీంతో గడు వు తేదీ తర్వాత పది నుంచి పదిహేను రోజులు, లేనిపక్షంలో మరుసటి నెలలో బిల్లులు ఇస్తుండడంతో మోత మోగుతోంది. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖ సిబ్బంది జూన్ నెలలో 35,623 సర్వీసు కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ బిల్లులు జారీ చేయాల్సి ఉండగా, 25,948 మాత్రమే ఇవ్వగలిగారు. 9,675 సర్వీసు కనెక్షన్లకు బిల్లులే ఇవ్వలేకపోయారు. తద్వారా ఆలస్యంగా బిల్లు ఇవ్వడంతో అధిక భారం వినియోగదారులపై పడుతోంది. బిల్లులను చూసి బెంబేలెత్తుతున్నారు. ఆలస్యంగా బిల్లు ఇవ్వడంతో కన్జుమర్ చార్జీల రూపంలో రూ.150, ఆలస్యంగా చెల్లించినందుకు రూ.75 పెనాల్టీ రూపంలో వినియోగదారులపై భారం పడుతోంది. కాగా.. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి మొదలుకుంటే డివిజన్ అధికారుల వరకు ఈ ప్రయోగాన్ని వ్యతిరేకిస్తున్నా ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభించి రెండుమూడు నెలలే అయినందునా కొద్ది నెలల తర్వాత గాడిలో పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. అప్పటివరకు భారం మోయాల్సిందేనా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. అసలే టారీఫ్ పెంపు... విద్యుత్ శాఖ గత ఏప్రిల్‌లో కొత్త టారీఫ్‌ను ప్రకటించింది. ఈ టారీఫ్‌లో 50 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.1.45 పైసలు, 50 యూనిట్ల పైనుంచి 100 యూనిట్ల వరకు వాడితే మొదటి 50 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ. 1.45 ఆ తర్వాత 50 యూనిట్లకు రూ.2.60 చేశారు. 100 యూనిట్లకు పైబడి 200 యూనిట్ల వరకు వినియోగించే వారికి మొదటి వంద యూనిట్లకు రూ.2.60, ఆ తర్వాత వంద యూనిట్లకు రూ.3.60 చొప్పున బిల్లు వసూలు చేస్తారు. 200 యూనిట్లు పైబడితే మొదటి 50 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.2.60, 51-100 వరకు రూ.3.25, 101-151 వరకు రూ.4.90, 151 నుంచి 200 వరకు రూ.5.65, 201 నుంచి 250 యూనిట్లకు రూ.6.80, 251 నుంచి 300 యూనిట్లకు రూ. 7.30, 301 నుంచి 400లకు రూ.7.80, 400 పైబడితే ప్రతి యూనిట్‌కు రూ.8.50 వసూలు చేస్తారు. ఇలా ఒక్క యూనిట్‌తో బిల్లు తారుమారవుతుంది. అలాంటిది గడువులోగా కాకుండా ఆలస్యంగా బిల్లులు జారీ చేస్తుండడంతో వినియోగదారులు బిల్లులను చూసి హైరానా పడాల్సి వస్తోంది. ఈ విషయంలో విద్యుత్ శాఖ ఏవో ప్రేమ్‌సింగ్‌ను వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు.