ఈనెల 31తో ముగుస్తున్న ఫేమ్–2 పథకం స్థానంలో ఈ–మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్
విద్యుత్ వాహనాల కోసం రూ. 500 కోట్లతో కేంద్రం కొత్త పథకం
ఏప్రిల్ 1 నుంచి జూలై చివరి వరకూ కొనే వాహనాలకు వర్తింపు
టూ వీలర్లకు రూ. 25 వేలు, త్రీ వీలర్లకు రూ. 50 వేల వరకూ ప్రయోజనం.. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ఈవీ విధివిధానాలు
సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ)ను కొనాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్–2 పథకం ముగుస్తున్న తరుణంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయించింది. మార్చి 31తో ఫేమ్–2 పూర్తవగానే ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అమలులోకి వస్తుందని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం ఈ ఏడాది జూలై చివరి వరకూ అమలులో ఉండనుంది. దీని ప్రకారం కొత్తగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి టూ వీలర్లకు కిలోవాట్‌కు రూ. 10 వేలు చొప్పున గరిష్టంగా రూ. 25 వేలు, త్రీ వీలర్లకు రూ. 50 వేల వరకూ ప్రయోజనం చేకూరనుంది.
విద్యుత్ వాహనాల కోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్‌ఏఎంఈ) పథకాన్ని 2019లో తీసుకువచ్చింది. నిజానికి ఈవీలపై ప్రోత్సాహకాలను కేంద్రం తగ్గిస్తూ వస్తోంది. గతేడాది మే వరకూ 15 శాతం నుంచి 40 శాతం వరకూ సబ్సిడీ ఇచ్చేది. జూన్ తర్వాత వాహన ధరలో కేవలం 15 శాతం గానీ లేదా కిలోవాట్ హవర్ (కెడబ్ల్యూహెచ్)కు రూ. 10 వేలుగానీ ఏది తక్కువైతే అది మాత్రమే సబ్సిడీ ఇవ్వడం ప్రారంభించారు. రానున్న మూడేళ్లలో 1 మిలియన్ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోనున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని కూడా కేంద్రం తేల్చేసింది.
ఆదర్శంగా ఏపీ ‘ఈవీ’ ప్రోత్సాహం
మన రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించింది. అవి దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాలకు ఏపీ అందిస్తున్న తోడ్పాటు భేష్ అని ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రౌండప్ 2023 నివేదిక కొనియాడింది. 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకు తోడ్పాటునందిస్తున్న నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందని నివేదిక తెలిపింది.
2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాల్లో సగం విద్యుత్ వాహనాలే ఉండాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఏపీ చొరవను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సూచించాయి. ఈవీ ప్రమోషన్‌కు వివిధ విధానాల ద్వారా సహకరిస్తూ, ప్రోత్సాహకాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. కాగా ఏపీలో ప్రస్తుతం దాదాపు 65 వేల విద్యుత్ వాహనాలున్నాయి. భవిష్యత్తులో విద్యుత్ వాహనాల వినియోగం రాష్ట్రంలో భారీగా పెరగనుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అభిప్రాయపడింది.
2034 నాటికి దాదాపు 10.56 లక్షల వాహనాలు రాష్ట్ర రోడ్లపై తిరిగే అవకాశం ఉందని, వీటన్నిటి కోసం 677 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక (ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్)లో వెల్లడించింది. దీనికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో సుమారు 400 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తోంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలను కల్పిస్తోంది. లక్ష మంది ఉద్యోగులకు ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది.
Comments
Please login to add a commentAdd a comment