విద్యుత్ వినియోగదారులకు బిల్లింగ్ ‘స్పాట్’!
Published Wed, Feb 12 2014 2:01 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వినియోగం ఒక్క యూనిట్ పెరిగినా.. రీడింగ్ తీయడం ఒక్కరోజు ఆలస్యమైనా విద్యుత్ బిల్లులు తడిసిమోపెడై వినియోగదారులకు భారంగా మారుతుంటే.. ఈ నెలలో జిల్లాలోని వినియోగదారులందరికీ బిల్లులు షాక్ కొట్టనున్నాయి. స్పాట్ బిల్లింగ్ ప్రక్రియ ఈ నెలలో ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడమే దీనికి కారణం. బిల్లింగ్ కాంట్రాక్టర్లు, సిబ్బంది మధ్య నెలకొన్న వివాదం చివరికి వినియోగదారుల మెడకు చుట్టుకుంటోంది. జిల్లాలో సుమారు 2.50 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా మొదటి వారంలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కోరోజు స్పాట్ బిల్లింగ్ సిబ్బంది ఇళ్లకే వెళ్లి రీడింగ్ తీసి అక్కడే బిల్లులు ఇస్తుంటారు. అయితే ఈ నెల 4 నుంచి శ్రీకాకుళం, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, రాజాం పట్టణాలతో పాటు మండలాల్లో నిలిచిపోయింది. స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని, తక్కువ వేతనం చెల్లిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిపై తలెత్తిన విభేదాలతో సిబ్బంది బిల్లింగ్ ప్రక్రియ నిలిపివేశారు.
ఒక్క యూనిట్ పెరిగినా బిల్లు భారమే..
విద్యుత్ బిల్లులకు ప్రస్తుతం అమలు చేస్తున్న శ్లాబ్ విధానంలో 50 యూనిట్ల వరకు ఒక రేటు, 100 యూనిట్లకు మరో రేటు, 200 యూనిట్లకు ఇంకో రేటు, ఇలా యూనిట్లు పెరుగుతున్న కొద్ది విద్యుత్ యూనిట్ ధర పెరుగుతూ ఉంటుంది. స్పాట్ బిల్లింగ్ ఆలస్యమైనా, ఒక్క యూనిట్ పెరిగినా శ్లాబ్ మారిపోయి మొత్తం అన్ని యూనిట్లకు ఎక్కువ రేటు పడిపోతుంది. ఉదాహరణకు ఈ నెల నాలుగు నాటికి ఓ వినియోగదారుడు 199 యూనిట్లు వినియోగించాడనుకుంటే.. ఆ రోజు కాకుండా 5వ తేదీన బిల్లింగ్ చేస్తే రీడింగ్ 200 యూనిట్లు దాటి శ్లాబ్ మారిపోతుంది. బిల్లు రెండింతలు పెరిగే ప్రమాదం ఉంది. అటువంటిది ఈ నెలలో ఇప్పటికే బిల్లింగ్ వారం రోజులు ఆలస్యమైంది. దీనివల్ల పెరిగే బిల్లు భారాన్ని తలచుకొని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు స్పాట్ బిల్లింగ్ నిలిచిపోవడం వల్ల విద్యుత్ శాఖకూ నష్టమే. ప్రతి రోజూ ఇంత మొత్తం బిల్లులు వసూలు చేయాలని లక్ష్యం నిర్దేశి స్తారు. ఆ మొత్తాన్ని జమ చేస్తేనే ఆ మేరకు విద్యుత్ సరఫరా ఉంటుంది. లేని పక్షంలో సరఫరాలో కోత విధిస్తారు. ఈ ప్రభావం కూడా కోతల రూపంలో వినియోగదారుల పైనే పరోక్షంగా పడుతుంది. అయినప్పటికీ దీన్ని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు.
బిల్లులు దాఖలు చేయని కాంట్రాక్టర్లు
ఇదిలా ఉండగా కొందరు స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు విద్యుత్‌శాఖకు సకాలంలో బిల్లులు దాఖలు చేయడం లేదు. స్పాట్ బిల్లింగ్ పనులు చేసినందుకు తమకు రావలిసిన మొత్తాలకు సంబంధించిన బిల్లులు సకాలంలో సమర్పిస్తే వాటిని అధికారులు పరిశీలించి మంజూరు చేస్తారు. ఆ మొత్తాన్నే సిబ్బందికి జీతాలుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్టర్లు ప్రతి నెలా కాకుండా ఐదారు నెలలకోసారి బిల్లులు సమర్పిస్తున్నారు. బిల్లులు మంజూరైన తర్వాత కూడా కొందరు కాంట్రాక్టర్లు తమ సిబ్బందికి ఒకటి రెండు నెలల జీతాలే చెల్లిస్తూ మిగతా నెలలవి పెండింగులో పెడుతున్నారు. గుల్జార్ ఈపీడీసీఎల్ సీఎండీగా ఉన్న సమయంలో ప్రతి నెలా 25 నాటికి కాంట్రాక్టర్లు తమ బిల్లులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని నిబంధన విధించారు. ఆయన బదిలీ అయిన తర్వాత ఆ నిబంధనను తుంగలోకి తొక్కేశారు. దాంతో బిల్లుల సమర్పణ, చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో ఎస్‌ఈ పీవీవీ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా స్పాట్ బిల్లింగ్ నిలిచిపోవడం వాస్తవమేనన్నారు. కాంట్రాక్టర్లకు, సిబ్బందికి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తక్షణం బిల్లింగ్ ప్రారంభించాలని నోటీసులు జారీ చేశామని చెప్పారు.
Advertisement