
వీటిలో టీజీఎస్పీడీసీఎల్ నష్టాలు రూ.47,239.15 కోట్లు.. టీజీఎన్పీడీసీఎల్‌వి రూ.20,036.92 కోట్లు
విద్యుత్ కొనుగోళ్లకు అధిక వ్యయం చేయడమే కారణం
ఈఆర్సీకి నివేదించిన దక్షిణ, ఉత్తర తెలంగాణ డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆర్థిక సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతున్నాయి. ఏటేటా పేరుకుపోతున్న నష్టాలు కొండలాగా పెరిగి చివరకు డిస్కంలను దివాళా పట్టించేలా మారాయి. ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్ / టీజీఎస్పీడీసీ ఎల్)లు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఏటేటా పెరిగిపోతున్న రెండు డిస్కంల ఆర్థిక నష్టాలు 2023–24 నాటికి రూ.67,276.07 కోట్లకు ఎగబాకాయి.
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ఇటీవల రెండు డిస్కంలు సమర్పించిన 2025–26కి సంబంధించిన డిస్ట్రిబ్యూ షన్ బిజినెస్, వీలింగ్ టారిఫ్ ప్రతిపాదనలపై విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్ రావు లేవనెత్తిన పలు అభ్యంతరాలకు వివరణ ఇస్తూ ఈ వివరాలు వెల్లడించాయి.

నష్టాల్లో దక్షిణ తెలంగాణ డిస్కం టాప్
దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి ఐదు జిల్లాల్లో వినియోగదారులకు విద్యు త్ సరఫరా చేసే టీజీఎస్పీడీసీఎల్ 2023–24లో రూ.4,909. 53 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా.. సంస్థ మొత్తం నష్టాలు రూ.47,239.15 కోట్లకు ఎగబాకాయి. ఇక ఉత్తర తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో విద్యుత్ సరఫరా చేసే టీజీఎన్పీడీసీఎల్ 2023–24లో రూ.1441.18 కోట్ల నష్టాల ను చవిచూడగా మొత్తం రూ.20,036.92 కోట్లకు పెరిగిపో యాయి. అంటే, రెండు డిస్కంలు కలిపి 2023–24లో రూ.6350.71 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏటేటా నష్టాలు ఇదే తీరులో కొనసాగితే మరో ఐదారేళ్లలో నష్టాల మొత్తం రూ.లక్ష కోట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి.
సర్కారు అదనపు సహాయం ఇస్తేనే..
పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లు వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడం కోసం విద్యుత్ కొనుగోళ్లకు అధిక వ్యయం చేయడంతోనే భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని రెండు డిస్కంలు స్పష్టం చేశాయి. అయితే, ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన విద్యుత్‌కి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది. వివిధ గ్రాంట్లు, పథకాల కింద ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందిస్తే నష్టాలను అధిగమిస్తామని టీజీఎన్పీడీసీఎల్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment