దరిచేరని రైతుబంధు | raitubandhu | Sakshi
Sakshi News home page

దరిచేరని రైతుబంధు

Published Mon, Mar 2 2015 3:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

raitubandhu

 రైతులకు పెద్దపీట వేస్తాం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.. అంటూ ఊదరగొడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఆచరణలో మాత్రం చతికిలబడుతోంది. ఇందుకు నిదర్శనం రైతుబంధు పథకమే. జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో కేవలం ఆరు కమిటీల పరిధిలో మాత్రమే అమలు చేస్తున్నారు. వాటి పరిధిలో 54 గిడ్డంగులు ఉంటే.. కేవలం 14 గిడ్డంగులకే రైతుబంధు పరిమితమైంది. దీన్నిబట్టి ఈ పథకం అమలు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 నెల్లూరు(అగ్రికల్చర్): రైతులు పండించిన ధాన్యంపై రైతుబంధు పథకంలో రుణాలు ఇవ్వాలి. ఈ పథకం ఏళ్ల తరబడి కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో మిగతా మండలాల రైతులకు ఏమాత్రం లబ్ధి చేకూరడం లేదు. ఏఎంసీలకు గోదాములను సివిల్ సప్లయ్ శాఖ, గృహనిర్మాణ శాఖ, ఏపీ సీడ్స్, ప్రైవేటు వ్యక్తులు వినియోగించుకుంటుండడంతో రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
 
 దీంతో ధాన్యాన్ని నిల్వ చేసుకునే సౌకర్యం, గిట్టు బాటు ధర లేక అయినకాడికి పొలంలోనే అమ్ముకుంటున్నారు. ఈ పథకంలో రుణం మొత్తం పెంచినా, వివిధ ఆంక్షల కారణంగా రైతులకు మేలు జరగడం లేదు. జిల్లాలోని కోవూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, వాకాడు, ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో రైతుబంధు పథకం అమలు జరుగుతోంది. నెల్లూరు, గూడూరు, రాపూరు, ఉదయగిరి, వెంకటగిరి కమిటీల పరిధిలో అమలు కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. నెల్లూరుకు సమీపంలోని నరుకూరు రోడ్డులోని గోదాములు, ముత్తుకూరులోని గోదాములను సివిల్ సప్లయ్ శాఖకు, వెంకటాచలంలోని నాలుగు గిడ్డంగులను ఏపీ సీడ్స్‌కు కేటాయించారు. అల్లూరు, రాజుపాళెంలలోని ఏడు గోడౌన్‌లు ఉండగా నాలుగు సివిల్ సప్లయ్ శాఖకు అద్దెకు ఇచ్చారు. కావలి, కలిగిరిలోనూ ఆరు సివిల్ సప్లయ్‌కి, రెండు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. సూళ్లూరుపేటలో 2, నాయుడుపేటలో 1, ఆత్మకూరులో 1, ఉదయగిరిలో 1, వింజమూరులో 2, వెంకటగిరిలో 2 గోడౌన్లలో సివిల్ సప్లయ్ శాఖ బియ్యం నిల్వ చేసుకుంటుంది. ఉదయగిరిలోని రెండు గిడ్డంగులను గృహనిర్మాణ శాఖ సిమెంటు నిల్వ చేసుకునేందుకు కేటాయించారు. రైతుబంధు పథకం విస్తరించేందుకు గిడ్డంగులను ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
 
  రైతు బంధు పథకం ఉద్దేశం
 జిల్లాలో రైతులు పండించే పంట ఉత్పత్తులు గిట్టుబాటు ధర లేని సమయంలో గిడ్డంగుల్లో దాచుకోవచ్చు. ఆ ఉత్పత్తులపై మార్కెట్ కమిటీల ద్వారా రుణం తీసుకోవచ్చు. పంటకు గిట్టుబాటు ధర లభించే వరకు గోడౌన్‌లోనే భద్రపరుచుకోవచ్చు. ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు విక్రయించి, రుణం చెల్లించే సౌకర్యాన్ని రైతుబంధు పథకం ద్వారా వెసులుబాటు కల్పిస్తారు. రైతులు నిల్వ చేసుకున్న ధాన్య విలువలో 75 శాతం రుణం, గరిష్టంగా రూ.2 లక్షల వరకు పొందవచ్చు. ఈ రుణానికి 180 రోజుల వరకు వడ్డీ మినహాయింపు ఉంటుంది. 180-270 రోజులలోపు 12 శాతం వడ్డీ చెల్లించాలి. అయితే పథకం అమలులో ప్రభుత్వం విఫలమైంది.
 
 ఆంక్షల అవరోధం
 ధాన్యంపై గతంలో లక్ష వరకు రుణం తీసుకునే అవకాశం ఉండేది.  రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచింది. అదే రీతిలో ఆంక్షలు కూడా విధించింది. గిడ్డంగుల్లో ధాన్యం దాచుకోవాలంలే సన్నకారు రైతులై ఉండాలి.
 
  దాన్యంలో తేమ శాతం ఉండకూడదు
 దాచుకున్న ధాన్యంపై రుణాలు పొందాలంటే ఆయా గ్రామ రెవెన్యూ అధికారి జారీ చేసిన సర్టిఫికెట్ ఇవ్వాలి. దీంతో పాటు పట్టాదారు పాసుపుస్తకం నమోదు చేయాలి. వ్యవసాయ మార్కెట్ శాఖ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉంటేనే పథకానికి అర్హులు.జిల్లా వ్యాపితంగా 10 వేల మంది రైతుల మాత్రమే గుర్తింపుకార్డులను అందజేశారు.
 
 నోటీసులకే పరిమితమైన అధికారులు
 సాధారణంగా ధాన్యాన్ని నిల్వ చేసుకున్నరైతులు ఆరు నెలల్లో గోడౌన్ ఖాళీ చేయాలి. అలా చేయని పక్షంలో పత్రికా ప్రకటన ఇచ్చి ధాన్యాన్ని వేలం వేసి ఏఎంసీ బాకీ పోను మిగిలిన సొమ్మును ధాన్యం సొంతదారులకు జమ చేస్తుంది. అయితే ఏళ్లు గడుస్తున్నా గోడౌన్‌లు ఖాళీ చేయకుండా ఉన్న సివిల్ స్లయ్ శాఖ, ప్రైవేటు వ్యక్తులపై ఏఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నోటీసులకే పరిమితమయ్యారనే ఆరోపణలు సర్వత్రావినిపిస్తున్నాయి.
 
 అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
 రైతుబంధు పథకం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది రూ.6.35 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 373 మంది రైతులకు రూ.4.35 కోట్లు రుణాలుగా అందజేశాం. అధిక సంఖ్యలో గిడ్డంగులు సివిల్ సప్లయ్, ఏపీ సీడ్స్‌కు కేటాయించడంతో రైతులు ధాన్యం నిల్వ ఉంచుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. గోడౌన్‌లు ఖాళీ చేయాలని ఆయా శాఖలకు, ప్రైవేటు వ్యక్తులకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదు. ఈ విషయాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
 పి.అనితాకుమారి, సహాయ మార్కెటింగ్ జిల్లా సంచాలకులు(ఏడీఎం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement