two wheeler industry
-
పండుగలకు జోరుగా టూ వీలర్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: గ్రామీణ డిమాండ్ తిరిగి బలంగా పుంజుకోవడం, రుతుపవనాల పునరుద్ధరణ కారణంగా రాబోయే పండుగ సీజన్లో ద్విచక్ర వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కమ్యూటర్ బిజినెస్ హెడ్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూటర్లకు ఆదరణ పెరగడం ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని అన్నారు. మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమలో స్కూటర్ల విభాగం వాటా ప్రస్తుతం 32 శాతం ఉందని, ఇది మరింత వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీ కారణంగా స్కూటర్లు మెరుగైన మైలేజీ ఇవ్వడం కూడా కస్టమర్ల ఆసక్తికి కారణమైందని వివరించారు. అదనంగా స్థలం, సౌకర్యం, సౌలభ్యం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ రోడ్లు మెరుగవడం కూడా స్కూటర్ల వినియోగం పెరిగేందుకు దోహదం చేసిందని చెప్పారు. అటు కుటుంబ సభ్యులు సైతం సౌకర్యంగా నడపవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాల డిమాండ్.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో టూ వీలర్స్ పరిశ్రమలో 13 శాతం వృద్ధిని చూశామని అనిరుద్ధ హల్దార్ తెలిపారు. ‘ఇది ఇటీవలి సంవత్సరాలలో మనం చూసిన దానికంటే ఎక్కువ. ఈమధ్య గ్రామీణ ప్రాంతాల డిమాండ్ పట్టణ ప్రాంతాలను మించిపోవడం మరింత సంతోషకరమైన విషయం. గ్రామీణ డిమాండ్ పట్టణ డిమాండ్‌ను అధిగమించడం ప్రారంభించినప్పుడు ఇది మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమకు చాలా మంచి సంకేతం. పండుగల సీజన్లో మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమ ప్రస్తుత వృద్ధి రేటును అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. పరిశ్రమను మించిన వృద్ధిని టీవీఎస్ నమోదు చేస్తుందని నమ్మకంగా ఉంది’ అని హల్దార్ చెప్పారు. -
వాహన తయారీకి తాత్కాలిక బ్రేక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన పరిశ్రమకూ కోవిడ్–19 దెబ్బ పడింది. తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు వైరస్ బారిన పడడం, లాక్డౌన్లతో షోరూంలు మూతపడడం ఈ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరతతో స్టీల్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాస్తా స్టీల్‌ను ముడి పదార్థంగా వాడే ఆటో విడిభాగాల తయారీ కంపెనీలకు సమస్యగా పరిణమించింది. ఏప్రిల్‌లో స్టీల్ వినియోగం 26 శాతం తగ్గిందంటే పరిస్థితికి అద్దంపడుతోంది. ఇంకేముంది వాహన తయారీ సంస్థలు తాత్కాలికంగా తయారీ ప్లాంట్లను మూసివేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు తయారీని తగ్గించివేస్తున్నాయి. మహారాష్ట్రలో గత నెల తొలి వారంలో లాక్డౌన్ ప్రకటించగానే వాహన పరిశ్రమపై ఒత్తిడి పెరిగింది. క్రమంగా ఇతర రాష్ట్రాలూ లాక్డౌన్లు విధించడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కష్టాలు చుట్టుముట్టాయి. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు తయారీ సంస్థలు తెలిపాయి. అయితే షట్‌డౌన్ కాలంలో వార్షిక నిర్వహణ చేపట్టనున్నట్టు కంపెనీలు వెల్లడించాయి. ఒకదాని వెంట ఒకటి.. వాహన తయారీ సంస్థలు ఒకదాని వెంట ఒకటి తాత్కాలికంగా ఉత్పత్తికి విరామం ప్రకటిస్తున్నాయి. మే 1 నుంచి 9 రోజులపాటు హరియాణాలో రెండు, గుజరాత్లో ఒక ప్లాంటును మూసివేస్తున్నట్టు భారత్‌లో ప్యాసింజర్ వెహికల్స్ రంగంలో అగ్రశ్రేణి సంస్థ మారుతి సుజుకీ గత నెల ప్రకటించింది. అయితే వైరస్ ఉధృతి నేపథ్యంలో మే 16 వరకు షట్‌డౌన్ పొడిగిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. వార్షిక నిర్వహణలో భాగంగా జూన్‌లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన తాత్కాలిక షట్‌డౌన్‌ను మే నెలకు మార్చినట్టు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. తెలంగాణలోని జహీరాబాద్‌తోపాటు చకన్, నాసిక్, కండివాలీ, హరిద్వార్‌లో సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి. ఎంజీ మోటార్స్ ఏప్రిల్ 29 నుంచి వారంపాటు గుజరాత్‌లోని హలోల్ ప్లాంటును తాత్కాలికంగా మూసివేసింది. మే 10 నుంచి ఆరు రోజులపాటు చెన్నై ప్లాంటులో తయారీని నిలిపివేస్తున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఏటా ఈ కేంద్రంలో 7.5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి 88 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. హోండా కార్స్ ఇండియా రాజస్తాన్ తయారీ కేంద్రాన్ని మే 7 నుంచి 18 వరకు తాత్కాలికంగా మూసివేసింది. ఏడాదికి ఈ ఫ్యాక్టరీలో 1.8 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. కర్ణాటకలోని రెండు ప్లాంట్లలో ఏప్రిల్ 26 నుంచి మే 14 వరకు మెయింటెనెన్స్ షట్‌డౌన్ చేపట్టనున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ వెల్లడించింది. ఉత్పత్తిని తగ్గించడంతోపాటు మే నెల కార్యకలాపాలను 7–15 రోజులకే పరిమితం చేయనున్నట్టు అశోక్ లేలాండ్ తెలిపింది. టూ వీలర్స్ రంగంలోనూ.. సెకండ్ వేవ్ ముంచుకొచ్చిన కారణంగా టూ వీలర్ షోరూంల వద్ద నిల్వలు పేరుకుపోయినట్టు సమాచారం. కంపెనీని బట్టి 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ద్విచక్ర వాహన తయారీ రంగంలో భారత్‌లో అగ్రశేణి సంస్థ హీరో మోటోకార్ప్ మే 16 వరకు తాత్కాలికంగా తయారీని నిలిపివేసింది. గత నెల చివరి నుంచి కంపెనీ తన ప్లాంట్లలో షట్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తోంది. వీటిలో చిత్తూరు ప్లాంటుతోపాటు హరియాణా, ఉత్తరాఖండ్, రాజస్తాన్, గుజరాత్‌లోని ఆరు కేంద్రాలు ఉన్నాయి. నీమ్రానాలోని గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌తోపాటు ఆర్అండ్డీ ఫెసిలిటీ తలుపులు మూసుకున్నాయి. కంపెనీకి 90 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రెండవ అతిపెద్ద సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ సైతం ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేసింది. హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, గుజరాత్ ప్లాంట్లలో మే 1 నుంచి మొదలైన షట్‌డౌన్ 15 వరకు కొనసాగనుంది. మే 15 నుంచి రెండు వారాలు తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ ప్లాంట్లలో తయారీకి తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నట్టు యమహా ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ మే 13–16 మధ్య చెన్నైలోని రెండు ప్లాంట్లలో కార్యకలాపాలు ఆపివేస్తున్నట్టు వెల్లడించింది. -
అదరగొడుతున్న పియాజియో స్కూటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ దిగ్గజం పియాజియో ఆటోఎక్స్‌పో 2020లో ద్విచక్రవాహనాల లాంచింగ్‌తో సందడి చేసింది. ఇటలీకి చెందిన పియాజియో తన ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ను ఆవిష్కరించింది. అలాగే వెస్పా ఎలెట్రికా అనే ఎలక్ట్రిక్ స్కూటీని కూడా ఈ సంస్థ ప్రదర్శించింది. కొత్త ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ -160 బారామతి ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసినట్టు కంపెనీ తెలిపింది. ఇది అక్టోబర్-డిసెంబర్, 2020లో మార్కెట్లోకి వస్తుందని అంచనా. రానున్న ఐదేళ్లలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్‌ను అనుసరించాలని కంపెనీ యోచిస్తోంది. స్థానిక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో వినూత్న ఎలక్ట్రిక్-మొబిలిటీ వాహనాలను లాంచ్ చేయనుంది. పియాజియో ఇండియా సీఎండీ డియెగో గ్రాఫి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను తీర్చగల కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం గర్వంగా ఉందన్నారు. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బైక్, 160 సీసీ, 125 సీసీ బీఎస్-6 ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది. ఎల్ఈడీ హెడ్, టైల్ లైట్స్, యుఎస్బి ఛార్జింగ్ ఉన్న స్ప్లిట్ గ్లోవ్ బాక్స్, డిజిటల్ క్లస్టర్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే క్రోమ్ గార్నిష్ ఎగ్జాస్ట్‌తో పాటు 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను జోడించింది. బ్లూ, వైట్, రెడ్, బ్లాక్ అనే నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా బుకింగ్‌లు ఆగస్టు 2020లో ప్రారంభమవుతాయి. చదవండి : మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా ఆటో ఎక్స్పో సందడి షురూ: కార్ల జిగేల్.. జిగేల్ -
రికవరీ బాటలో టూవీలర్ పరిశ్రమ
♦ 2018లో 8–10 శాతం వృద్ధి అంచనా ♦ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్, బీఎస్–3 వాహనాల నిషేధం వంటి వాటితో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న టూవీలర్ పరిశ్రమ రికవరీ బాటలో పయనిస్తోంది. ఇందులో 2018 ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం వృద్ధి నమోదుకావొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో అంచనా వేసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 2016, నవంబర్– 2017, మార్చి మధ్యకాలంలో టూవీలర్ పరిశ్రమలో 6.5 శాతం క్షీణత నమోదయ్యిందని పేర్కొంది. డీమోనిటైజేషన్ కారణంగా టూవీలర్ పరిశ్రమలోని మోటార్‌సైకిల్స్, స్కూటర్ల విభాగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా రాయ్ తెలిపారు. ‘డిమోనిటైజేషన్ ప్రభావం తగ్గింది. డిమాండ్ పుంజుకుంటోంది. 2018 ఆర్థిక సంవత్సరంలో దేశీ టూవీలర్ విక్రయాల్లో 8–10 శాతం వృద్ధి నమోదుకావొచ్చు’ అని వివరించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో టూవీలర్ విభాగంలో 7.3 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. సాధారణ రుతుపవన అంచనాలు, రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్, మంచి పంట దిగుబడి వంటి అంశాలు గ్రామీణ ప్రాంత డిమాండ్‌కు దోహదపడనున్నాయని తెలిపారు.