జిల్లాలో మొదటిసారిగా తాండూరు మున్సిపాలిటీలో అమలు
అవినీతికి కళ్లెం పడే అవకాశం
తాండూరు: ఆస్తిపన్ను వసూలుకు అధికారులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. మాన్యువల్ పద్ధతికి బదులు స్పాట్ బిల్లింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకు రానున్నారు. గతంలో ఆస్తిపన్ను చెల్లించినా మళ్లీ బకాయి ఉన్నట్లు బిల్లులు రావడం, పన్ను చెల్లింపు వివరాలు రికార్డుల్లో నమోదు కాకపోవడం తదితర సమస్యలు వచ్చేవి. ఇకముందు తాండూరు మున్సిపాలిటీలో ఈ పరిస్థితి కనిపించదు. మున్సిపాలిటీలో ఆస్తిపన్ను(ప్రాపర్టీ టాక్స్) చెల్లింపునకు స్పాట్ బిల్లింగ్ విధానం అమల్లోకి రానుంది. తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులు, బకాయిలు, జరిమానాలు తదితర వివరాలన్నీ ఇప్పటికే మున్సిపాలిటీ వెబ్‌సైట్‌లో నమోదయ్యాయి. ఈ రెండింటిలో కొత్త విధానాన్ని ముందుగా తాండూరులో అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు.
11,013 భవనాలు.. రూ.2.40కోట్ల పన్ను
తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. మున్సిపాలిటీలో మొత్తం అసెస్‌మెంట్ చేసిన గృహాలు, భవనాలు, ఫంక్షన్ హాళ్లు 11,013 ఉన్నాయి. ఏడాదికి సుమారు రూ.2.40 కోట్ల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుతం 8 మంది బిల్‌కలెక్టర్లు ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. బిల్ కలెక్టర్లు ఇంటింటికీ తిరుగుతూ ఆస్తిపన్ను వివరాలు తెలియజేస్తూ చెల్లించిన డబ్బులకు రసీదునిస్తారు. ఈ విధానంలో అవినీతికి చోటుండటంతోపాటు వివరాలు తప్పుగా నమోదవుతుండటంతో స్పాట్ బిల్లింగ్ యంత్రాన్ని తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
కొత్త విధానం ఇలా...
కొత్త విధానంలో స్పాట్ బిల్లింగ్ యంత్రంలో బిల్‌కలెక్టర్ ఇంటి నంబరు కొట్టగానే చెల్లించాల్సిన ఆస్తిపన్ను, బకాయి, జరిమానా తదితర వివరాలు వస్తాయి. వెసులుబాటును బట్టి అప్పటికప్పుడు లేదా తర్వాతైనా ఇంటి యజమానులు ఆస్తిపన్ను చెల్లించుకోవచ్చు. ఆస్తి పన్ను చెల్లించగానే అందుకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదవుతాయి.
అనుమానం ఉంటే మళ్లీ మున్సిపాలిటీ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు చెక్‌చేసుకోవచ్చు. ఈ విధానంతో ఆస్తిపన్ను వసూలులో అవినీతికి ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని సిద్ధిపేట, భువనగిరి మున్సిపాలిటీల్లో ఈ విధానం అమలవుతోంది. వచ్చే నెల నుంచి తాండూరులో కూడా స్పాట్ బిల్లింగ్‌ను అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి 8 స్పాట్ బిల్లింగ్ యంత్రాలు కొనుగోలు చేయడంతోపాటు వాటిపై బిల్‌కలెక్టర్‌లకు శిక్షణ ఇప్పించాలని అధికారులు యోచిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో వివరాల నమోదు
Published Sun, Nov 30 2014 12:03 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement