ఎలక్ట్రిక్ వాహనాలకు మరో విడత కేంద్ర సర్కారు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)–3 పథకం కింద రూ.10,000 కోట్లను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి.
ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు, ప్రభుత్వం కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆరంభంలో రెండేళ్ల కాలానికి దీన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. ఫేమ్ –2 కింద 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇవ్వగా.. ఫేమ్–3లో ఇంతకంటే అధిక సంఖ్యలో బస్సులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు సమాచారం. ఫేమ్–2లో ఎలక్ట్రిక్ కార్లకు సైతం ప్రోత్సాహకాలు లభించగా.. ఫేమ్–3లో వీటి ప్రోత్సాహకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పథకం నుంచి కార్లను మినహాయించనున్నట్టు తెలుస్తోంది. ఫేమ్ –2 పథకం గడువు 2024 మార్చితో ముగిసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు విక్రయ ధరపై 15 శాతం సబ్సిడీ లభించడం గమనార్హం. ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్)ను తాత్కాలికంగా అమల్లోకి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి: అగ్రిటెక్ స్టార్టప్‌లకు బూస్ట్
ఈఎంపీఎస్
ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు ఈ ఏడాది జూలై వరకు ప్రోత్సాహకాల కింద రూ.500 కోట్లను కేంద్రం కేటాయించింది. ప్రతి ద్విచక్ర ఈవీపై రూ.10,000 చొప్పున సబ్సిడీ కేటాయించింది. కానీ ఫేమ్–2లో ఇది రూ.22,500గా ఉంది. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనంపై రూ.50,000 సబ్సిడీని ఈఎంపీఎస్ కింద ఇచ్చారు. ఫేమ్–2లో ఇది రూ.1,11,505గా ఉంది. కిలోవాట్ హవర్‌కు రూ.5,000 చొప్పున ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకు సబ్సిడీని కేంద్రం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment