subsidy cuts
-
‘ఫేమ్’ లేని ఈ–టూవీలర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు భారీ షాక్ తగిలింది. ఫేమ్–2 సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత విధించడంతో గత నెలలో ఈ–టూ వీలర్ల అమ్మకాలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. 2023 జూన్‌లో దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్లవి కలిపి 45,734 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఇది 56.58 శాతం తగ్గుదల. 2022 జూన్‌లో భారత్‌లో 44,381 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే క్రితం ఏడాదితో పోలిస్తే గత నెల విక్రయాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. 40 శాతం ఉన్న ఫేమ్ సబ్సిడీ కాస్తా 2023 జూన్ 1 నుంచి 15 శాతానికి వచ్చి చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో తయారీ కంపెనీలు చాలామటుకు ద్విచక్ర వాహనాల ధరలను పెంచడం ప్రస్తుత పరిస్థితికి కారణం. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు అనే విషయంలో మే నెల, జూన్ అమ్మకాలు నిదర్శనంగా నిలిచాయి. అత్యధికంగా మే నెలలో.. దేశంలో అత్యధికంగా 2023 మే నెలలో 1,05,338 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ వీలర్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. భారత్‌లో తొలిసారిగా ఈ–టూవీలర్లు ఒక లక్ష యూనిట్ల మార్కును దాటాయి. జూన్ నుంచి ఫేమ్ సబ్సిడీ తగ్గుతుందన్న వార్తల నేపథ్యం మే నెల అమ్మకాల జోరుకు కారణమైంది. ఈ ఏడాది మార్చితో పోలిస్తే 22.53 శాతం తగ్గి ఏప్రిల్‌లో 66,466 యూనిట్లు నమోదయ్యాయి. దేశంలో తొలుత 2022 ఆగస్ట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 50,000 యూనిట్ల మార్కును చేరుకున్నాయి. ఆ నెలలో మొత్తం 52,225 యూనిట్లు భారత రోడ్లపై పరుగెత్తాయి. అదే ఏడాది పండుగల సీజన్ అయిన అక్టోబర్‌లో ఈ సంఖ్య 77,250 యూనిట్లకు చేరింది. భారత్‌లో 135 కంపెనీలు ఈ–టూ వీలర్ల రంగంలో పోటీపడుతున్నాయి. జూన్ మాసంలో టాప్–8 కంపెనీల వాటా ఏకంగా 86.66 శాతం ఉంది. వీటిలో ఏడు కంపెనీలు తిరోగమన వృద్ధి సాధించడం గమనార్హం. కంపెనీ మే జూన్ క్షీణత (శాతాల్లో) ఓలా 28,629 17,552 38.7 టీవీఎస్ 20,397 7,791 61.8 ఏథర్ 15,407 4,540 70.5 బజాజ్ 9,965 2,966 70.2 ఓకినావా 2,907 2,616 10 -
ఈవీలపై రూ.30,000 కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫేమ్ సబ్సిడీ నిలిపివేతతో ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ కంపెనీలు కార్యకలాపాల పునరుద్ధరణ, కొనసాగడానికి రూ.3,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఈవీ) ప్రభుత్వాన్ని కోరింది. సొసైటీ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి కంపెనీలకు రూ.1,200 కోట్లకుపైగా సబ్సిడీ బకాయిలు రావాల్సి ఉందని లేఖలో ప్రస్తావించింది. 18 నెలలుగా ఈ మొత్తాల కోసం పరిశ్రమ ఎదురు చూస్తోందని గుర్తుచేసింది. ఆర్థిక ఒత్తిడి నుండి కంపెనీలు చాలా వరకు బయటకు రాలేవని సొసైటీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ‘ఒకవేళ బకాయిలు చెల్లించిన తర్వాత వచ్చే ఒకట్రెండేళ్లు కంపెనీలు నిలదొక్కుకోవడానికి పునరావాస నిధి ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలి. సబ్సిడీ పథకం పతనం కారణంగా కార్యకలాపాలతోపాటు విక్రయాలు నిలిచిపోయాయి. కస్టమర్లు బుకింగ్స్‌ను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. డీలర్‌షిప్‌లపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది’ అని లేఖలో వెల్లడించారు. పెట్టుబడులకు విముఖత కోల్పోయిన పనిదినాలు, అవకాశాల నష్టం, మార్కెట్ వాటా క్షీణత, పరిశ్రమ ఇమేజ్ దెబ్బతినడం.. సమిష్టిగా ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయిక అంచనా ప్రకారం పరిశ్రమకు రూ.30,000 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని గిల్ తన లేఖలో ప్రస్తావించారు. ‘తయారీ సంస్థలకు వ్యతిరేకంగా తరచుగా జరుగుతున్న వ్యతిరేక చర్యల కారణంగా ఈ రంగంపై పెట్టుబడిదారులు తీవ్ర విముఖత చూపుతున్నారు. బ్యాంకులు కూడా నిజానికి రుణాన్ని విస్తరించడానికి ఇష్టపడడంలేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీలు రుణాలను తిరిగి చెల్లించలేనందున బ్యాంకులు అనుషంగిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. పునరావాస నిధి గ్రాంట్ లేదా రుణదాతలకు గ్యారెంటీ మెకానిజమ్‌గా పని చేసే సబ్వెన్షన్ పథకం రూపంలో ఉండాలి. -
గ్యాస్ రాయితీకి మంగళం
పెరుగుతున్న గ్యాస్ ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. గ్యాస్ రాయితీకి కేంద్రం మంగళం పాడటం..ఆచరణలో అమలు కావడంతో వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే రాయితీ రూ.200లు ఇస్తామని ప్రకటించగా మిగతా వంటగ్యాస్ వినియోగదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కూరగాయల ధరలు, పెట్రోలు ధరలు పెరగగా తాజాగా గ్యాస్ రాయితీకి రాంరాం చెప్పడం ఆందోళనకర పరిణామం. –కరీంనగర్ అర్బన్ లక్ష్యం చేరలే.. గుర్తించినోళ్లకు ఇవ్వలే ♦ జిల్లా జనాభా 10,29,078 కాగా 3,18,562 కుటుంబాలున్నాయి. ♦నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలని, కాలుష్యరహిత వాతావరణంకోసం ఉజ్వల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా లక్ష్యానికి ఆమడదూరంలో ఉండటం మన జిల్లాకే చెల్లు. ♦ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దన్నుగా నిలవాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా..ని కాగితాల్లోనే మూలుగుతోంది. ♦ఆర్భాటంగా దరఖాస్తులను స్వీకరించారే తప్పా అమలులో మాత్రం శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. ♦ జిల్లాలో 16 మండలాలకు గానూ ఎక్కడా లక్ష్యాన్ని చేరకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. ♦ ఉజ్వల్ పథకం ప్రారంభంలో జిల్లాకు 52,278 కనెక్షన్లు మంజూరు చేశారు. 27,444 మంది లబ్ధిదారులున్నారని గుర్తించగా 16,480 మందికి గ్యాస్ కనెక్షన్లు గ్రౌండింగ్ చేశారని సమాచారం. ♦ అయితే గుర్తించిన సంఖ్య ప్రకారం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ♦ ఒక్కో గ్యాస్ కనెక్షన్‌కు రూ.1650 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో 14.2 కిలోల సిలిండర్, డిపాజిట్, రెగ్యులేటర్, సురక్ష పైపు, పాస్‌పుస్తకం, నిర్వహణ ఛార్జీలు తదితర వాటికి చెల్లిస్తుంది. ♦ స్టవ్, మొదటి సిలిండర్ కొనుగోలు కొరకు వడ్డీలేని రుణాన్ని వివిధ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు లబ్ధిదారులకు ఇస్తాయి. ♦ దీన్ని మళ్లీ వినియోగదారులు గ్యాస్ వినియోగించే సమయంలో విడుదలయ్యే రాయితీ ఏడో సిలిండర్ నుంచి మినహాయించుకుంటాయి. ♦ రేషన్‌కార్డు ఉండి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలో గతంలో గ్యాస్ కనెక్షన్ పొందనివారు ఈ పథకానికి అర్హులు. ♦ కానీ జిల్లాలో కనెక్షన్ మంజూరు, గ్రౌండింగ్‌లో వెనుకబడి ఉండటంతో రాయితీకి దూరమవుతున్నారు. క్రమేణా రాయితీ మాయం ♦ 2010 వరకు ఎలాంటి రాయితీ లేదు. ఆ తరువాత సిలిండర్ ధర రూ.340 నుంచి ఒక్కసారిగా రూ.425కి పెంచారు. ♦ దీంతో కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.85 రా యితీ ఇస్తున్నట్లు ప్రకటించి అమలు చేసింది. ♦ క్రమక్రమంగా గ్యాస్ ధర పెరిగినప్పుడల్లా స్టాండర్డ్ రేటును నిర్ణయించుకొని మిగతా సొమ్మును ప్రభుత్వం వినియోగదారులకు రాయితీ ఇస్తూ వస్తోంది. ♦ కోవిడ్ సమయంలో రెండేళ్ల కిందటి నుంచి వంట గ్యాస్‌పై ఇచ్చే రాయితీని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు. ♦ చివరికి ప్రభుత్వం ఒక్క ఉజ్వల పథకం సిలిండర్లకు మాత్రమే రూ.200 రాయితీ ఇస్తూ మిగతా అన్ని సిలిండర్లకు రాయితీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వంట గ్యాస్ ప్రస్తుత ధర – రూ.1,075 వాణిజ్య సిలిండర్ ధర – రూ.2,464 ఉజ్వల కనెక్షన్దారుకు గ్యాస్ – రూ.1,075 రాయితీ – రూ.200 చెల్లించాల్సింది – రూ.875 ఉజ్వల కనెక్షన్ల పరిస్థితి గణాంకాల్లో జిల్లాకు మంజూరైన ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు: 52,278 గుర్తించిన లబ్ధిదారుల సంఖ్య: 27,444 గ్రౌండింగ్ అయిన కనెక్షన్లు: 16,480 -
వంటగ్యాస్.. ప్రైవేటు రూట్!
న్యూఢిల్లీ: వంటగ్యాస్ (ఎల్పీజీ) కూడా అతి త్వరలో ఓపెన్మారెక్ట్ (సబ్సిడీ రహిత) కానుందా..? కేంద్ర ప్రభుత్వ తీరును చూస్తే సామాన్యుడికి సైతం ఈ సందేహం రాకమానదు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రెట్టింపయ్యాయి. కానీ, సర్కారు సబ్సిడీ మాత్రం ఇదే కాలంలో రెండంకెల స్థాయికి దిగిపోయింది. వంటగ్యాస్‌పై ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని గణనీయంగా తగ్గించుకుందని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ప్రైవేటు సంస్థలైన గోగ్యాస్, ప్యూర్గ్యాస్, రిలయన్స్ గ్యాస్ తదితర కంపెనీలకు ఈ విభాగంలో ద్వారాలు తెరుచుకున్నట్టయింది. ఈ సంస్థలు ప్రధానంగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలకే ఇంతకాలం పరిమితం అయ్యాయి. ఎందుకంటే కేంద్ర సర్కారు ప్రభుత్వరంగ చమురు/గ్యాస్ కంపెనీలకే ఎల్పీజీ విక్రయాలపై సబ్సిడీలను పరిమితం చేసింది. అంటే ఈ సబ్సిడీయే ప్రైవేటు సంస్థలకు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిందని చెప్పుకోవాలి. కానీ, ఈ సబ్సిడీలకు కేంద్రం మంగళం పాడటం మొదలుపెట్టింది. ఇప్పటికీ సబ్సిడీ ఇస్తున్నా కానీ.. ఒక్కో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై ఇది రూ.40–50ను మించడం లేదు. వాస్తవానికి పెరుగుతున్న ధరలకు తగ్గట్టు కేంద్రం సబ్సిడీ కూడా పెరగాలి. కానీ, కేంద్ర సర్కారు తెలివిగా ఈ భారం మొత్తాన్ని క్రమంగా వినియోగదారుల నెత్తినే రుద్దే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పుకోవాలి. ఇదీ పరిస్థితి.. ప్రస్తుతానికి ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.884గా ఉంది. గత ప్రభుత్వాలు ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.500లోపే పరిమితం చేశాయి. కానీ, కేంద్రంలోని మోదీ సర్కారు.. డీజిల్, పెట్రోల్‌పై క్రమంగా సబ్సిడీని ఎత్తివేసిన తీరులోనే.. ఎల్పీజీ సబ్సిడీని గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇక ఇప్పుడు ఒక్కో సిలిండర్ (ఏడాదికి గరిష్టంగా ఒక వినియోదారుకు 12 సిలిండర్లకే సబ్సిడీ)కు ఇస్తున్న నామమాత్రపు రూ.40 సబ్సిడీని ఎత్తివేయడానికి ఎక్కువ సమయం పట్టేట్టు లేదు. ఓపెన్ మార్కెట్.. ప్రభుత్వ విధానం.. ప్రైవేటు సంస్థలకు వ్యాపార వరంగా మారనుంది. భారత్ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎల్పీజీ మార్కెట్లోకి దూకుడుగా వెళ్లే ప్రణాళికలతో ఉంది. ఈ సంస్థ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లో వంటగ్యాస్ కనెక్షన్ల విక్రయాలను చేపట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అతిపెద్ద రిఫైనరీ ఉండడంతో చుట్టుపక్కల ఉన్న ఈ రాష్ట్రాలకు సులభంగా సిలిండర్లను చేరవేయగలదు. అహ్మదాబాద్‌లో రిలయన్స్ గ్యాస్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 15 కిలోలు ధర ప్రస్తుతం రూ.1,200గా ఉంది. అంటే కిలో ధర రూ.80. ఏజిస్ లాజిస్టిక్స్‌కు చెందిన ప్యూర్గ్యాస్ ఒక్కో సిలిండర్‌ను రూ.1,300కు విక్రయిస్తోంది. అంటే కిలో ధర రూ.87. గోగ్యాస్ (కాన్ఫిడెన్స్ పెట్రోలియం) 15 కిలోల ఎల్పీజీ సిలిండర్‌కు రూ.1,200 వసూలు చేస్తోంది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) విక్రయిస్తున్న సిలిండర్ ధరలు రూ.900 స్థాయిలో ఉన్నాయి. మా సేవలు చూడండి.. వేగవంతమైన సేవలకు మాది పూచీ.. ఇది ప్రైవేటు సంస్థలు చెబుతున్న మాట. కనెక్షన్‌ను వెంటనే జారీ చేయడం.. సిలిండర్‌ను 48 గంటల్లోనే డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల నుంచి కనెక్షన్‌కు రోజుల నుంచి వారాలు కూడా పట్టే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంటోంది. ‘‘ఓఎంసీలు కనెక్షన్ ఇచ్చే ముందు ఎంతో పరిశీలన చేస్తాయి. సబ్సిడీ గణనీయంగా తగ్గిపోయినా కానీ వారి విధానం మారలేదు’’ అంటూ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ ఒకరు వాపోవడం గమనార్హం. పైగా గృహ వినియోగ గ్యాస్ వాణిజ్య అవసరాలకు మళ్లకుండా ఓంఎసీలు ప్రయతి్నస్తుంటాయి. గృహ ఎల్పీజీపై 5 శాతం జీఎస్టీ అమల్లో ఉంటే.. వాణిజ్య ఎల్పీజీపై ఇది 18%గా ఉండడం గమనార్హం. ప్రైవేటుకు బాటలు.. పెట్రోలియం శాఖ సమాంతర మార్కెటింగ్ వ్యవస్థ (పీఎంఎస్) కింద కల్పించిన సరళీకరణలు ప్రైవేటు సంస్థలకు అనుకూలించాయి. పీఎంఎస్ కింద ఎల్పీజీ దిగుమతి, నిల్వ, రవాణా, బాట్లింగ్, మార్కెటింగ్, పంపిణీ, విక్రయాలకు అవకాశాలు పెరిగాయనేది క్రిసిల్ అంచనా. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఎల్పీజీని ప్రభుత్వ ఓఎంసీలకే సరఫరా చేయాలన్న 2014 నాటి ఆదేశాలను పెట్రోలియం శాఖ పక్కన పెట్టేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతీ నెలా 10,000 టన్నుల ఎల్పీజీని ప్రైవేటు సంస్థలకు విక్రయించుకునేందుకు 2015లో అను మతించింది. దీంతో ప్రైవేటు సంస్థలు రిలయన్స్ నుంచి గ్యాస్‌ను కొనుక్కునే అవకాశం ఏర్పడింది. ఇదొక్కటీ మారితే.. ఓఎంసీ సంస్థలతో పోలిస్తే ఎల్పీజీ గ్యాస్ మార్కెట్లో రిలయన్స్ మినహా మిగిలిన సంస్థలకు అంత సానుకూలతలు ఇప్పటికైతే కనిపించడం లేదు. ఎందుకంటే అవి దేశీయ రిఫైనరీ సంస్థల నుంచి ఎల్పీజీని కొనుగోలు