ఆ రోజులు... మాకొద్దు | Nature of those days ... | Sakshi
Sakshi News home page

ఆ రోజులు... మాకొద్దు

Published Mon, May 5 2014 2:33 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Nature of those days ...

  •   బాబు పాలనపై  జనం ఉలికిపాటు
  •   కరువు కరాళ నృత్యం
  •   సబ్సిడీల కోత.. చార్జీల వాత.. ఆపై ధరల మోత
  •   బతుకుదెరువు కోసం వలసబాట
  •   పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల నుంచి పదివేల కుటుంబాలకు పైగా వలస
  • సాక్షి, మచిలీపట్నం : జాబు కావాలంటే బాబు రావాలి.. వ్యవసాయం బాగుండాలంటే బాబు రావాలి.. ఈ మాటలను టీడీపీ నేతలు చెప్పడానికి ఎలా ఉన్నా వింటున్న ప్రజలు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లు ఈ రాష్ట్రం చంద్రబాబు పాలనలో తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూసింది. సబ్సిడీల కోత, చార్జీల వాత, ధరల మోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఇది చాలదన్నట్టు బాబు ఏ ముహుర్తాన అధికారం చేపట్టారో గానీ వర్షాలు కురవక కరువు నెలకొంది.
     
    బాబు తొమ్మిదేళ్ల కాలంలో పల్లెలో ఒక పంట పండటం కూడా కష్టమైంది. తిండి గింజలు దొరక్క, వ్యవసాయం దెబ్బతిని కూలి పనలు లేక ప్రజలు అల్లాడిపోయారు. చివరకు పశువులకు ఎండి గడ్డి దొరకని దయనీయ స్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో చేసేది లేక ప్రజలు పిల్లలను బడి మాన్పించి వేల మంది వలస బాట పట్టారు.
     
    హైదరాబాద్, తెనాలి, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లి చిరువ్యాపారులు, రోజువారీ కూలీలుగా మారిపోయారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలకు చెందిన పదివేల కుటుంబాలకు పైగా వలస వెళ్లినట్టు సమాచారం.
     
    1995 నుంచి 2004లోగా రాష్ట్రంలో దుర్బర పరిస్థితులు నెలకొంటే బాబు మాత్రం ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో మెలుగుతూ ప్రజలను ఆదుకోకపోగా సబ్సిడీల్లో కోత విధించారు. కరెంటు చార్జీలు, నిత్యావసర ధరలు భారీగా పెంచేశారు. వీటిని తగ్గించాలని ప్రజలు ఉద్యమించినా ఫలితం లేకపోవడంతో 2004 ఎన్నికల్లో బాబుకు గుణపాఠం నేర్పారు. 2004లో వైఎస్ సువర్ణయుగం ప్రారంభం కావడంతో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాయి. వలస వెళ్లిన కుటుంబాలు మళ్లీ ఊళ్లకు తిరిగొచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్లీ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఆల్ ఫ్రీ హామీలు ఇస్తున్నా  జనం మాత్రం బాబోయ్ ఆ పాలన తమకొద్దు అంటూ ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు.
     
     కుటుంబం మొత్తం వలసవెళ్లాం

     చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో అష్టకష్టాలు అనుభవించాం. ఉపాధి లేక పూటగడవడం కూడా కష్టంగా ఉండేది. పిల్లలను చదువు మాన్పించి కుటుంబం సహా హైదరాబాదుకు వలస పోయాం. మూడేళ్లు అక్కడే చిన్నాచితకా పనులు చేసుకుని జీవించాం. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక మా ప్రాంతంలో మళ్లీ పూర్వపు రోజులు రావడంతో తిరిగి గ్రామానికి వచ్చేశాం.
     - కమ్మిలి లక్ష్మి, గుడిదిబ్బ, కృత్తివెన్ను మండలం
     
     తిండికి అల్లాడాం
     ఆ తొమ్మిదేళ్లు జీవనోపాధి లేక, గ్రామంలో పనులు దొరక్క తిండికి సైతం అల్లాడాం. నా ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి రెండేళ్లు తెనాలిలో తాపీ పనులకు వెళ్లాం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన దగ్గర నుంచి మా గ్రామంలోనే ఉపాధి పుష్కలంగా దొరుకుతుండటంతో తిరిగి మళ్లీ గ్రామానికి వచ్చేశాం. ఆ మహానేతకు రుణపడి ఉన్నాం.
     - కె.కృపారాణి, కృత్తివెన్ను, కృత్తివెన్ను మండలం
     
     కన్నతల్లిలాంటి ఊరిని వదిలి వెళ్లాం
     కన్నతల్లి లాంటి ఊరును సైతం కన్నీళ్లతో వదిలి వెళ్లిపోయిన రోజులవి. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో పంటలు లేక పొలాలన్నీ బీడువారి ఉపాధి కరువైంది. నా పిల్లలు, భార్యతో కలిసి బతుకు తెరువు కోసం మూడేళ్లు విజయవాడకు వలసవెళ్లాం. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రావటంతో పల్లెలన్నీ సంతోషంతో కళకళలాడాయి. సొంత ఊరికి తిరిగి వచ్చేశాను.
     - పి.వెంకటరఘుపతిరావు, శీతనపల్లి, కృత్తివెన్ను మండలం
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement