హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 15,21,490 యూనిట్లు నమోదైంది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 8.31 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6.51 శాతం వృద్ధితో 2,74,448 యూనిట్లకు చేరుకుంది. ద్విచక్ర వాహనాలు 8.52 శాతం దూసుకెళ్లి 10,74,266 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 83.14 శాతం ఎగసి 56,313 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 24.12 శాతం పెరిగి 67,158 యూనిట్లుగా ఉంది. 2019 ఆగస్ట్‌తో పోలిస్తే మొత్తం వాహన విక్రయాలు గత నెలలో 7 శాతం తగ్గాయి. ప్యాసింజర్ వెహికిల్స్ 41 శాతం, వాణిజ్య వాహనాలు 6 శాతం అధికం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు 16 శాతం, త్రిచక్ర వాహనాలు 1 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 7 శాతం తక్కువగా నమోదయ్యాయి.
ఇప్పటికీ టూ వీలర్ దూరమే.. : ధరలు పెరిగిన కారణంగా ప్రారంభ స్థాయి కస్టమర్లకు ఇప్పటికీ టూ వీలర్ దూరమేనని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా వెల్లడించారు. ‘అస్థిర రుతుపవనాల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. వరదల వంటి పరిస్థితి కొనుగోళ్ల నుంచి వినియోగదారులను పరిమితం చేసింది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్‌లో ఎంట్రీ లెవెల్ మినహా ఇతర విభాగాలన్నీ బలమైన పనితీరు కనబరిచాయి. కొన్ని నెలలుగా ఫీచర్లతో కూడిన మోడల్స్ రాక ఇందుకు కారణం. సెమికండక్టర్ల లభ్యత క్రమంగా మెరుగవుతోంది. వాహనాల లభ్యత పెరిగింది. అయితే అధిక ఫీచర్లు కలిగిన మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో వేచి ఉండే కాలం పెరిగింది. ఈ దశాబ్దంలో అత్యధికంగా ఈ పండుగల సీజన్లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఉంటాయి. ధరలు స్థిరంగా ఉండి, ఆరోగ్యపరంగా ముప్పు లేకపోతే ద్విచక్ర వాహనాల జోరు ఉంటుంది’ అని అన్నారు.
జోరుగా పరుగెడుతున్న వాహనాలు
Published Fri, Sep 9 2022 6:14 AM | Last Updated on Fri, Sep 9 2022 6:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment