spot billing
-
స్పాట్ బిల్లింగ్‌కు కొత్త టెండర్లు..
కమీషన్లు పెంచిన విద్యుత్ సంస్థ చెల్లింపుల్లో కోతపై రీడర్ల ఆవేదన.. మొత్తం సర్వీసులు: 11,84,362 మీటర్ రీడింగ్‌కు చెల్లించేది పట్టణాల్లో: రూ. 4.69 గ్రామాల్లో: రూ. 4.94 ఏజెన్సీలో: రూ.5.67 రీడింగ్ సిబ్బంది: 381 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో విద్యుత్ బిల్లుల రీడింగ్‌ను తీసి వినియోగదారులకు ఇచ్చే విధానాన్ని గత కొన్నేళ్లుగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్న విషయం విదితమే. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని 5 డివిజన్లలో బిల్లింగ్ కాంట్రాక్టర్ల కాలపరిమితి 2015 16 ఆర్థిక సంవత్సరానికి ముగిసిపోయింది. ఐతే సంస్థ సీఎండీ ఆదేశాల మేరకు వారి కాంట్రాక్టును 201617 ఆర్థిక సంవత్సరానికి కూడా పొడిగించారు. అప్పట్లో కాంట్రాక్టులు పొందిన వారు బిల్లింగ్ మెషీన్లు కొత్తగా కొన్నందున వారికి మెషీన్ల కొనుగోలుకు పెట్టిన పెట్టుబడి సమకూర్చుకోవడానికి సానుకూల దృక్పథంతో ఈ పొడిగింపు ఇచ్చారు. ఆ పొడిగింపు గడువు కూడా ముగియడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త కాంట్రాక్టులకు టెండర్లు పిలవాల్సి ఉన్న ఆ సంస్థ అధికారులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది కూడా పొడిగిస్తారని పాత కాంట్రాక్టర్లు ఆశించారు. ఐతే స్పాట్ బిల్లింగ్‌కు కొత్తగా టెండర్లు పిలవాలని ఈ నెల 2వ తేదీన సంస్థ సీఎండీ ఎంఎం నాయక్ 1781 నెంబర్‌తో మెమో జారీ చేశారు. దీనిపై జిల్లాలో ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ కసరత్తులు ప్రారంభించారు. ధర పెంచిన సంస్థ.. గతంలో స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టరుకు ఒక్కో బిల్లుకు సంస్థ చెల్లించే మొత్తంపై ఈ ఏడాది కొత్తగా పిలిచే టెండర్లలో దాదాపు 50 పైసలు పెంచింది. గతంలో నగర, పట్టణ ప్రాంతాల్లో బిల్లు రీడింగ్ తీస్తే ఒక్కో సర్వీసుకు రూ.4.19 గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసుకు రూ.4.41, ఏజన్సీ ప్రాంతాల్లో రూ. 5.05 చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది పిలిచే టెండర్లలో కాంట్రాక్టర్లకు మరింత కమీషన్ వచ్చేలా ఆ మొత్తాన్ని సంస్థ« పెంచింది. ప్రస్తుత ధరల ప్రకారం నగర, పట్టణ ప్రాంతాల్లో రూ.4.69, గ్రామీణ ప్రాంతాల్లో రూ.4.94, ఏజన్సీ ప్రాంతాల్లో రూ.5.67గా ధరలు నిర్ణయించింది. టెండర్లకు బిడ్డింగులు వేసే కాంట్రాక్టర్లు ఆ మొత్తానికంటే తక్కువకు ఎవరు వేస్తే వారికి కాంట్రాక్టు దక్కుతుంది. రీడర్లకు చెల్లింపుల్లో కోత కోస్తున్న కాంట్రాక్టర్లు.. ఇంటింటికీ తిరిగి మీటర్ రీడింగ్ తీసే రీడర్లకు చెల్లింపుల్లో కాంట్రాక్టర్లు కోత కోస్తున్నారు. టెండర్ల నియమ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. నిబంధనల ప్రకారం నగర, పట్టణ ప్రాంతాల్లో బిల్లు రీడర్లకు కాంట్రాక్టర్ బిల్లుకు రూ. 2.55 చొప్పున చెల్లించాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రీడర్లకు రూ. 2.72, ఏజన్సీ ప్రాంతాల్లో రూ. 3.19 నిబంధనల మేరకు చెల్లించాలి. కానీ కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా రీడర్లకు దాదాపు 85 పైసల నుండి 95 పైసలు కోత విధించి చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 21 సబ్ డివిజన్ల పరిధిలో 11,84,362 సర్వీసులుండగా వాటి రీడింగ్ కాంట్రాక్టర్లు 381 మంది సిబ్బందిని నియమించుకున్నారు. వీరందరికీ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తంలో నెలకు సుమారు రూ. 10. 65 లక్షలను ఆయా కాంట్రాక్టర్లు మింగేస్తున్నారు. ఫిర్యాదులుంటే చర్యలు తీసుకుంటాం.. సీహెచ్ సత్యనారాయణ రెడ్డి, ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్. రీడర్లకు నిబంధనల ప్రకారం మొత్తాన్ని చెల్లించాల్సిందే. అందులో కోత విధించడం నిబంధనలకు విరుద్ధం. ఐతే ఇప్పటి వరకూ రీడర్ల వద్ద నుండి మాకు ఎటువంటి ఫిర్యాదులూ అందలేదు. అన్యాయానికి గురైన వారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో మా అధికారులను కూడా దీనిపై పర్యవేక్షణకు పెడతాం. -
గుండె గుబిల్లు
- విద్యుత్ శాఖ ప్రయోగం.. వినియోగదారులపై భారం - స్పాట్ బిల్లింగ్ ఏజెన్సీలకు క్రాస్‌చెక్ - 1/3వ వంతు సర్వీసుల బిల్లు విద్యుత్ శాఖ సిబ్బందిచే సేకరణ - ఆలస్యంగా బిల్లింగ్.. కొన్ని చోట్ల ఇవ్వడమే లేదు పుష్ప అనే మహిళ ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె ఇంటి విద్యుత్ సర్వీస్ నెం.60000-047 65. మే 10న 332 యూనిట్ల వినియోగానికి గాను ఈ సర్వీసుపై రూ.1,840 విద్యుత్ బిల్లు వచ్చింది. జూన్‌లో 20వ తేదీన జారీచేసిన బిల్లులో 561 యూనిట్లు నమోదైంది. అందుకు గాను రూ. 3,752 బిల్లు వచ్చింది. ఇది సగటున వచ్చే బిల్లుకు రెండింతలు. దీంతో ఆమె అవాక్కయ్యారు. మేలో 10న బిల్లు ఇవ్వగా, జూన్‌లో 20వ తేదీన ఇవ్వడంతో 30 రో జులు కాకుండా 40 రోజుల యూనిట్లు నమోదైంది. ఈ సమస్య ఆమె ఒక్కరిదే కాదు. పట్టణంలో పలువురు వినియోగదారులది.. ఆదిలాబాద్ : ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించే స్పాట్ బిల్లింగ్‌ను క్రాస్ చెకింగ్ కోసం ఆదిలాబాద్ విద్యుత్ శాఖ సర్కిల్లో చేపడుతున్న ప్రయోగం వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇదివరకు ప్రైవేట్ ఏజెన్సీలే స్పాట్‌బిల్లింగ్ చేసేవి. అయితే స్పాట్ బిల్లింగ్ సిబ్బంది బిల్లుల జారీలో యూనిట్ల పరంగా అక్రమాలకు పాల్పడుతున్నారని, వినియోగదారుల నుంచి కొంత డబ్బు తీసుకుని యూనిట్లు తక్కువగా నమోదు చేసి విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతో గత ఫిబ్రవరి నుంచి విద్యుత్ శాఖ మొత్తం కనెక్షన్లలో 1/3వ వంతు తమ సిబ్బందితో బిల్లు జారీ ప్రక్రియను ప్రారంభించింది. ప్రతి వంద కనెక్షన్లలో 33 కనెక్షన్లు విద్యుత్‌శాఖ సిబ్బంది ఏరియా మారుస్తూ ప్రతినెలా బిల్లులు జారీ చేయాలి. అయితే.. క్రాస్ చెక్ చేయాలనే ఉద్దేశం మంచిదే అయినా, చేపట్టిన విధానంలో లోటుపాట్లు ఉంటున్నాయి. దీంతో ఈ ప్రయోగం పూర్తిగా బెడిసికొడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సేకరణలో లోటుపాట్లు.. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 1/3వ వంతు సర్వీసు కనె క్షన్ల బిల్లులు శాఖ సిబ్బందితో జారీ చేయించాలని అప్పట్లో ఎన్పీడీసీఎల్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. మిగితా జిల్లాల్లో సిబ్బంది ఈ అదనపు భారం తమతో కాదని చెప్పడంతో ఆయా జిల్లాల్లో స్పాట్ బిల్లింగ్ సిబ్బందే వంద శాతం బిల్లింగ్ జారీ చేస్తున్నాయి. ఆదిలాబాద్ సర్కిల్లో మాత్రం దీనిని ఫిబ్రవరి నుంచే అమలుపర్చారు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, మంచిర్యాల, సిర్పూర్కాగజ్నగర్ డివిజన్లు ఉండగా.. మొత్తం 7,39,669 గృహ అవసర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీంట్లో 1/3 వంతు విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది బిల్లులు జారీ చేయా లి. అయితే.. స్పాట్ బిల్లింగ్ యంత్రాలపై లైన్మెన్లకు సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్రేక్‌డౌన్, బిల్లుల వసూళ్లు, మరమ్మతులు, ఇతరత్రా బాధ్యతల పరంగా స్పాట్ బిల్లింగ్‌ను లైన్మెన్లు సరిగా చేపట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్పాట్‌బిల్లింగ్ యంత్రంలో బిల్లు జారీ చేసే క్రమంలో 11 పద్ధతులుంటాయి. దాని ప్రకారంగా బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం, ఈ పద్ధతులపై వారికి సరైన అవగాహన లేకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. ప్రతినెలా ఒక్కో ఏరియాలో నిర్ణీత గడువులోగా బిల్లు చేయాలి. అయితే.. లైన్మెన్లు అవగాహన లోపంతో ఈ ప్రక్రియను చేపట్టలేకపోతున్నారు. దీంతో గడు వు తేదీ తర్వాత పది నుంచి పదిహేను రోజులు, లేనిపక్షంలో మరుసటి నెలలో బిల్లులు ఇస్తుండడంతో మోత మోగుతోంది. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖ సిబ్బంది జూన్ నెలలో 35,623 సర్వీసు కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ బిల్లులు జారీ చేయాల్సి ఉండగా, 25,948 మాత్రమే ఇవ్వగలిగారు. 9,675 సర్వీసు కనెక్షన్లకు బిల్లులే ఇవ్వలేకపోయారు. తద్వారా ఆలస్యంగా బిల్లు ఇవ్వడంతో అధిక భారం వినియోగదారులపై పడుతోంది. బిల్లులను చూసి బెంబేలెత్తుతున్నారు. ఆలస్యంగా బిల్లు ఇవ్వడంతో కన్జుమర్ చార్జీల రూపంలో రూ.150, ఆలస్యంగా చెల్లించినందుకు రూ.75 పెనాల్టీ రూపంలో వినియోగదారులపై భారం పడుతోంది. కాగా.. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి మొదలుకుంటే డివిజన్ అధికారుల వరకు ఈ ప్రయోగాన్ని వ్యతిరేకిస్తున్నా ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభించి రెండుమూడు నెలలే అయినందునా కొద్ది నెలల తర్వాత గాడిలో పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. అప్పటివరకు భారం మోయాల్సిందేనా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. అసలే టారీఫ్ పెంపు... విద్యుత్ శాఖ గత ఏప్రిల్‌లో కొత్త టారీఫ్‌ను ప్రకటించింది. ఈ టారీఫ్‌లో 50 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.1.45 పైసలు, 50 యూనిట్ల పైనుంచి 100 యూనిట్ల వరకు వాడితే మొదటి 50 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ. 1.45 ఆ తర్వాత 50 యూనిట్లకు రూ.2.60 చేశారు. 100 యూనిట్లకు పైబడి 200 యూనిట్ల వరకు వినియోగించే వారికి మొదటి వంద యూనిట్లకు రూ.2.60, ఆ తర్వాత వంద యూనిట్లకు రూ.3.60 చొప్పున బిల్లు వసూలు చేస్తారు. 200 యూనిట్లు పైబడితే మొదటి 50 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.2.60, 51-100 వరకు రూ.3.25, 101-151 వరకు రూ.4.90, 151 నుంచి 200 వరకు రూ.5.65, 201 నుంచి 250 యూనిట్లకు రూ.6.80, 251 నుంచి 300 యూనిట్లకు రూ. 7.30, 301 నుంచి 400లకు రూ.7.80, 400 పైబడితే ప్రతి యూనిట్‌కు రూ.8.50 వసూలు చేస్తారు. ఇలా ఒక్క యూనిట్‌తో బిల్లు తారుమారవుతుంది. అలాంటిది గడువులోగా కాకుండా ఆలస్యంగా బిల్లులు జారీ చేస్తుండడంతో వినియోగదారులు బిల్లులను చూసి హైరానా పడాల్సి వస్తోంది. ఈ విషయంలో విద్యుత్ శాఖ ఏవో ప్రేమ్‌సింగ్‌ను వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. -
అమాంతం పెరిగిన విద్యుత్ బిల్లులు
స్పాట్ బిల్లింగ్‌లో జాప్యంతో వినియోగదారులపై భారం కార్మికుల సమ్మె సాకుగా డిస్కంల దోపిడీ హైదరాబాద్: స్పాట్ బిల్లింగ్‌లో జాప్యం జరగడంతో విద్యుత్ బిల్లుల మోత మోగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె కారణంగా ఏప్రిల్ నెల విద్యుత్ వినియోగానికి స్పాట్ బిల్లింగును పది రోజులు ఆలస్యంగా చేశారు. వ్యవధి దాటిన తర్వాత జరిగిన వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మీటర్ రీడింగ్‌లను సేకరించారు. దాదాపు 40 రోజుల వినియోగం కింద అధిక యూనిట్లకు బిల్లింగ్ జరిగింది. దీంతో టారిఫ్ స్లాబులు మారిపోయి బిల్లులు అమాంతం పెరిగాయి. స్లాబుల్లో తేడాతో యూనిట్ ధర కూడా మారిపోతుంది. బిల్లింగ్‌లో జాప్యం జరిగినట్లు తెలిసినా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు బరితెగించి వినియోగదారులను దొంగదెబ్బ తీస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వినియోగదారులనే బలి చేస్తున్నాయి. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) పరిధిలో గృహ వినియోగదారులు గత మార్చి నెలలో 464 మిలియన్ యూనిట్లను వినియోగించగా, రూ.178 కోట్ల బిల్లులు జారీ అయ్యాయి. ఇక ఏప్రిల్‌లో ఆలస్యంగా మీటర్ రీడింగ్‌ను నమోదు చేయడంతో వినియోగం ఏకంగా 583 మిలియన్ యూనిట్లకు పెరిగింది. బిల్లులు సైతం రూ.264 కోట్లకు ఎగబాకాయి. మార్చితో పోల్చితే విద్యుత్ వినియోగం 23 శాతం, సంస్థ ఆదాయం 48 శాతం పెరిగిపోయింది. సగటున యూనిట్ చార్జీ రూ.7.22 వసూలవుతోంది. పరిశ్రమలు, వాణిజ్యం, ఇతర కేటగిరీల వినియోగదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టారీఫ్ స్లాబుల్లో ఒక్క యూనిట్ తేడా వచ్చినా బిల్లు భారీగా పెరిగిపోతోంది. ఉదాహరణకు 100 యూనిట్ల వినియోగానికి రూ.202.50 బిల్లు వస్తుండగా, 101 యూనిట్లకు రూ.263.60 బిల్లు చెల్లించాల్సి వస్తోంది. -
స్పాట్ రగడ
సాక్షి, విశాఖపట్నం : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) పరిధిలోని ఐదు జిల్లాల్లో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరుగుతున్నాయి. కారణమేమిటని ఆరా తీసిన కొత్త సీఎండీ ఆర్.ముత్యాలరాజుకు స్పాట్ బిల్లింగ్ ఆలస్యమే కారణమని తెలిసింది. దీంతో నిర్ణీత సమయంలో విద్యుత్ బిల్లులు తీసేలా చూడమని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే గడువులోపు స్పాట్ బిల్లింగ్ పూర్తయ్యే పనికాదని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు నిబంధనల ప్రకారం నడుచుకోని స్పాట్ బిల్లింగ్ ఏజెన్సీలపై సీఎండీ ఏ నిర్ణయం తీసుకోనున్నారనే ఉత్కంఠ నెలకొంది. మరో వైపు సీఎండీ ఆదేశాలతో స్పాట్ బిల్లింగ్ ఏజెన్సీలు ‘టేబుల్ రీడింగ్’ తీస్తూ మరో తప్పు చేస్తున్నాయి. ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 52.73 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ‘ఈపీడీసీఎల్’ విద్యుత్ సరఫరా చేస్తోంది. వారి వద్ద నుంచి ప్రతి నెలా రూ.511 కోట్ల బిల్లులు వసూలు చేస్తోంది. దీనిలో హెచ్‌టీ మినహా మిగతా అన్ని సర్వీసుల మీటర్ రీడింగ్ తీసి, బిల్లులు ఇచ్చే పనిని ఆయా జిల్లాల్లో ప్రైవేట్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరికి ఒక్కో బిల్లుకు రూ.3.10 నుంచి రూ.3.30 పైసలు చొప్పున కమీషన్ ఇస్తున్నారు. ప్రతి నెలా 4 నుంచి 11వ తేదీ వరకూ ఓ స్లాట్‌లో, 14 నుంచి 21 వరకూ మరో స్లాట్‌లో మీటర్ రీడింగ్ తీయాలి. కానీ కాంట్రాక్టర్లు గడువులోపు బిల్లులు ఇవ్వలేకపోతున్నారు. రీడింగ్ ఆలస్యమవడంతో స్లాబ్ మారిపోయి బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై జిల్లాల్లో ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో విద్యుత్ అధికారులకు ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పాట్ బిల్లింగ్‌పై సమీక్ష జరిపిన సీఎండీ ఇక మీదట గడువు దాటకుండా రీడింగ్ తీయాల్సిందేనని స్పష్టం చేశారు. సీఎండీ ఆదేశాలతో కాంట్రాక్టర్లు కలవరపడుతున్నారు. ఈఆర్ఓ కార్యాలయం నుంచి బిల్లులకు సంబంధించిన సమాచారం 3 నుంచి 6వ తేదీ వరకూ వస్తూనే ఉంటున్నందున 4వ తేదీ నుంచి రీడింగ్ ప్రారంభించడం కుదరడం లేదనేది వారి వాదన. అయితే ఒప్పందం చేసుకున్నప్పుడు నిర్ణీత సమయాలకే రీడింగ్ అప్పగిస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు సాకులు వెదకవద్దనేది అధికారుల మాట. నిజానికి పలువురు కాంట్రాక్టర్లు తక్కువ మంది సిబ్బందితో కాలం వెళ్లదీస్తూ బిల్లులు ఆలస్యం చేస్తున్నారు. సీఎండీ ఆదేశాల వల్ల సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ అలా చేయకుండా, ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీసే సమయం లేదని టేబుల్ రీడింగ్‌తో (ఒక చోట కూర్చొని అంచనాతో బిల్లు వేయడం) బిల్లులు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా బిల్లుల్లో తప్పులు దొర్లి వినియోగదారులపై భారం పడుతోంది. ఈ విషయంపైనా ‘ఈపీడీసీఎల్’ దృష్టి సారించాల్సి ఉంది. అయితే ఎలాగోలా బిల్లులు ఇచ్చేయమని అధికారులు ఒత్తిడి చేయడం వల్లనే అలా చేయాల్సి వస్తోందని కొందరు కాంట్రాక్టర్లు ఆరోపిస్తుండటం విశేషం. -
ఆన్లైన్లో వివరాల నమోదు
జిల్లాలో మొదటిసారిగా తాండూరు మున్సిపాలిటీలో అమలు అవినీతికి కళ్లెం పడే అవకాశం తాండూరు: ఆస్తిపన్ను వసూలుకు అధికారులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. మాన్యువల్ పద్ధతికి బదులు స్పాట్ బిల్లింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకు రానున్నారు. గతంలో ఆస్తిపన్ను చెల్లించినా మళ్లీ బకాయి ఉన్నట్లు బిల్లులు రావడం, పన్ను చెల్లింపు వివరాలు రికార్డుల్లో నమోదు కాకపోవడం తదితర సమస్యలు వచ్చేవి. ఇకముందు తాండూరు మున్సిపాలిటీలో ఈ పరిస్థితి కనిపించదు. మున్సిపాలిటీలో ఆస్తిపన్ను(ప్రాపర్టీ టాక్స్) చెల్లింపునకు స్పాట్ బిల్లింగ్ విధానం అమల్లోకి రానుంది. తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులు, బకాయిలు, జరిమానాలు తదితర వివరాలన్నీ ఇప్పటికే మున్సిపాలిటీ వెబ్సైట్లో నమోదయ్యాయి. ఈ రెండింటిలో కొత్త విధానాన్ని ముందుగా తాండూరులో అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. 11,013 భవనాలు.. రూ.2.40కోట్ల పన్ను తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. మున్సిపాలిటీలో మొత్తం అసెస్మెంట్ చేసిన గృహాలు, భవనాలు, ఫంక్షన్ హాళ్లు 11,013 ఉన్నాయి. ఏడాదికి సుమారు రూ.2.40 కోట్ల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుతం 8 మంది బిల్కలెక్టర్లు ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. బిల్ కలెక్టర్లు ఇంటింటికీ తిరుగుతూ ఆస్తిపన్ను వివరాలు తెలియజేస్తూ చెల్లించిన డబ్బులకు రసీదునిస్తారు. ఈ విధానంలో అవినీతికి చోటుండటంతోపాటు వివరాలు తప్పుగా నమోదవుతుండటంతో స్పాట్ బిల్లింగ్ యంత్రాన్ని తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. కొత్త విధానం ఇలా... కొత్త విధానంలో స్పాట్ బిల్లింగ్ యంత్రంలో బిల్‌కలెక్టర్ ఇంటి నంబరు కొట్టగానే చెల్లించాల్సిన