హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు భారీ షాక్ తగిలింది. ఫేమ్–2 సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత విధించడంతో గత నెలలో ఈ–టూ వీలర్ల అమ్మకాలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. 2023 జూన్‌లో దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్లవి కలిపి 45,734 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఇది 56.58 శాతం తగ్గుదల. 2022 జూన్‌లో భారత్‌లో 44,381 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే క్రితం ఏడాదితో పోలిస్తే గత నెల విక్రయాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. 40 శాతం ఉన్న ఫేమ్ సబ్సిడీ కాస్తా 2023 జూన్ 1 నుంచి 15 శాతానికి వచ్చి చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో తయారీ కంపెనీలు చాలామటుకు ద్విచక్ర వాహనాల ధరలను పెంచడం ప్రస్తుత పరిస్థితికి కారణం. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు అనే విషయంలో మే నెల, జూన్ అమ్మకాలు నిదర్శనంగా నిలిచాయి.
అత్యధికంగా మే నెలలో..
దేశంలో అత్యధికంగా 2023 మే నెలలో 1,05,338 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ వీలర్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. భారత్‌లో తొలిసారిగా ఈ–టూవీలర్లు ఒక లక్ష యూనిట్ల మార్కును దాటాయి. జూన్ నుంచి ఫేమ్ సబ్సిడీ తగ్గుతుందన్న వార్తల నేపథ్యం మే నెల అమ్మకాల జోరుకు కారణమైంది. ఈ ఏడాది మార్చితో పోలిస్తే 22.53 శాతం తగ్గి ఏప్రిల్‌లో 66,466 యూనిట్లు నమోదయ్యాయి. దేశంలో తొలుత 2022 ఆగస్ట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 50,000 యూనిట్ల మార్కును చేరుకున్నాయి. ఆ నెలలో మొత్తం 52,225 యూనిట్లు భారత రోడ్లపై పరుగెత్తాయి. అదే ఏడాది పండుగల సీజన్ అయిన అక్టోబర్‌లో ఈ సంఖ్య 77,250 యూనిట్లకు చేరింది. భారత్‌లో 135 కంపెనీలు ఈ–టూ వీలర్ల రంగంలో పోటీపడుతున్నాయి. జూన్ మాసంలో టాప్–8 కంపెనీల వాటా ఏకంగా 86.66 శాతం ఉంది. వీటిలో ఏడు కంపెనీలు తిరోగమన వృద్ధి సాధించడం గమనార్హం.
కంపెనీ మే జూన్ క్షీణత (శాతాల్లో)
ఓలా 28,629 17,552 38.7
టీవీఎస్ 20,397 7,791 61.8
ఏథర్ 15,407 4,540 70.5
బజాజ్ 9,965 2,966 70.2
ఓకినావా 2,907 2,616 10
Comments
Please login to add a commentAdd a comment