ఎచ్చెర్ల: ఎచ్చెర్ల ఆర్మీ రిజర్వ్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నెయ్యిల ఆదినారాయణ (28) బుధవారం విద్యుదాఘాతంతో మృతిచెందారు. మరొక కానిస్టేబుల్ వై.రామరాజు గాయపడ్డారు. ఆదినారాయణ ఏఆర్ కార్యాలయం సమీపంలోని మరిడమ్మ గుడి సమీపంలో జెండాలు పాతేందుకు ఐరన్ పోల్సు తీసుకువెళ్తుండగా 11/33 కేవీ విద్యుత్ లైన్ వైర్లు పొరపాటున తగిలాయి. ఈ ఘటనలో ఆదినారాయణ తీవ్రగాయాలతో అపస్మారక స్థితి చేరుకున్నారు. వెనుకనే పోల్ తీసుకువెళ్తున్న మరో కానిస్టేబుల్ వై .రామరాజు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానిక సిబ్బంది క్షతగాత్రులిద్దరినీ శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆదినారాయణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రామరాజుకు ప్రాణాపాయం తప్పింది. ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ కె.భర్గవరావునాయుడు ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
కె.ఎస్.పల్లిలో విషాదం చాయలు
సారవకోట మండలంలోని కొమ్ముసరియాపల్లికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నెయ్యిల ఆదినారాయణ మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆరు నెలల కిందటే ఈయనకు టెక్కలికి చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. ఇంతలోనే తమ బిడ్డను మృత్యువు తీసుకెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి రాజారావు, తల్లి చిన్నమ్ముడు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆదినారాయణ సోదరులిద్దరూ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
Published Thu, Jun 2 2016 11:19 AM | Last Updated on Mon, Apr 8 2019 8:33 PM
Advertisement