ఆస్తిపన్ను, బకాయి, జరిమానా తదితర వివరాలు వస్తాయి. వెసులుబాటును బట్టి అప్పటికప్పుడు లేదా తర్వాతైనా ఇంటి యజమానులు ఆస్తిపన్ను చెల్లించుకోవచ్చు. ఆస్తి పన్ను చెల్లించగానే అందుకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదవుతాయి. అనుమానం ఉంటే మళ్లీ మున్సిపాలిటీ అధికారిక వెబ్సైట్లో వివరాలు చెక్‌చేసుకోవచ్చు. ఈ విధానంతో ఆస్తిపన్ను వసూలులో అవినీతికి ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని సిద్ధిపేట, భువనగిరి మున్సిపాలిటీల్లో ఈ విధానం అమలవుతోంది. వచ్చే నెల నుంచి తాండూరులో కూడా స్పాట్ బిల్లింగ్‌ను అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి 8 స్పాట్ బిల్లింగ్ యంత్రాలు కొనుగోలు చేయడంతోపాటు వాటిపై బిల్కలెక్టర్లకు శిక్షణ ఇప్పించాలని అధికారులు యోచిస్తున్నారు. -
ఎన్పీడీసీఎల్ ఆదాయూనికి గండి !
రూ.120 కోట్లకు బ్రేక్ స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మె ఎఫెక్ట్ నిలిచిపోనున్న బిల్లుల వసూళ్లు గత నెల బిల్లుల ఆధారంగా వసూళ్లకు సిద్ధమైన ఉన్నతాధికారులు హన్మకొండ సిటీ : కొనసాగుతున్న స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మెతో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నెలవారీ ఆదాయానికి గండి పడనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో స్పాట్ బిల్లింగ్ వర్కర్లు ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో గృహ వినియోగదారుల బిల్లులు తీసేవారు లేకుండా పోయూరు. గృహవినియోగదారుల ఇళ్లలో బిల్లులు తీసే స్పాట్ బిల్లింగ్ వర్కర్లు ఐదుజిల్లాల పరిధిలో సుమారు 12 వేల మంది ఉన్నారు. వీరు నెలకు 30 లక్షల మంది వినియోగదారుల మీటర్ రీడింగ్ తీసి బిల్లులు అందజేస్తారు. ఈ బిల్లుల ఆధారంగా వినియోగదారులు ప్రతి నెలా బిల్లు చెల్లించేవారు. ఇలా గృహవినియోగదారుల ఇళ్లలో స్పాట్ బిల్లింగ్ వర్కర్లు తీస్తున్న బిల్లుల ద్వారా ప్రతి నెల రూ.120 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరుతుంది. అయితే స్పాట్ బిల్లింగ్ వర్కర్లు తమ సమస్యల సాధనకు ఈ నెల ఒకటో తేదీ నుంచి నిరవధిక సమ్మె చెస్తున్నారు. దీంతో ఐదు జిల్లాల పరిధిలో బిల్లులు తీయడం నిలిచిపోరుుంది. ఫలితంగా విద్యుత్ సంస్థపై ఆర్థికలోటు ప్రభావం పడనుంది. మెట్టు దిగడం లేదు... ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మెకు వెళ్లిన స్పాట్ బిల్లింగ్ వర్కర్లు అదే రోజు అధికారులతో చర్చలు జరిపినా... ఎలాంటి అంగీకారానికి రాలేకపోయారు. మరోసారి చర్చలకు కూర్చుందామని చెప్పిన అధికారులు ఆరు రోజులుగా మొహం చాటేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, ఎన్పీడీసీఎల్ యాజమాన్యం స్పాట్ బిల్లింగ్ వర్కర్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిన్నాయని, సమస్యలు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మండిపడుతున్నారు. సోమవారం నుంచి సమ్మెతోపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఐదు జిల్లాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, స్పాట్ బిల్లింగ్ వర్కర్ల ప్రతినిధులు హన్మకొండలో సమావేశం కానున్నారు. ఇందులో పోరాటాన్ని ఉధృతం చేసే నిర్ణయాలు తీసుకోనున్నట్లు యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు సికిందర్ చెప్పారు. దీన్నిబట్టి స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మె ఇప్పట్లో ముగిసేలా లేదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా... పూర్తిస్థారుులో వసూళ్లు చేసేందుకు ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత నెల బిల్లు ప్రకారం ప్రస్తుత బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
బిల్లింగ్ ‘స్పాట్’
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఆస్తిపన్నును ఆన్లైన్ ద్వారా స్పాట్‌బిల్లింగ్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో దీనిని ప్రారంభించారు. జిల్లాలో 5మున్సిపాలిటీలు 2నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో భువనగిరి పట్టణంలోని 30వార్డుల్లో ప్రధాన పన్నుల వసూలు కోసం 11స్పాట్ బిల్లింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి మిషన్‌లో 30వార్డులకు సంబంధించి బిల్లింగ్ చేసే అవకాశం ఉంది. పన్ను పెండింగ్ వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు మెసేజ్ పంపడంతో పాటు బిల్లు చెల్లించగానే సంబంధిత రికార్డులో నమోదు చేయడమే కాకుండా వినియోగదారునికి ధన్యవాదాలు ప్రకటిస్తూ సమాచారం అందుతుంది. భువనగిరి మున్సిపాలిటీలో ఈ నెల 16 నుంచి ఆస్తిపన్నును స్పాట్ బిల్లింగ్ మిషన్ ద్వారా చెల్లిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నీటి పన్నును కూడా స్పాట్ బిల్లింగ్ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో ఈ విధానం అమలు చేయగా.. ఇప్పుడు భువనగిరిలో అమలు చేస్తున్నారు. త్వరలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలో ప్రవేశపెట్టనున్నారు. 13వేలు ఇళ్లు..7,200 నల్లా కనెక్షన్లు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు 13వేల ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్ను వివరాలను సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచారు. వీటితో పాటు పట్టణంలో ఉన్న 7,200 నల్లాల కనెక్షన్ల పన్ను వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. చెక్కు, నగదు, డీడీ ద్వారా కూడా బిల్లులను స్వీకరిస్తారు. బిల్లు చెల్లించగానే సమాచారం సర్వర్ ద్వారా పొందుపరిచే అవకాశం ఉంది. బిల్ కలెక్టర్లపై నిఘా జీపీఎస్, జీపీఆర్ఎస్ సిస్టంను సమన్వయం చేయడంతో ఇకనుంచి బిల్ కలెక్టర్లు ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారం కూడా ఉన్నతాధికారులుకు అందుతుంది. దీంతో బిల్ కలెక్టర్లు విధులను సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంది. రశీదులు ఇచ్చి పన్ను వసూలు చేసే విధానం ఇక ఉండదు. రూపకల్పన చేసినవారు స్పాట్ బిల్లింగ్ మిషన్ ద్వారా పన్నులు వసూలు చేసే విధానాన్ని మున్సిపల్ డీఎం జనార్దన్‌రెడ్డి, ఆర్డీ సత్యనారాయణతో పాటు ఎంఆర్ కమ్యూనికేషన్ ఆండ్ ఈఆర్పీ డెరైక్టర్ రాజశేఖర్ రూపకల్పన చేశారు. ఇప్పటికే మిషన్ ఉపయోగించే వారికి శిక్షణ ఇచ్చారు. -
విద్యుత్ వినియోగదారులకు బిల్లింగ్ ‘స్పాట్’!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వినియోగం ఒక్క యూనిట్ పెరిగినా.. రీడింగ్ తీయడం ఒక్కరోజు ఆలస్యమైనా విద్యుత్ బిల్లులు తడిసిమోపెడై వినియోగదారులకు భారంగా మారుతుంటే.. ఈ నెలలో జిల్లాలోని వినియోగదారులందరికీ బిల్లులు షాక్ కొట్టనున్నాయి. స్పాట్ బిల్లింగ్ ప్రక్రియ ఈ నెలలో ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడమే దీనికి కారణం. బిల్లింగ్ కాంట్రాక్టర్లు, సిబ్బంది మధ్య నెలకొన్న వివాదం చివరికి వినియోగదారుల మెడకు చుట్టుకుంటోంది. జిల్లాలో సుమారు 2.50 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా మొదటి వారంలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కోరోజు స్పాట్ బిల్లింగ్ సిబ్బంది ఇళ్లకే వెళ్లి రీడింగ్ తీసి అక్కడే బిల్లులు ఇస్తుంటారు. అయితే ఈ నెల 4 నుంచి శ్రీకాకుళం, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, రాజాం పట్టణాలతో పాటు మండలాల్లో నిలిచిపోయింది. స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని, తక్కువ వేతనం చెల్లిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిపై తలెత్తిన విభేదాలతో సిబ్బంది బిల్లింగ్ ప్రక్రియ నిలిపివేశారు. ఒక్క యూనిట్ పెరిగినా బిల్లు భారమే.. విద్యుత్ బిల్లులకు ప్రస్తుతం అమలు చేస్తున్న శ్లాబ్ విధానంలో 50 యూనిట్ల వరకు ఒక రేటు, 100 యూనిట్లకు మరో రేటు, 200 యూనిట్లకు ఇంకో రేటు, ఇలా యూనిట్లు పెరుగుతున్న కొద్ది విద్యుత్ యూనిట్ ధర పెరుగుతూ ఉంటుంది. స్పాట్ బిల్లింగ్ ఆలస్యమైనా, ఒక్క యూనిట్ పెరిగినా శ్లాబ్ మారిపోయి మొత్తం అన్ని యూనిట్లకు ఎక్కువ రేటు పడిపోతుంది. ఉదాహరణకు ఈ నెల నాలుగు నాటికి ఓ వినియోగదారుడు 199 యూనిట్లు వినియోగించాడనుకుంటే.. ఆ రోజు కాకుండా 5వ తేదీన బిల్లింగ్ చేస్తే రీడింగ్ 200 యూనిట్లు దాటి శ్లాబ్ మారిపోతుంది. బిల్లు రెండింతలు పెరిగే ప్రమాదం ఉంది. అటువంటిది ఈ నెలలో ఇప్పటికే బిల్లింగ్ వారం రోజులు ఆలస్యమైంది. దీనివల్ల పెరిగే బిల్లు భారాన్ని తలచుకొని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు స్పాట్ బిల్లింగ్ నిలిచిపోవడం వల్ల విద్యుత్ శాఖకూ నష్టమే. ప్రతి రోజూ ఇంత మొత్తం బిల్లులు వసూలు చేయాలని లక్ష్యం నిర్దేశి స్తారు. ఆ మొత్తాన్ని జమ చేస్తేనే ఆ మేరకు విద్యుత్ సరఫరా ఉంటుంది. లేని పక్షంలో సరఫరాలో కోత విధిస్తారు. ఈ ప్రభావం కూడా కోతల రూపంలో వినియోగదారుల పైనే పరోక్షంగా పడుతుంది. అయినప్పటికీ దీన్ని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. బిల్లులు దాఖలు చేయని కాంట్రాక్టర్లు ఇదిలా ఉండగా కొందరు స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు విద్యుత్‌శాఖకు సకాలంలో బిల్లులు దాఖలు చేయడం లేదు. స్పాట్ బిల్లింగ్ పనులు చేసినందుకు తమకు రావలిసిన మొత్తాలకు సంబంధించిన బిల్లులు సకాలంలో సమర్పిస్తే వాటిని అధికారులు పరిశీలించి మంజూరు చేస్తారు. ఆ మొత్తాన్నే సిబ్బందికి జీతాలుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్టర్లు ప్రతి నెలా కాకుండా ఐదారు నెలలకోసారి బిల్లులు సమర్పిస్తున్నారు. బిల్లులు మంజూరైన తర్వాత కూడా కొందరు కాంట్రాక్టర్లు తమ సిబ్బందికి ఒకటి రెండు నెలల జీతాలే చెల్లిస్తూ మిగతా నెలలవి పెండింగులో పెడుతున్నారు. గుల్జార్ ఈపీడీసీఎల్ సీఎండీగా ఉన్న సమయంలో ప్రతి నెలా 25 నాటికి కాంట్రాక్టర్లు తమ బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలని నిబంధన విధించారు. ఆయన బదిలీ అయిన తర్వాత ఆ నిబంధనను తుంగలోకి తొక్కేశారు. దాంతో బిల్లుల సమర్పణ, చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో ఎస్ఈ పీవీవీ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా స్పాట్ బిల్లింగ్ నిలిచిపోవడం వాస్తవమేనన్నారు. కాంట్రాక్టర్లకు, సిబ్బందికి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తక్షణం బిల్లింగ్ ప్రారంభించాలని నోటీసులు జారీ చేశామని చెప్పారు.