- రూ.120 కోట్లకు బ్రేక్
- స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మె ఎఫెక్ట్
- నిలిచిపోనున్న బిల్లుల వసూళ్లు
- గత నెల బిల్లుల ఆధారంగా వసూళ్లకు సిద్ధమైన ఉన్నతాధికారులు
హన్మకొండ సిటీ : కొనసాగుతున్న స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మెతో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నెలవారీ ఆదాయానికి గండి పడనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో స్పాట్ బిల్లింగ్ వర్కర్లు ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో గృహ వినియోగదారుల బిల్లులు తీసేవారు లేకుండా పోయూరు. గృహవినియోగదారుల ఇళ్లలో బిల్లులు తీసే స్పాట్ బిల్లింగ్ వర్కర్లు ఐదుజిల్లాల పరిధిలో సుమారు 12 వేల మంది ఉన్నారు. వీరు నెలకు 30 లక్షల మంది వినియోగదారుల మీటర్ రీడింగ్ తీసి బిల్లులు అందజేస్తారు.
ఈ బిల్లుల ఆధారంగా వినియోగదారులు ప్రతి నెలా బిల్లు చెల్లించేవారు. ఇలా గృహవినియోగదారుల ఇళ్లలో స్పాట్ బిల్లింగ్ వర్కర్లు తీస్తున్న బిల్లుల ద్వారా ప్రతి నెల రూ.120 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరుతుంది. అయితే స్పాట్ బిల్లింగ్ వర్కర్లు తమ సమస్యల సాధనకు ఈ నెల ఒకటో తేదీ నుంచి నిరవధిక సమ్మె చెస్తున్నారు. దీంతో ఐదు జిల్లాల పరిధిలో బిల్లులు తీయడం నిలిచిపోరుుంది. ఫలితంగా విద్యుత్ సంస్థపై ఆర్థికలోటు ప్రభావం పడనుంది.
మెట్టు దిగడం లేదు...
ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మెకు వెళ్లిన స్పాట్ బిల్లింగ్ వర్కర్లు అదే రోజు అధికారులతో చర్చలు జరిపినా... ఎలాంటి అంగీకారానికి రాలేకపోయారు. మరోసారి చర్చలకు కూర్చుందామని చెప్పిన అధికారులు ఆరు రోజులుగా మొహం చాటేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, ఎన్పీడీసీఎల్ యాజమాన్యం స్పాట్ బిల్లింగ్ వర్కర్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిన్నాయని, సమస్యలు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మండిపడుతున్నారు.
సోమవారం నుంచి సమ్మెతోపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఐదు జిల్లాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, స్పాట్ బిల్లింగ్ వర్కర్ల ప్రతినిధులు హన్మకొండలో సమావేశం కానున్నారు. ఇందులో పోరాటాన్ని ఉధృతం చేసే నిర్ణయాలు తీసుకోనున్నట్లు యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు సికిందర్ చెప్పారు. దీన్నిబట్టి స్పాట్ బిల్లింగ్ వర్కర్ల సమ్మె ఇప్పట్లో ముగిసేలా లేదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా... పూర్తిస్థారుులో వసూళ్లు చేసేందుకు ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత నెల బిల్లు ప్రకారం ప్రస్తుత బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.