గుండె గుబిల్లు | Spot billing agencies to cross-check | Sakshi
Sakshi News home page

గుండె గుబిల్లు

Published Fri, Aug 7 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

గుండె గుబిల్లు

గుండె గుబిల్లు

- విద్యుత్ శాఖ ప్రయోగం.. వినియోగదారులపై భారం
- స్పాట్ బిల్లింగ్ ఏజెన్సీలకు క్రాస్‌చెక్
- 1/3వ వంతు సర్వీసుల బిల్లు విద్యుత్ శాఖ సిబ్బందిచే సేకరణ
- ఆలస్యంగా బిల్లింగ్.. కొన్ని చోట్ల ఇవ్వడమే లేదు
పుష్ప అనే మహిళ ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె ఇంటి విద్యుత్ సర్వీస్ నెం.60000-047 65. మే 10న 332 యూనిట్ల వినియోగానికి గాను ఈ సర్వీసుపై రూ.1,840 విద్యుత్ బిల్లు వచ్చింది. జూన్‌లో 20వ తేదీన జారీచేసిన బిల్లులో 561 యూనిట్లు నమోదైంది. అందుకు గాను రూ. 3,752 బిల్లు వచ్చింది. ఇది సగటున వచ్చే బిల్లుకు రెండింతలు. దీంతో ఆమె అవాక్కయ్యారు. మేలో 10న బిల్లు ఇవ్వగా, జూన్‌లో 20వ తేదీన ఇవ్వడంతో 30 రో జులు కాకుండా 40 రోజుల యూనిట్లు నమోదైంది. ఈ సమస్య ఆమె ఒక్కరిదే కాదు. పట్టణంలో పలువురు వినియోగదారులది..
 
ఆదిలాబాద్ :
ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించే స్పాట్ బిల్లింగ్‌ను క్రాస్ చెకింగ్ కోసం ఆదిలాబాద్ విద్యుత్ శాఖ సర్కిల్‌లో చేపడుతున్న ప్రయోగం వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇదివరకు ప్రైవేట్ ఏజెన్సీలే స్పాట్‌బిల్లింగ్ చేసేవి. అయితే స్పాట్ బిల్లింగ్ సిబ్బంది బిల్లుల జారీలో యూనిట్ల పరంగా అక్రమాలకు పాల్పడుతున్నారని, వినియోగదారుల నుంచి కొంత డబ్బు తీసుకుని యూనిట్లు తక్కువగా నమోదు చేసి విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతో గత ఫిబ్రవరి నుంచి విద్యుత్ శాఖ మొత్తం కనెక్షన్లలో 1/3వ వంతు తమ సిబ్బందితో బిల్లు జారీ ప్రక్రియను ప్రారంభించింది. ప్రతి వంద కనెక్షన్లలో 33 కనెక్షన్లు విద్యుత్‌శాఖ సిబ్బంది ఏరియా మారుస్తూ ప్రతినెలా బిల్లులు జారీ చేయాలి. అయితే.. క్రాస్ చెక్ చేయాలనే ఉద్దేశం మంచిదే అయినా, చేపట్టిన విధానంలో లోటుపాట్లు ఉంటున్నాయి. దీంతో ఈ ప్రయోగం పూర్తిగా బెడిసికొడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
సేకరణలో లోటుపాట్లు..
టీఎస్ ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 1/3వ వంతు సర్వీసు కనె క్షన్ల బిల్లులు శాఖ సిబ్బందితో జారీ చేయించాలని అప్పట్లో ఎన్‌పీడీసీఎల్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. మిగితా జిల్లాల్లో సిబ్బంది ఈ అదనపు భారం తమతో కాదని చెప్పడంతో ఆయా జిల్లాల్లో స్పాట్ బిల్లింగ్ సిబ్బందే వంద శాతం బిల్లింగ్ జారీ చేస్తున్నాయి. ఆదిలాబాద్  సర్కిల్‌లో మాత్రం దీనిని ఫిబ్రవరి నుంచే అమలుపర్చారు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, మంచిర్యాల, సిర్పూర్‌కాగజ్‌నగర్ డివిజన్‌లు ఉండగా.. మొత్తం 7,39,669 గృహ అవసర విద్యుత్ కనెక్షన్‌లు ఉన్నాయి. దీంట్లో 1/3 వంతు విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది బిల్లులు జారీ చేయా లి. అయితే.. స్పాట్ బిల్లింగ్ యంత్రాలపై లైన్‌మెన్లకు సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

బ్రేక్‌డౌన్, బిల్లుల వసూళ్లు, మరమ్మతులు, ఇతరత్రా బాధ్యతల పరంగా స్పాట్ బిల్లింగ్‌ను లైన్‌మెన్లు సరిగా చేపట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్పాట్‌బిల్లింగ్ యంత్రంలో బిల్లు జారీ చేసే క్రమంలో 11 పద్ధతులుంటాయి. దాని ప్రకారంగా బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం, ఈ పద్ధతులపై వారికి సరైన అవగాహన లేకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. ప్రతినెలా ఒక్కో ఏరియాలో నిర్ణీత గడువులోగా బిల్లు చేయాలి. అయితే.. లైన్‌మెన్లు అవగాహన లోపంతో ఈ ప్రక్రియను చేపట్టలేకపోతున్నారు. దీంతో గడు వు తేదీ తర్వాత పది నుంచి పదిహేను రోజులు, లేనిపక్షంలో మరుసటి నెలలో బిల్లులు ఇస్తుండడంతో మోత మోగుతోంది.

ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖ సిబ్బంది జూన్ నెలలో 35,623 సర్వీసు కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ బిల్లులు జారీ చేయాల్సి ఉండగా, 25,948 మాత్రమే ఇవ్వగలిగారు. 9,675 సర్వీసు కనెక్షన్లకు బిల్లులే ఇవ్వలేకపోయారు. తద్వారా ఆలస్యంగా బిల్లు ఇవ్వడంతో అధిక భారం వినియోగదారులపై పడుతోంది. బిల్లులను చూసి బెంబేలెత్తుతున్నారు. ఆలస్యంగా బిల్లు ఇవ్వడంతో కన్జుమర్ చార్జీల రూపంలో రూ.150, ఆలస్యంగా చెల్లించినందుకు రూ.75 పెనాల్టీ రూపంలో వినియోగదారులపై భారం పడుతోంది. కాగా.. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి మొదలుకుంటే డివిజన్ అధికారుల వరకు ఈ ప్రయోగాన్ని వ్యతిరేకిస్తున్నా ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభించి రెండుమూడు నెలలే అయినందునా కొద్ది నెలల తర్వాత గాడిలో పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. అప్పటివరకు భారం మోయాల్సిందేనా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
 
అసలే టారీఫ్ పెంపు...
విద్యుత్ శాఖ గత ఏప్రిల్‌లో కొత్త టారీఫ్‌ను ప్రకటించింది. ఈ టారీఫ్‌లో 50 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.1.45 పైసలు, 50 యూనిట్ల పైనుంచి 100 యూనిట్ల వరకు వాడితే మొదటి 50 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ. 1.45 ఆ తర్వాత 50 యూనిట్లకు రూ.2.60 చేశారు. 100 యూనిట్లకు పైబడి 200 యూనిట్ల వరకు వినియోగించే వారికి మొదటి వంద యూనిట్లకు రూ.2.60, ఆ తర్వాత వంద యూనిట్లకు రూ.3.60 చొప్పున బిల్లు వసూలు చేస్తారు.

200 యూనిట్లు పైబడితే మొదటి 50 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.2.60, 51-100 వరకు రూ.3.25, 101-151 వరకు రూ.4.90, 151 నుంచి 200 వరకు రూ.5.65, 201 నుంచి 250 యూనిట్లకు రూ.6.80, 251 నుంచి 300 యూనిట్లకు రూ. 7.30, 301 నుంచి 400లకు రూ.7.80, 400 పైబడితే ప్రతి యూనిట్‌కు రూ.8.50 వసూలు చేస్తారు. ఇలా ఒక్క యూనిట్‌తో బిల్లు తారుమారవుతుంది. అలాంటిది గడువులోగా కాకుండా ఆలస్యంగా బిల్లులు జారీ చేస్తుండడంతో వినియోగదారులు బిల్లులను చూసి హైరానా పడాల్సి వస్తోంది. ఈ విషయంలో విద్యుత్ శాఖ ఏవో ప్రేమ్‌సింగ్‌ను వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement