Two wheeler sales
-
పండుగలకు జోరుగా టూ వీలర్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: గ్రామీణ డిమాండ్ తిరిగి బలంగా పుంజుకోవడం, రుతుపవనాల పునరుద్ధరణ కారణంగా రాబోయే పండుగ సీజన్లో ద్విచక్ర వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కమ్యూటర్ బిజినెస్ హెడ్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూటర్లకు ఆదరణ పెరగడం ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని అన్నారు. మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమలో స్కూటర్ల విభాగం వాటా ప్రస్తుతం 32 శాతం ఉందని, ఇది మరింత వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీ కారణంగా స్కూటర్లు మెరుగైన మైలేజీ ఇవ్వడం కూడా కస్టమర్ల ఆసక్తికి కారణమైందని వివరించారు. అదనంగా స్థలం, సౌకర్యం, సౌలభ్యం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ రోడ్లు మెరుగవడం కూడా స్కూటర్ల వినియోగం పెరిగేందుకు దోహదం చేసిందని చెప్పారు. అటు కుటుంబ సభ్యులు సైతం సౌకర్యంగా నడపవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాల డిమాండ్.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో టూ వీలర్స్ పరిశ్రమలో 13 శాతం వృద్ధిని చూశామని అనిరుద్ధ హల్దార్ తెలిపారు. ‘ఇది ఇటీవలి సంవత్సరాలలో మనం చూసిన దానికంటే ఎక్కువ. ఈమధ్య గ్రామీణ ప్రాంతాల డిమాండ్ పట్టణ ప్రాంతాలను మించిపోవడం మరింత సంతోషకరమైన విషయం. గ్రామీణ డిమాండ్ పట్టణ డిమాండ్‌ను అధిగమించడం ప్రారంభించినప్పుడు ఇది మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమకు చాలా మంచి సంకేతం. పండుగల సీజన్లో మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమ ప్రస్తుత వృద్ధి రేటును అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. పరిశ్రమను మించిన వృద్ధిని టీవీఎస్ నమోదు చేస్తుందని నమ్మకంగా ఉంది’ అని హల్దార్ చెప్పారు. -
‘ఫేమ్’ లేని ఈ–టూవీలర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు భారీ షాక్ తగిలింది. ఫేమ్–2 సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత విధించడంతో గత నెలలో ఈ–టూ వీలర్ల అమ్మకాలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. 2023 జూన్‌లో దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్లవి కలిపి 45,734 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఇది 56.58 శాతం తగ్గుదల. 2022 జూన్‌లో భారత్‌లో 44,381 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే క్రితం ఏడాదితో పోలిస్తే గత నెల విక్రయాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. 40 శాతం ఉన్న ఫేమ్ సబ్సిడీ కాస్తా 2023 జూన్ 1 నుంచి 15 శాతానికి వచ్చి చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో తయారీ కంపెనీలు చాలామటుకు ద్విచక్ర వాహనాల ధరలను పెంచడం ప్రస్తుత పరిస్థితికి కారణం. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు అనే విషయంలో మే నెల, జూన్ అమ్మకాలు నిదర్శనంగా నిలిచాయి. అత్యధికంగా మే నెలలో.. దేశంలో అత్యధికంగా 2023 మే నెలలో 1,05,338 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ వీలర్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. భారత్‌లో తొలిసారిగా ఈ–టూవీలర్లు ఒక లక్ష యూనిట్ల మార్కును దాటాయి. జూన్ నుంచి ఫేమ్ సబ్సిడీ తగ్గుతుందన్న వార్తల నేపథ్యం మే నెల అమ్మకాల జోరుకు కారణమైంది. ఈ ఏడాది మార్చితో పోలిస్తే 22.53 శాతం తగ్గి ఏప్రిల్‌లో 66,466 యూనిట్లు నమోదయ్యాయి. దేశంలో తొలుత 2022 ఆగస్ట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 50,000 యూనిట్ల మార్కును చేరుకున్నాయి. ఆ నెలలో మొత్తం 52,225 యూనిట్లు భారత రోడ్లపై పరుగెత్తాయి. అదే ఏడాది పండుగల సీజన్ అయిన అక్టోబర్‌లో ఈ సంఖ్య 77,250 యూనిట్లకు చేరింది. భారత్‌లో 135 కంపెనీలు ఈ–టూ వీలర్ల రంగంలో పోటీపడుతున్నాయి. జూన్ మాసంలో టాప్–8 కంపెనీల వాటా ఏకంగా 86.66 శాతం ఉంది. వీటిలో ఏడు కంపెనీలు తిరోగమన వృద్ధి సాధించడం గమనార్హం. కంపెనీ మే జూన్ క్షీణత (శాతాల్లో) ఓలా 28,629 17,552 38.7 టీవీఎస్ 20,397 7,791 61.8 ఏథర్ 15,407 4,540 70.5 బజాజ్ 9,965 2,966 70.2 ఓకినావా 2,907 2,616 10 -
ఎనిమిదేళ్లలో 2.2 కోట్ల ఈ–టూవీలర్లు
ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు 2030 నాటికి భారత్‌లో 2.2 కోట్ల యూనిట్లకు చేరతాయని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. అందుబాటు ధరలో రవాణా సౌకర్యాలకు డిమాండ్, కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యం ఇందుకు కారణమని వివరించింది. ‘2022లో దేశంలో జరిగిన మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా కేవలం 3 శాతమే. అదే యూఎస్‌లో అయితే ఈవీల వాటా ఏకంగా 63 శాతం, చైనాలో 56 శాతం ఉంది. పెట్రోల్‌తో పోలిస్తే ఈవీలతో యాజమాన్య ఖర్చులు చాలా తక్కువ. అందుకే క్రమంగా కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. దిగుమతులను ఆసరాగా చేసుకుని చాలా బ్రాండ్లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. మార్కెట్ పరిపక్వత చెంది, నిబంధనలు కఠినతరం అయితే ఈ రంగం ఏకీకృతం (కన్సాలిడేట్) అవుతుంది’ అని తెలిపింది. ప్రయాణ ఖర్చు తక్కువ.. ‘కొత్త కొత్త బ్రాండ్ల చేరికతో మోడళ్లను ఎంపిక చేసుకోవడానికి కస్టమర్లకు అవకాశం ఉంటుంది. ఫీచర్లు, రోజువారీ వ్యయం, వాహన ధర ఆధారంగా ఈవీ కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ టూ వీలర్లతో పోలిస్తే ప్రయాణానికి అయ్యే ఖర్చు తక్కువ. ‘ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది’ అన్న వినియోగదార్ల ఆందోళన పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా ఉంది. ఈవీ అమ్మకాలు పెరిగేకొద్దీ సుదూర ప్రయాణాలకు బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతుంది. ప్రధానంగా వేగంగా చార్జింగ్ పూర్తి అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్ వసతులు ఉండాలి. ఈవీలు సింహ భాగం చేజిక్కించుకునే వరకు ఫేమ్, పీఎల్ఐ పథకాలు కొనసాగాలి’ అని నివేదిక వివరించింది. -
ఎలక్ట్రిక్ టూ–వీలర్ల లక్ష్యాలు మిస్..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలను అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. నిర్దేశించుకున్న 10 లక్షల యూనిట్ల కన్నా అమ్మకాలు 20 శాతం తక్కువగా నమోదు కావచ్చని పరిశ్రమ సమాఖ్య ఎస్ఎంఈవీ భావిస్తోంది. ప్రభుత్వం రూ. 1,100 కోట్ల సబ్సిడీని విడుదల చేయకుండా ఆపి ఉంచడమే ఇందుకు కారణమని పేర్కొంది. 2022 సంవత్సరం మొత్తం మీద ఎలక్ట్రిక్ టూ–వీలర్ల అమ్మకాలు 6 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. మూడు ప్రధాన ఎలక్ట్రిక్ టూవీలర్ల సంస్థలు (హీరో ఎలక్ట్రిక్, ఓలా, ఒకినావా) తొలిసారి 1 లక్ష వార్షిక విక్రయాల మైలురాయిని దాటాయి. ఈ మూడింటికి 50 శాతం పైగా మార్కెట్ వాటా ఉంది. 2022లో అమ్మకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ నీతి ఆయోగ్, ఇతరత్రా పరిశోధన ఏజెన్సీలు అంచనా వేసిన స్థాయిలో విక్రయాలు ఉండటం లేదని ఎస్ఎంఈవీ తెలిపింది. ’వాహన్’ పోర్టల్ గణాంకాల ప్రకారం గతేడాది నవంబర్‌లో 76,162 యూనిట్లు అమ్ముడు కాగా డిసెంబర్లో 28 శాతం తగ్గి 59,554 యూనిట్లకు పడిపోవడం ఒక హెచ్చరికగా కనిపిస్తోందని పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన తొలి తొమ్మిది నెలల్లో 5 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు, ఇదే తీరు కొనసాగితే పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు నీతి ఆయోగ్ అంచనా వేసిన 10 లక్షల యూనిట్లకు 20 శాతం దూరంలో ఆగిపోవచ్చని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ చెప్పారు. గత రెండు నెలలుగా అమ్మకాలు తగ్గుతుండటానికి పలు అంశాలు కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 1,100 కోట్ల పైచిలుకు సబ్సిడీని చాలా నెలలుగా విడుదల చేయకుండా ఆపి ఉంచడంతో పలు కంపెనీలకు (ఓఈఎం) నిర్వహణ మూలధనంపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని గిల్ చెప్పారు. దీన్ని సత్వరం పరిష్కరించకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 20 లక్షల యూనిట్ల అమ్మకాలపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు. ఓఈఎంలపై ఆరోపణలు .. దేశీయంగా విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ఫేమ్ ఇండియా ఫేజ్ 2 స్కీము కింద ఇస్తున్న సబ్సిడీలను కొన్ని తయారీ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణలను కేంద్రం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రెండు కంపెనీలను, వాటి మోడల్స్‌ను ఫేమ్ స్కీము నుంచి సస్పెండ్ చేసింది. నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తగు ఆధారాలు ఇచ్చే వరకూ వాటి పెండింగ్ క్లెయిముల ప్రాసెసింగ్‌ను ఆపివేసింది. బెన్లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ, ఒకాయా ఈవీ, జితేంద్ర న్యూ ఈవీ టెక్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (గతంలో యాంపియర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్), రివోల్ట్ ఇంటెలికార్ప్, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్, ఏవన్ సైకిల్స్, లోహియా ఆటో ఇండస్ట్రీస్, ఠుక్రాల్ ఎలక్ట్రిక్ బైక్స్, విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిలో ఉన్నాయి. -
జోరుగా పరుగెడుతున్న వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 15,21,490 యూనిట్లు నమోదైంది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 8.31 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6.51 శాతం వృద్ధితో 2,74,448 యూనిట్లకు చేరుకుంది. ద్విచక్ర వాహనాలు 8.52 శాతం దూసుకెళ్లి 10,74,266 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 83.14 శాతం ఎగసి 56,313 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 24.12 శాతం పెరిగి 67,158 యూనిట్లుగా ఉంది. 2019 ఆగస్ట్‌తో పోలిస్తే మొత్తం వాహన విక్రయాలు గత నెలలో 7 శాతం తగ్గాయి. ప్యాసింజర్ వెహికిల్స్ 41 శాతం, వాణిజ్య వాహనాలు 6 శాతం అధికం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు 16 శాతం, త్రిచక్ర వాహనాలు 1 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 7 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటికీ టూ వీలర్ దూరమే.. : ధరలు పెరిగిన కారణంగా ప్రారంభ స్థాయి కస్టమర్లకు ఇప్పటికీ టూ వీలర్ దూరమేనని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా వెల్లడించారు. ‘అస్థిర రుతుపవనాల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. వరదల వంటి పరిస్థితి కొనుగోళ్ల నుంచి వినియోగదారులను పరిమితం చేసింది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్‌లో ఎంట్రీ లెవెల్ మినహా ఇతర విభాగాలన్నీ బలమైన పనితీరు కనబరిచాయి. కొన్ని నెలలుగా ఫీచర్లతో కూడిన మోడల్స్ రాక ఇందుకు కారణం. సెమికండక్టర్ల లభ్యత క్రమంగా మెరుగవుతోంది. వాహనాల లభ్యత పెరిగింది. అయితే అధిక ఫీచర్లు కలిగిన మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో వేచి ఉండే కాలం పెరిగింది. ఈ దశాబ్దంలో అత్యధికంగా ఈ పండుగల సీజన్లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఉంటాయి. ధరలు స్థిరంగా ఉండి, ఆరోగ్యపరంగా ముప్పు లేకపోతే ద్విచక్ర వాహనాల జోరు ఉంటుంది’ అని అన్నారు. -
భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు
ముంబై: లాక్డౌన్ తరహా ఆంక్షల విధింపుతో ఏప్రిల్‌లో మోటార్ సైకిల్, స్కూటర్ విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. రెండో దశలో విజృంభిస్తున్న కరోనా కేసుల కట్టడికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్‌లో స్థానిక లాక్డౌన్లను విధించాయి. దీంతో వాహనాల ఉత్పత్తి నెమ్మదించింది. సరఫరా అవాంతరాలు నెలకొని అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దేశవ్యాప్త సంపూర్ణ లాక్డౌన్ విధింపుతో గతేడాది ఏప్రిల్‌లో వాహన కంపెనీలేవీ విక్రయాలు జరపలేదు. అందువల్ల నాటి అమ్మకాలతో ఈ ఏప్రిల్ విక్రయాలను పోల్చిచూడలేమని ద్విచక్ర వాహన కంపెనీలు చెప్పుకొచ్చాయి. కావున ఈ ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చిచూడగా.., టూ-వీలర్స్ మార్కెట్ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఏప్రిల్‌లో మొత్తం 3.72 లక్షల వాహనాలను విక్రయించింది. ఈ మార్చిలో అమ్మిన 5.76 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ. గత మార్చిలో 4.11 లక్షల వాహనాలకు విక్రయించిన హోండా మోటార్ సైకిల్ ఇండియా ఈ ఏప్రిల్‌లో 2.83 లక్షల యూనిట్లుకు పరిమితమైంది. అంటే మాస ప్రాతిపదికన 31 శాతం క్షీణత కనబరిచినట్లైంది. ఇదే ఏప్రిల్‌లో బజాజ్ ఆటో 1.34 లక్షల యూనిట్లను విక్రయించగా, మార్చిలో 3.88 లక్షల వాహనాలకు అమ్మింది. చదవండి: స్థానిక లాక్డౌన్లతో 70 లక్షలకు పైగా ఉద్యోగాల కోత -
టాప్‌గేర్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2020–21)చివరి నెల మార్చిలో మోటార్ సైకిల్, స్కూటర్ విక్రయాలు జోరుగా కొనసాగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2019–20) ఇదే మార్చిలో కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో విక్రయాలు గణనీయంగా పడిపోవడం(లో బేస్) 2021 మార్చిలో అమ్మకాల వృద్ధికి కలిసొచ్చింది. సమీక్షించిన మార్చి నెలలో హీరోమోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, రాయల్స్ ఎన్ఫీల్డ్ కంపెనీలు మొత్తం 14, 21,600 వాహనాలు విక్రయించాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం మార్చిలో విక్రయించిన మొత్తం 8,08,692 యూనిట్లతో పోలిస్తే ఇది 75% శాతం అధికం. టూ–వీలర్స్ మార్కెట్ దిగ్గజం హీరో మోటోకార్ప్ మార్చిలో మొత్తం 5.77 లక్షల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 3.35 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. హోండా మోటార్ సైకిల్ ఇండియా అమ్మకాలు 60.76 శాతం వృద్ధిని కనబరిచి 3.95 లక్షల వాహనాలను అమ్మింది. ‘‘వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడంతో ద్వి చక్ర వాహనాలకు డిమాండ్ పెరిగింది. అయితే విద్యా సంస్థల మూసివేత, ఇంటి వద్ద నుంచే పని తదితర అంశాలు విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి’’ అని ఆటో పరిశ్రమకు చెందిన ఒక నిపుణుడు తెలిపారు. -
కరోనా ఎఫెక్ట్ : సగానికి పడిపోయిన వాహన విక్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి, దేశవ్యాప్త లాక్డౌన్ అమలు అన్ని రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్థిక మందగమనంతో అసలే తక్కువగా ఉన్న ఆటోమొబైల్ సేల్స్ కరోనా ఎఫెక్ట్‌తో మరింత దిగజారాయి. మార్చిలో దేశీ ప్రయాణీకుల వాహన విక్రయాలు 51 శాతం పడిపోయాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (ఎస్ఐఏఎం) పేర్కొంది. గత ఏడాది ఇదే మాసంలో 2,91,861 యూనిట్లు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో కేవలం 1,43,014 యూనిట్ల విక్రయాలు సాగాయని ఎస్ఐఏఎం నివేదిక పేర్కొంది. కాగా ఫిబ్రవరిలో దేశీ వాహన విక్రయాలు 7.61 శాతం తగ్గుదల నమోదు చేశాయని గత నెలలో ఎస్ఐఏఎం వెల్లడించిన నివేదిక పేర్కొంది. భారత్‌లో పలు ఆటోమొబైల్ కంపెనీలు ముడిపదార్ధాల్లో పదిశాతంపైగా చైనా నుంచి తెప్పించుకుంటాయని ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని కేటగిరీల్లో వాహనాల ఉత్పత్తి తగ్గుతుందని ఎస్ఐఏఎం గత నెలలోనే పేర్కొంది. దేశంలో కోవిడ్-19 వ్యాప్తి భయాలు వెంటాడటంతో డిమాండ్ దెబ్బతిందని, వినియోగదారుల్లో సెంటిమెంట్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఎస్ఐఏఎం డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో దేశంలో ప్రయాణీకుల వాహన విక్రయాల్లో భారీ తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు. మార్చిలో వాణిజ్య వాహన విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. 2019 మార్చిలో 109022 కమర్షియల్ వాహనాలు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో 88 శాతం తగ్గి కేవలం 13,027 యూనిట్ల విక్రయాలు సాగాయి. మరోవైపు త్రిచక్ర వాహనాల విక్రయాలు మార్చిలో 59 శాతం పడిపోగా, బైక్ సేల్స్ 39.83 శాతం మేర తగ్గాయి. చదవండి : పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్ -
మైనర్‌కు బైక్ విక్రయం.. కుటుంబ సభ్యుల గొడవ
సనత్‌నగర్: ఓ మైనర్ బాలుడికి ద్విచక్ర వాహనం విక్రయించడం వివాదానికి దారితీసింది. దీంతో బేగంపేట్‌లోని ఓ షోరూం వద్ద బాలుడి బంధువులు, షోరూమ్ నిర్వాహకుల మధ్య గొడవ జరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే నాచారం అన్నపూర్ణ కాలనీకి చెందిన జంగయ్య కుమారుడు సాయి(17) తన సోదరుడితో కలిసి బేగంపేట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కేటీఎం మోటర్స్ షోరూంలో ఈ ఏడాది సెప్టెంబర్ 30న కేటీఎం బైక్ కొనుగోలు చేశాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా తన సోదరుడు నిఖిత్(19) పేరు మీద వాహనాన్ని తీసుకున్నాడు. పది రోజుల క్రితం బాలుడు బైక్ నడుపుతూ ఘట్కేసర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. ఈ విషయం బాలుడి కుటుంబ సభ్యులకు తెలియడంతో బైక్ ఎక్కడిదని ప్రశ్నించగా.. ఇంట్లో వారికీ చెప్పకుండా తానే వాహనాన్ని కొన్నట్టు చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి జంగయ్య, బాబాయి రవినాయక్ శనివారం బేగంపేటలోని కేటీఎం షోరూంకు వచ్చి బాలుడికి ద్విచక్ర వాహనాన్ని ఎలా విక్రయించారంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీనిపై 100 డయల్ నుంచి వచ్చిన సమాచారం మేరకు బేగంపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. షోరూం నిర్వాహకులు తమపై దాడి చేశారని బాలుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారే తమపై దాడి చేశారని షోరూం సిబ్బంది మరో ఫిర్యాదు చేశారు. అయితే, తాము బాలుడికి ద్విచక్ర వాహనం విక్రయించలేదని, అతని సోదరుడితో కలిసి వచ్చి కొనుగోలు చేసినట్లు షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సుజుకీ విక్రయాల్లో 6% వృద్ధి
హైదరాబాద్: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా కంపెనీ మార్చి నెల టూవీలర్ల అమ్మకాలు 6 శాతం వృద్ధిని సాధించాయి. గత ఏడాది మార్చిలో 30,594 టూవీలర్లను విక్రయించగా, ఈ ఏడాది మార్చిలో 32,431 టూవీలర్లను అమ్మామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా అమ్మకాల్లో నిలకడైన వృద్ధిని సాధిస్తున్నామని సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా పేర్కొన్నారు.