స్పాట్ బిల్లింగ్‌కు కొత్త టెండర్లు..
స్పాట్ బిల్లింగ్‌కు కొత్త టెండర్లు..
Published Thu, Aug 10 2017 12:41 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
కమీషన్లు పెంచిన విద్యుత్ సంస్థ
చెల్లింపుల్లో కోతపై రీడర్ల ఆవేదన..
మొత్తం సర్వీసులు: 11,84,362
మీటర్ రీడింగ్‌కు చెల్లించేది
పట్టణాల్లో: రూ. 4.69
గ్రామాల్లో: రూ. 4.94
ఏజెన్సీలో: రూ.5.67
రీడింగ్ సిబ్బంది: 381
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :
జిల్లాలో విద్యుత్ బిల్లుల రీడింగ్‌ను తీసి వినియోగదారులకు ఇచ్చే విధానాన్ని గత కొన్నేళ్లుగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్న విషయం విదితమే. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని 5 డివిజన్లలో బిల్లింగ్ కాంట్రాక్టర్ల కాలపరిమితి 2015 16 ఆర్థిక సంవత్సరానికి ముగిసిపోయింది. ఐతే సంస్థ సీఎండీ ఆదేశాల మేరకు వారి కాంట్రాక్టును 201617 ఆర్థిక సంవత్సరానికి కూడా పొడిగించారు. అప్పట్లో కాంట్రాక్టులు పొందిన వారు బిల్లింగ్ మెషీన్లు కొత్తగా కొన్నందున వారికి మెషీన్ల కొనుగోలుకు పెట్టిన పెట్టుబడి సమకూర్చుకోవడానికి సానుకూల దృక్పథంతో ఈ పొడిగింపు ఇచ్చారు. ఆ పొడిగింపు గడువు కూడా ముగియడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త కాంట్రాక్టులకు టెండర్లు పిలవాల్సి ఉన్న ఆ సంస్థ అధికారులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది కూడా పొడిగిస్తారని పాత కాంట్రాక్టర్లు ఆశించారు. ఐతే స్పాట్ బిల్లింగ్‌కు కొత్తగా టెండర్లు పిలవాలని ఈ నెల 2వ తేదీన సంస్థ సీఎండీ ఎంఎం నాయక్ 1781 నెంబర్‌తో మెమో జారీ చేశారు. దీనిపై జిల్లాలో ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ కసరత్తులు ప్రారంభించారు.
ధర పెంచిన సంస్థ..
గతంలో స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టరుకు ఒక్కో బిల్లుకు సంస్థ చెల్లించే మొత్తంపై ఈ ఏడాది కొత్తగా పిలిచే టెండర్లలో దాదాపు 50 పైసలు పెంచింది. గతంలో నగర, పట్టణ ప్రాంతాల్లో బిల్లు రీడింగ్ తీస్తే ఒక్కో సర్వీసుకు రూ.4.19 గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసుకు రూ.4.41, ఏజన్సీ ప్రాంతాల్లో రూ. 5.05 చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది పిలిచే టెండర్లలో కాంట్రాక్టర్లకు మరింత కమీషన్ వచ్చేలా ఆ మొత్తాన్ని సంస్థ« పెంచింది. ప్రస్తుత ధరల ప్రకారం నగర, పట్టణ ప్రాంతాల్లో రూ.4.69, గ్రామీణ ప్రాంతాల్లో రూ.4.94, ఏజన్సీ ప్రాంతాల్లో రూ.5.67గా ధరలు నిర్ణయించింది. టెండర్లకు బిడ్డింగులు వేసే కాంట్రాక్టర్లు ఆ మొత్తానికంటే తక్కువకు ఎవరు వేస్తే వారికి కాంట్రాక్టు దక్కుతుంది.
రీడర్లకు చెల్లింపుల్లో కోత కోస్తున్న కాంట్రాక్టర్లు..
ఇంటింటికీ తిరిగి మీటర్ రీడింగ్ తీసే రీడర్లకు చెల్లింపుల్లో కాంట్రాక్టర్లు కోత కోస్తున్నారు. టెండర్ల నియమ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. నిబంధనల ప్రకారం నగర, పట్టణ ప్రాంతాల్లో బిల్లు రీడర్లకు కాంట్రాక్టర్ బిల్లుకు రూ. 2.55 చొప్పున చెల్లించాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రీడర్లకు రూ. 2.72, ఏజన్సీ ప్రాంతాల్లో రూ. 3.19 నిబంధనల మేరకు చెల్లించాలి. కానీ కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా రీడర్లకు దాదాపు 85 పైసల నుండి 95 పైసలు కోత విధించి చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 21 సబ్ డివిజన్ల పరిధిలో 11,84,362 సర్వీసులుండగా వాటి రీడింగ్ కాంట్రాక్టర్లు 381 మంది సిబ్బందిని నియమించుకున్నారు. వీరందరికీ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తంలో నెలకు సుమారు రూ. 10. 65 లక్షలను ఆయా కాంట్రాక్టర్లు మింగేస్తున్నారు.
ఫిర్యాదులుంటే చర్యలు తీసుకుంటాం..
సీహెచ్ సత్యనారాయణ రెడ్డి, ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్.
రీడర్లకు నిబంధనల ప్రకారం మొత్తాన్ని చెల్లించాల్సిందే. అందులో కోత విధించడం నిబంధనలకు విరుద్ధం. ఐతే ఇప్పటి వరకూ రీడర్ల వద్ద నుండి మాకు ఎటువంటి ఫిర్యాదులూ అందలేదు. అన్యాయానికి గురైన వారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో మా అధికారులను కూడా దీనిపై పర్యవేక్షణకు పెడతాం.
Advertisement
Advertisement