ఈ కేలండర్ ఏడాది(2024)లో మీడియా, సిమెంట్, ఎయిర్‌లైన్స్ తదితర రంగాలలో భారీ కొనుగోళ్లు, విలీనాలు జరిగాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్– డిస్నీ ఇండియా (Reliance-Disney) డీల్‌తోపాటు.. ఎయిర్ ఇండియా (Air India Deal), విస్తారా విలీనం, అదార్ పూనావాలా– థర్మ ప్రొడక్షన్స్ డీల్, భారత్ సీరమ్స్‌ను సొంతం చేసుకున్న మ్యాన్‌కైండ్ ఫార్మా, అంబుజా సిమెంట్స్ చేతికి పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ తదితరాలు చేరాయి. వివరాలు ఇలా..
భారీ మీడియా సంస్థగా
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా సంస్థలు, గ్లోబల్ దిగ్గజం వాల్ట్ డిస్నీకి చెందిన దేశీ విభాగంతో రూ. 70,000 కోట్ల విలువైన విలీనానికి తెరతీశాయి. తద్వారా గ్లోబల్ మీడియా సంస్థ ఆవిర్భావానికి ఊపిరిపోశాయి. వెరసి 2024 నవంబర్ 14కల్లా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేశాయి. దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 16.34 శాతం, వయాకామ్18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు లభించాయి.
టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్
2022లో ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్న టాటా గ్రూప్ దిగ్గజం విస్తారాను విలీనం చేసుకుంది. 2024 అక్టోబర్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌తో చౌక టికెట్ ధరల ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేసిన తదుపరి విస్తారాతో ఎయిర్ ఇండియాను మరింత విస్తరించింది. వెరసి ప్రస్తుతం ఎయిర్ ఇండియా 5,600 వీక్లీ విమానాలతో 90కుపైగా ప్రాంతాలను కలుపుతూ సర్వీసులు అందిస్తోంది. విలీనంలో భాగంగా కొత్త సంస్థలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతం వాటాను పొందింది.
వ్యాక్సిన్ల సంస్థ మీడియావైపు
వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్‌కు చెందిన థర్మ ప్రొడక్షన్స్ అండ్ థర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై దృష్టి పెట్టారు. వెరసి పూనావాలా 50 శాతం వాటా దక్కించుకోగా.. కరణ్ జోహార్ వాటా 50 శాతంగా కొనసాగుతోంది. కరణ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
ఫార్మా చేతికి వ్యాక్సిన్లు
హెల్త్‌కేర్ రంగ లిస్టెడ్ కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్‌తో డీల్ కుదుర్చుకుంది. భారత్ సీరమ్స్‌ను రూ. 13,768 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా మహిళా ఆరోగ్య పరిరక్షణ, ఫెర్టిలిటీ ఔషధాలలోనూ కార్యకలాపాలు విస్తరించేందుకు మ్యాన్‌కైండ్ ఫార్మాకు తోడ్పాటునిచ్చింది.
సిమెంటింగ్ డీల్
డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ సంస్థకు చెందిన అంబుజా సిమెంట్స్ విస్తరణపై కన్నేసింది. దీనిలో భాగంగా పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను రూ. 10,422 కోట్లకు సొంతం చేసుకుంది. తద్వారా 2024 ఆగస్ట్ 16కల్లా పెన్నా సిమెంట్‌ను పూర్తి అనుబంధ కంపెనీగా మార్చుకుంది. మరోవైపు ఓరియంట్ సిమెంట్‌లో దాదాపు 47 శాతం వాటాను 45.1 కోట్ల డాలర్ల(రూ. 3,800 కోట్లు)కు కొనుగోలు చేసే బాటలో సాగుతోంది.
విస్తరణలో భాగంగా
దక్షిణాది మార్కెట్లో విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్.. ఇండియా సిమెంట్స్‌పై గురి పెట్టింది. తొలుత 23 శాతం వాటాను సొంతం చేసుకున్న అల్ట్రాటెక్ తదుపరి ప్రమోటర్ల నుంచి మరో 32.72 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు రూ. 4,000 కోట్లవరకూ వెచ్చించింది. దీంతో ఇండియా సిమెంట్స్‌లో వాటాను 55 శాతానికి చేర్చుకుంది. ఈ బాటలో తాజాగా ఓరియంట్ సిమెంట్‌లో 8.69 శాతం వాటాను రూ. 851 కోట్లకు చేజిక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment