ఎక్స్ఛేంజీల్లో ‘కరెంట్‌’పై ఆంక్షలు | Center bans TGSPDCL from trading in power exchanges: Telangana | Sakshi
Sakshi News home page

ఎక్స్ఛేంజీల్లో ‘కరెంట్‌’పై ఆంక్షలు

Published Fri, Sep 13 2024 6:06 AM | Last Updated on Fri, Sep 13 2024 6:06 AM

Center bans TGSPDCL from trading in power exchanges: Telangana

పవర్‌ ఎక్స్ఛేంజీల్లో క్రయవిక్రయాలు జరపకుండా టీజీఎస్పీడీసీఎల్‌పై కేంద్రం ఆంక్షలు 

గతంలో విధించిన రూ.261.31 కోట్ల చార్జీలను చెల్లించకపోవడంతో చర్యలు 

టీజీఎస్పీడీసీఎల్‌ను బ్లాక్‌ లిస్టులో చేర్చిన గ్రిడ్‌ కంట్రోలర్‌

సాక్షి, హైదరాబాద్‌: పవర్‌ ఎక్స్ఛేంజీల్లో విద్యుత్‌ క్రయవిక్రయాల ట్రేడింగ్‌ జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌)పై గ్రిడ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా గురువారం ఆంక్షలు విధించింది. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల కోసం గతంలో బుక్‌ చేసుకున్న 1,000 మెగావాట్ల కారిడార్‌ను వదులుకున్నందుకు రూ.261.31 కోట్ల చార్జీలను టీజీఎస్పీడీసీఎల్‌ చెల్లించడం లేదంటూ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (పీజీసీఐఎల్‌) చేసిన ఫిర్యాదుతో ఈ మేరకు తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. 

కేంద్ర విద్యుత్‌ శాఖ 2022 మార్చి 10న ప్రకటించిన లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీ రూల్స్‌ కింద విద్యుదుత్పత్తి, ట్రాన్స్‌మిషన్‌ సంస్థలకు చెల్లింపులను ఇన్వాయిస్‌ల జారీ నుంచి 75 రోజుల్లోగా విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా బకాయిలను చెల్లించడంలో విఫలమైన దేశంలోని 16 డిస్కంలను బ్లాక్‌ లిస్టులో పెడుతూ ‘ప్రాప్తి’పోర్టల్‌లో గ్రిడ్‌ కంట్రోలర్‌ గురువారం ప్రకటన చేయగా, ఆ జాబితాలో టీజీఎస్పీడీసీఎల్‌ సైతం ఉండటం గమనార్హం.  

2,000 మెగావాట్ల కారిడార్‌ బుక్‌ చేసిన గత ప్రభుత్వం  
తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉండటంతో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగో లు చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ను సరఫరా చేసుకోవడం కోసం అప్పట్లో పీజీసీఐఎల్‌ నిర్మిస్తున్న వార్ధా–డిచ్‌పల్లి 765/400 కేవీ కారిడార్‌లో ముందస్తుగా 2,000 మెగావాట్ల కారిడార్‌ను బుక్‌ చేసుకోవడానికి దర ఖాస్తు చేసుకుంది. అయితే, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్‌ను 12 ఏళ్ల పాటు కొనుగోలు చేసుకునేందుకు మాత్రమే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ విద్యుత్‌ ధరలు అధికంగా ఉంటాయని విమర్శలు రావడంతో మరో 1,000 మెగావాట్లను కొనుగోలు చేసే ఆలోచనను విరమించుకుంది.

ఈ నేపథ్యంలో 1000 మెగావాట్ల కారిడార్‌ను మాత్రమే కేటాయించాలని పీజీసీఐఎల్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో పీజీసీఐఎల్‌ ఆ కారిడార్‌ కేటాయింపులను రద్దు చేసింది. కారిడార్‌ను వదు లుకున్నందుకు రూ.261.31 కోట్ల రిలింక్వి‹Ùమెంట్‌ చార్జీలను చెల్లించాలని టీజీఎస్పీడీసీఎల్‌కు డిమాండ్‌ నోటీసులు చేసింది. టీజీఎస్పీడీసీఎల్‌ ఈ చార్జీల ను చెల్లించకపోవడంతో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ సీఈఆర్సీని ఆశ్రయించింది. టీజీఎస్పీడీసీఎల్‌ తర హాలోనే దేశంలో కారిడార్‌ వదులుకున్న మిగిలిన అన్ని డిస్కంల వివరాలను సమరి్పంచాలని పీజీసీఐఎల్‌ను అప్పట్లో సీఈఆర్సీ ఆదేశించింది.

ఈ వివరాలేవీ అందించకుండా పీజీసీఐఎల్‌ రూ.261.31 కోట్ల చార్జీలను ఎలా లెక్కించిందని టీజీఎస్పీడీసీఎల్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు టీజీఎస్పీడీసీఎల్‌ డిపాజిట్‌ చేసిన రూ.కోటి బ్యాంకు గ్యారంటీని పీజీసీఐఎల్‌ ఏకపక్షంగా జప్తు చేసుకుంది. చార్జీలు అడగకుండా పీజీసీఐఎల్‌ను నిలువరించాలని కోరుతూ 2021 జూన్‌ 25న సీఈఆర్సీని టీజీఎస్పీడీసీఎల్‌ సంప్రదించగా, కేసు విచారణ తుది దశకు చేరింది. కేసు పెండింగ్‌లో ఉండగానే టీజీఎస్పీడీసీఎల్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement