పెరుగుతున్న గ్యాస్ ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. గ్యాస్ రాయితీకి కేంద్రం మంగళం పాడటం..ఆచరణలో అమలు కావడంతో వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే రాయితీ రూ.200లు ఇస్తామని ప్రకటించగా మిగతా వంటగ్యాస్ వినియోగదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కూరగాయల ధరలు, పెట్రోలు ధరలు పెరగగా తాజాగా గ్యాస్ రాయితీకి రాంరాం చెప్పడం ఆందోళనకర పరిణామం. –కరీంనగర్ అర్బన్
లక్ష్యం చేరలే.. గుర్తించినోళ్లకు ఇవ్వలే
♦ జిల్లా జనాభా 10,29,078 కాగా 3,18,562 కుటుంబాలున్నాయి.
♦నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలని, కాలుష్యరహిత వాతావరణంకోసం ఉజ్వల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా లక్ష్యానికి ఆమడదూరంలో ఉండటం మన జిల్లాకే చెల్లు.
♦ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దన్నుగా నిలవాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా..ని కాగితాల్లోనే మూలుగుతోంది.
♦ఆర్భాటంగా దరఖాస్తులను స్వీకరించారే తప్పా అమలులో మాత్రం శీతకన్ను ప్రదర్శిస్తున్నారు.
♦ జిల్లాలో 16 మండలాలకు గానూ ఎక్కడా లక్ష్యాన్ని చేరకపోవడం ఆరోపణలకు తావిస్తోంది.
♦ ఉజ్వల్ పథకం ప్రారంభంలో జిల్లాకు 52,278 కనెక్షన్లు మంజూరు చేశారు. 27,444 మంది లబ్ధిదారులున్నారని గుర్తించగా 16,480 మందికి గ్యాస్ కనెక్షన్లు గ్రౌండింగ్ చేశారని సమాచారం.
♦ అయితే గుర్తించిన సంఖ్య ప్రకారం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
♦ ఒక్కో గ్యాస్ కనెక్షన్‌కు రూ.1650 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో 14.2 కిలోల సిలిండర్, డిపాజిట్, రెగ్యులేటర్, సురక్ష పైపు, పాస్‌పుస్తకం, నిర్వహణ ఛార్జీలు తదితర వాటికి చెల్లిస్తుంది.
♦ స్టవ్, మొదటి సిలిండర్ కొనుగోలు కొరకు వడ్డీలేని రుణాన్ని వివిధ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు లబ్ధిదారులకు ఇస్తాయి.
♦ దీన్ని మళ్లీ వినియోగదారులు గ్యాస్ వినియోగించే సమయంలో విడుదలయ్యే రాయితీ ఏడో సిలిండర్ నుంచి మినహాయించుకుంటాయి.
♦ రేషన్‌కార్డు ఉండి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలో గతంలో గ్యాస్ కనెక్షన్ పొందనివారు ఈ పథకానికి అర్హులు.
♦ కానీ జిల్లాలో కనెక్షన్ మంజూరు, గ్రౌండింగ్‌లో వెనుకబడి ఉండటంతో రాయితీకి దూరమవుతున్నారు.
క్రమేణా రాయితీ మాయం
♦ 2010 వరకు ఎలాంటి రాయితీ లేదు. ఆ తరువాత సిలిండర్ ధర రూ.340 నుంచి ఒక్కసారిగా రూ.425కి పెంచారు.
♦ దీంతో కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.85 రా యితీ ఇస్తున్నట్లు ప్రకటించి అమలు చేసింది.
♦ క్రమక్రమంగా గ్యాస్ ధర పెరిగినప్పుడల్లా స్టాండర్డ్ రేటును నిర్ణయించుకొని మిగతా సొమ్మును ప్రభుత్వం వినియోగదారులకు రాయితీ ఇస్తూ వస్తోంది.
♦ కోవిడ్ సమయంలో రెండేళ్ల కిందటి నుంచి వంట గ్యాస్‌పై ఇచ్చే రాయితీని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు.
♦ చివరికి ప్రభుత్వం ఒక్క ఉజ్వల పథకం సిలిండర్లకు మాత్రమే రూ.200 రాయితీ ఇస్తూ మిగతా అన్ని సిలిండర్లకు రాయితీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
వంట గ్యాస్ ప్రస్తుత ధర – రూ.1,075
వాణిజ్య సిలిండర్ ధర – రూ.2,464
ఉజ్వల కనెక్షన్‌దారుకు గ్యాస్ – రూ.1,075
రాయితీ – రూ.200
చెల్లించాల్సింది – రూ.875
ఉజ్వల కనెక్షన్ల పరిస్థితి గణాంకాల్లో
జిల్లాకు మంజూరైన
ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు: 52,278
గుర్తించిన లబ్ధిదారుల సంఖ్య: 27,444
గ్రౌండింగ్ అయిన కనెక్షన్లు: 16,480
Comments
Please login to add a commentAdd a comment