చేసుకోవడం లేదంటే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ‘ఓఎంసీలు విక్రయించే ఎల్పీజీని చమురు నుంచి ఉత్పత్తి చేస్తున్నాయి. దాంతో వాటిపై దిగుమతి సుంకం (5%) ఉండడం లేదు. ప్రైవే టు సంస్థలు రిఫైనరీలు లేకపోతే (ప్రైవేటులో రిలయన్స్‌కే రిఫైనరీలున్నాయి).. దిగుమతి చేసుకోవడం లేదంటే దేశీయ సంస్థల నుంచి కొనుగో లు చేసుకోవడం చేయాలి. దీంతో తయారీ వ్య యాలు పెరుగుతాయి. ఇది ధరలపై ప్రభా వం చూపిస్తోంది’ అని ఐవోసీ అధికారి చెప్పారు. -
భారత్‌కు ట్రంప్ వాణిజ్య దెబ్బ
వాషింగ్టన్: భారత్‌కు కల్పించిన ప్రాధాన్య వాణిజ్య హోదా(జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్–జీఎస్పీ)ని ఈ జూన్ 5వ తేదీ నుంచి రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాంతో ఈ హోదా కింద భారత్‌కు అమెరికా నుంచి అందుతున్న సుమారు రూ.39 వేల కోట్ల(560 కోట్ల డాలర్లు) విలువైన వాణిజ్య రాయితీలు రద్దవుతాయి. తన మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తులకు సమానమైన అవకాశం కల్పిస్తామని భారత్ హామీ ఇవ్వదని అమెరికా నిర్ధారణకు రావడంతో అమెరికా ఈ చర్య తీసుకుంది. వర్థమాన దేశాల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అమెరికా చాలా ఏళ్ల నుంచి ఈ జీఎస్పీ హోదా విధానాన్ని అమలు పరుస్తోంది. ఈ హోదా పొందిన దేశాల నుంచి అమెరికా ఎలాంటి సుంకాలు విధించకుండా వేలాది ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది.‘భారత్ తన మార్కెట్లలో అమెరికాకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పి స్తామని హామీ ఇవ్వదని నేను నిర్ధారణకొచ్చా. అందుకే భారత్‌కు కల్పించిన జీఎస్పీ హోదాను రద్దుచేస్తున్నాం’ అని ట్రంప్ అన్నారు. కాగా, తమకు జీఎస్పీ హోదాను రద్దు చేసినప్పటికీ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతానికి అమెరికాతో కలిసి పని చేస్తూనే ఉంటామని భారత్ పేర్కొంది. అమెరికా చర్యపై స్పందిస్తూ భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. జీఎస్పీ హోదా కింద భారత్ దాదాపు 2వేల ఉత్పత్తులను అమెరికాకు ఎలాంటి సుంకాలు చెల్లించకుండా ఎగుమతి చేసేది. ఈ హోదా కింద అమెరికా 2017లో 570 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ నుంచి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకుంది. హోదా పొందాలంటే అమెరికా కంపెనీలు, పౌరులకు అనుకూలంగా వచ్చే మధ్యవర్తిత్వ తీర్పులను గౌరవించడం, అంతర్జాతీయ గుర్తింపు పొందిన కార్మిక హక్కులను గౌరవించడం,మేథో హక్కులను పరిరక్షించడం, అమెరికా కంపెనీలకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పించడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. -
ఆ రోజులు... మాకొద్దు
బాబు పాలనపై జనం ఉలికిపాటు కరువు కరాళ నృత్యం సబ్సిడీల కోత.. చార్జీల వాత.. ఆపై ధరల మోత బతుకుదెరువు కోసం వలసబాట పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల నుంచి పదివేల కుటుంబాలకు పైగా వలస సాక్షి, మచిలీపట్నం : జాబు కావాలంటే బాబు రావాలి.. వ్యవసాయం బాగుండాలంటే బాబు రావాలి.. ఈ మాటలను టీడీపీ నేతలు చెప్పడానికి ఎలా ఉన్నా వింటున్న ప్రజలు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లు ఈ రాష్ట్రం చంద్రబాబు పాలనలో తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూసింది. సబ్సిడీల కోత, చార్జీల వాత, ధరల మోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఇది చాలదన్నట్టు బాబు ఏ ముహుర్తాన అధికారం చేపట్టారో గానీ వర్షాలు కురవక కరువు నెలకొంది. బాబు తొమ్మిదేళ్ల కాలంలో పల్లెలో ఒక పంట పండటం కూడా కష్టమైంది. తిండి గింజలు దొరక్క, వ్యవసాయం దెబ్బతిని కూలి పనలు లేక ప్రజలు అల్లాడిపోయారు. చివరకు పశువులకు ఎండి గడ్డి దొరకని దయనీయ స్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో చేసేది లేక ప్రజలు పిల్లలను బడి మాన్పించి వేల మంది వలస బాట పట్టారు. హైదరాబాద్, తెనాలి, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లి చిరువ్యాపారులు, రోజువారీ కూలీలుగా మారిపోయారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలకు చెందిన పదివేల కుటుంబాలకు పైగా వలస వెళ్లినట్టు సమాచారం. 1995 నుంచి 2004లోగా రాష్ట్రంలో దుర్బర పరిస్థితులు నెలకొంటే బాబు మాత్రం ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో మెలుగుతూ ప్రజలను ఆదుకోకపోగా సబ్సిడీల్లో కోత విధించారు. కరెంటు చార్జీలు, నిత్యావసర ధరలు భారీగా పెంచేశారు. వీటిని తగ్గించాలని ప్రజలు ఉద్యమించినా ఫలితం లేకపోవడంతో 2004 ఎన్నికల్లో బాబుకు గుణపాఠం నేర్పారు. 2004లో వైఎస్ సువర్ణయుగం ప్రారంభం కావడంతో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాయి. వలస వెళ్లిన కుటుంబాలు మళ్లీ ఊళ్లకు తిరిగొచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్లీ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఆల్ ఫ్రీ హామీలు ఇస్తున్నా జనం మాత్రం బాబోయ్ ఆ పాలన తమకొద్దు అంటూ ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. కుటుంబం మొత్తం వలసవెళ్లాం చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో అష్టకష్టాలు అనుభవించాం. ఉపాధి లేక పూటగడవడం కూడా కష్టంగా ఉండేది. పిల్లలను చదువు మాన్పించి కుటుంబం సహా హైదరాబాదుకు వలస పోయాం. మూడేళ్లు అక్కడే చిన్నాచితకా పనులు చేసుకుని జీవించాం. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక మా ప్రాంతంలో మళ్లీ పూర్వపు రోజులు రావడంతో తిరిగి గ్రామానికి వచ్చేశాం. - కమ్మిలి లక్ష్మి, గుడిదిబ్బ, కృత్తివెన్ను మండలం తిండికి అల్లాడాం ఆ తొమ్మిదేళ్లు జీవనోపాధి లేక, గ్రామంలో పనులు దొరక్క తిండికి సైతం అల్లాడాం. నా ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి రెండేళ్లు తెనాలిలో తాపీ పనులకు వెళ్లాం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన దగ్గర నుంచి మా గ్రామంలోనే ఉపాధి పుష్కలంగా దొరుకుతుండటంతో తిరిగి మళ్లీ గ్రామానికి వచ్చేశాం. ఆ మహానేతకు రుణపడి ఉన్నాం. - కె.కృపారాణి, కృత్తివెన్ను, కృత్తివెన్ను మండలం కన్నతల్లిలాంటి ఊరిని వదిలి వెళ్లాం కన్నతల్లి లాంటి ఊరును సైతం కన్నీళ్లతో వదిలి వెళ్లిపోయిన రోజులవి. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో పంటలు లేక పొలాలన్నీ బీడువారి ఉపాధి కరువైంది. నా పిల్లలు, భార్యతో కలిసి బతుకు తెరువు కోసం మూడేళ్లు విజయవాడకు వలసవెళ్లాం. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రావటంతో పల్లెలన్నీ సంతోషంతో కళకళలాడాయి. సొంత ఊరికి తిరిగి వచ్చేశాను. - పి.వెంకటరఘుపతిరావు, శీతనపల్లి, కృత్తివెన్ను మండలం