హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫేమ్ సబ్సిడీ నిలిపివేతతో ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ కంపెనీలు కార్యకలాపాల పునరుద్ధరణ, కొనసాగడానికి రూ.3,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్‌ఎంఈవీ) ప్రభుత్వాన్ని కోరింది. సొసైటీ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి కంపెనీలకు రూ.1,200 కోట్లకుపైగా సబ్సిడీ బకాయిలు రావాల్సి ఉందని లేఖలో ప్రస్తావించింది.
18 నెలలుగా ఈ మొత్తాల కోసం పరిశ్రమ ఎదురు చూస్తోందని గుర్తుచేసింది. ఆర్థిక ఒత్తిడి నుండి కంపెనీలు చాలా వరకు బయటకు రాలేవని సొసైటీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ‘ఒకవేళ బకాయిలు చెల్లించిన తర్వాత వచ్చే ఒకట్రెండేళ్లు కంపెనీలు నిలదొక్కుకోవడానికి పునరావాస నిధి ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలి. సబ్సిడీ పథకం పతనం కారణంగా కార్యకలాపాలతోపాటు విక్రయాలు నిలిచిపోయాయి. కస్టమర్లు బుకింగ్స్‌ను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. డీలర్‌షిప్‌లపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది’ అని లేఖలో వెల్లడించారు.
పెట్టుబడులకు విముఖత
కోల్పోయిన పనిదినాలు, అవకాశాల నష్టం, మార్కెట్ వాటా క్షీణత, పరిశ్రమ ఇమేజ్ దెబ్బతినడం.. సమిష్టిగా ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయిక అంచనా ప్రకారం పరిశ్రమకు రూ.30,000 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని గిల్ తన లేఖలో ప్రస్తావించారు. ‘తయారీ సంస్థలకు వ్యతిరేకంగా తరచుగా జరుగుతున్న వ్యతిరేక చర్యల కారణంగా ఈ రంగంపై పెట్టుబడిదారులు తీవ్ర విముఖత చూపుతున్నారు. బ్యాంకులు కూడా నిజానికి రుణాన్ని విస్తరించడానికి ఇష్టపడడంలేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీలు రుణాలను తిరిగి చెల్లించలేనందున బ్యాంకులు అనుషంగిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. పునరావాస నిధి గ్రాంట్ లేదా రుణదాతలకు గ్యారెంటీ మెకానిజమ్‌గా పని చేసే
సబ్‌వెన్షన్ పథకం రూపంలో ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment