న్యూఢిల్లీ: గ్రామీణ డిమాండ్ తిరిగి బలంగా పుంజుకోవడం, రుతుపవనాల పునరుద్ధరణ కారణంగా రాబోయే పండుగ సీజన్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కమ్యూటర్ బిజినెస్ హెడ్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూటర్లకు ఆదరణ పెరగడం ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని అన్నారు.
మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమలో స్కూటర్ల విభాగం వాటా ప్రస్తుతం 32 శాతం ఉందని, ఇది మరింత వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీ కారణంగా స్కూటర్లు మెరుగైన మైలేజీ ఇవ్వడం కూడా కస్టమర్ల ఆసక్తికి కారణమైందని వివరించారు. అదనంగా స్థలం, సౌకర్యం, సౌలభ్యం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ రోడ్లు మెరుగవడం కూడా స్కూటర్ల వినియోగం పెరిగేందుకు దోహదం చేసిందని చెప్పారు. అటు కుటుంబ సభ్యులు సైతం సౌకర్యంగా నడపవచ్చని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల డిమాండ్..
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో టూ వీలర్స్ పరిశ్రమలో 13 శాతం వృద్ధిని చూశామని అనిరుద్ధ హల్దార్ తెలిపారు. ‘ఇది ఇటీవలి సంవత్సరాలలో మనం చూసిన దానికంటే ఎక్కువ. ఈమధ్య గ్రామీణ ప్రాంతాల డిమాండ్ పట్టణ ప్రాంతాలను మించిపోవడం మరింత సంతోషకరమైన విషయం. గ్రామీణ డిమాండ్ పట్టణ డిమాండ్‌ను అధిగమించడం ప్రారంభించినప్పుడు ఇది మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమకు చాలా మంచి సంకేతం. పండుగల సీజన్‌లో మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమ ప్రస్తుత వృద్ధి రేటును అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. పరిశ్రమను మించిన వృద్ధిని టీవీఎస్ నమోదు చేస్తుందని నమ్మకంగా ఉంది’ అని హల్దార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment