సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో రోడ్ల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు త్వరలో సమసిపోనున్నాయి. ఇకపై ప్రధాన రహదారుల మార్గాల్లోని 709కి.మీ. మేర రోడ్ల పనుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలు చూసుకోనున్నాయి. ఈ మేరకు జోన్ల వారీగా 7 ప్యాకేజీలుగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. దీనిలో 4 ప్యాకేజీలకు అనుమతులిస్తూ ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. మిగతా 3 ప్యాకేజీలకు ఆర్థిక శాఖ అనుమతి రాగానే.. జీవోలు వెలువడనున్నాయి. తర్వాత వారం రోజుల్లోగా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అమల్లోకి రానుంది. దీంతో టెండరు దక్కించుకున్న సంస్థలు నెలరోజుల్లో గ్రేటర్ రోడ్ల గుంతల పూడ్చివేతను పూర్తిచేస్తాయి.
అనంతరం 6 నెలల్లోగా స్వల్ప మరమ్మతులు, ప్యాచ్‌వర్క్‌లు వంటివి పూర్తిచేసి వాహనాలు సాఫీగా ప్రయాణించేలా చేస్తాయి. ఆ తర్వాత కాంట్రాక్ట్ మేరకు తొలి ఏడాది 50%, రెండో ఏడాది 30%, మూడో ఏడాది 20% పనుల వంతున కొత్తగా రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తాయి. ఆ తర్వాత రెండేళ్లు నిర్వహణ వెరసి మొత్తం ఐదేళ్ల కాంట్రాక్టు. బీటీతో సహా ఎక్కడ ఏ విధానం అవసరమనుకుంటే దాన్ని పాటించవచ్చు. 10% వరకు ఆధునిక సాంకేతికతనూ వినియోగించుకోవచ్చు. ఎటొచ్చీ రోడ్లు తళతళలాడుతూ, నిత్యం సాఫీ ప్రయాణానికి అనువుగా ఉండాలి. అంతేకాదు రోడ్ల వెంబడి ఫుట్‌పాత్‌లు, పచ్చదనం, రోడ్లపై పారిశుధ్యం బాధ్యతలు కూడా కాంట్రాక్టు ఏజెన్సీలే చూసుకోవాలి.
సామర్థ్యమున్న సంస్థలే ఎంపిక
ఈ మొత్తం ప్రక్రియలో భాగంగా రోడ్ల నిర్వహణలో ఎక్కడా జాప్యం జరగకుండా ఉండేందుకు టెండర్‌లో నిబంధనలు చేర్చారు. తగిన ఆర్థిక సామర్థ్యంతోపాటు అవసరమైన యంత్రాంగం, సిబ్బంది ఉన్న సంస్థలనే టెండర్‌లో పాల్గొనేందుకు అర్హమైనవిగా నిబంధన విధించారు. ఏడాదికి కనీసం రూ.400 కోట్ల టర్నోవర్ నిబంధన విధించగా, అంతకు 4 రెట్ల టర్నోవర్ ఉన్న ఏజెన్సీలు వచ్చాయని చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్ తెలిపారు. రోడ్ల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడమనేది ఇప్పటివరకు నేషనల్ హైవే రోడ్లకు ఉంది. స్థానిక సంస్థల పరిధిలో మాత్రం ఇదే ప్రథమమని ఇంజనీర్లు పేర్కొన్నారు. వీటి పర్యవేక్షణాధికారం తదితరమైనవన్ని జోనల్ కమిషనర్లవే. సమగ్ర రోడ్ నిర్వహణ కాంట్రాక్ట్ (సీఆర్‌ఎంసీ) పేరిట జీహెచ్‌ఎంసీ దీన్ని చేపట్టింది.
రోడ్ల నిర్వహణ, నిబంధనలు ఇలా..
- క్యాచ్‌పిట్స్, డ్రెయిన్లు, నాలాలు, సివర్ లైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం.
- రోడ్లపై నిల్వనీరు లేకుండా చర్యలు.
- చెత్తాచెదారం తొలగింపు.
- నీటినిల్వ ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాలు లేకుండా ఏర్పాట్లు.
- ఫుట్‌పాత్, టేబుల్ డ్రెయిన్, స్పీడ్ బ్రేకర్లు, బార్ మార్కింగ్స్, సెంట్రల్ మీడియన్, లేన్ మార్కింగ్, రోడ్ స్టడ్స్, సైనేజీ బోర్లు, కెర్బ్ పెయింటింగ్, సుందరీకరణ పనులు.
- వీటన్నింటినీ ఏడాదిలోగా పూర్తిచేయాలి.
- ఆయా సంస్థల అవసరాల మేర రోడ్ల కటింగ్‌లకు అనుమతుల అధికారం కాంట్రాక్టు సంస్థకే అప్పగింత.
- పనులు పూర్తయ్యాక పూడ్చే బాధ్యత కూడా..
- నిర్ణీత వ్యవధుల్లో› పనులు పూర్తికాకుంటే సమీక్షించి పెనాల్టీ విధించే అధికారం జీహెచ్‌ఎంసీకి ఉంటుంది
నగరంలోని ముఖ్యమైన మార్గాలు..
నగరంలో మొత్తం 9 వేల కిలోమీటర్లకు పైగా రహదారులుండగా.. వాటిల్లో 900 కి.మీ.ల మేర ప్రదాన రహదారులున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్‌కు ఇచ్చిన మార్గాల్లో ఇన్నర్ రింగ్‌రోడ్ మార్గాలతో సహా దాదాపుగా నగరంలోని ముఖ్యమైన మార్గాలన్నీ ఉన్నాయి. వాటిల్లో కొన్ని..
గచ్చిబౌలి – కొండాపూర్ – హెచ్‌ఐసీసీ
ఎస్పీ రోడ్ – సంగీత్ జంక్షన్
తార్నాక – మెట్టుగూడ – ఉప్పల్
మాసాబ్‌ట్యాంక్ – బంజారాహిల్స్ రోడ్ నంబర్– 1, 2, 3 – జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36
అమీర్‌పేట – అసెంబ్లీ – ఎంజే మార్కెట్
మలక్‌పేట – దిల్‌సుక్‌నగర్ – ఎల్బీ నగర్ – హయత్‌నగర్
అంబర్‌పేట – రామంతాపూర్ – ఉప్పల్ – నల్లచెరువు
హైకోర్టు – జూపార్క్ – ఆరాంఘర్
అత్తాపూర్ – రేతిబౌలి
బాలానగర్ – బోయిన్‌పల్లి – ప్యారడైజ్
ఇందిరాపార్క్ – ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ – వీఎస్‌టీ, హిందీ మహావిద్యాలయ
కాంట్రాక్టు ప్యాకేజీలు.. పొందిన సంస్థలు
- ఎల్బీ నగర్ బీఎస్సీపీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్
- చార్మినార్ ఎం.వెంకరావ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టŠస్ ప్రైవేట్ లిమిటెడ్
- ఖైరతాబాద్–(1) కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్
- ఖైరతాబాద్–(2) మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్
- శేరిలింగంపల్లి ఎన్సీసీ లిమిటెడ్
- కూకట్‌పల్లి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్
- సికింద్రాబాద్ కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్
నోట్: వీటిల్లో ఖైరతాబాద్–1, 2, సికింద్రాబాద్ ప్యాకేజీలకు జీవోలు వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment