సాక్షి, కాకినాడ: ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు తీరంలో ఉన్న ఆయిల్, గ్యాస్ కంపెనీల భద్రతపై ఏపీ డీజీపీ ఠాకూర్ ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఆయన పోలీసులు అధికారులతో మాట్లాడారు. మరోవైపు ఏవీబీ బోర్డర్‌లో జరిగిన ఘటనలపై డీజీపీ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. ఇటీవల ఎన్నికల పోలింగ్‌లో జరిగిన ఘటనలు, కౌంటింగ్ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు సూచించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ భద్రతా కారణాలరిత్యా కొన్ని వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో గాడిమొగ రిలియన్స్ గ్యాస్ టెర్మినల్‌తోపాటుగా పలు చమురు క్షేత్రాల్లో ఆయన పర్యటించారు. ఘర్షణలపైనా సమీక్ష.. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలపై సమీక్షించామని తెలిపారు. కేసుల నమోదు, చార్జ్‌షీట్‌లపై యంత్రాంగానికి సూచనలు చేశామని, కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించామని తెలిపారు. గత ఎన్నికలకు ముందు ఒడిషాలోని నందాపూర్ మావోయిస్టు కమిటీ సభ్యులు విధ్వంసం సృష్టించేందుకు మన రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చారని, ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి వెళ్తుండగా భద్రతా బలగాలకు తారసపడడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని, ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment