Mergers
-
ప్రథమార్ధంలో డీల్స్ డౌన్
ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధంలో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ పరిమాణంపరంగా పెరిగినా విలువపరంగా మాత్రం 75 శాతం క్షీణించింది. 32.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ వ్యవధిలో డీల్స్ సంఖ్య 5.2 శాతం పెరిగి 1,400కి చేరింది. 1980లో ఎంఅండ్ఏ డీల్స్‌ను రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత ఇదే గరిష్ట స్థాయి. గతేడాది ఏప్రిల్‌లో హెచ్డీఎఫ్సీ ద్వయం 40 బిలియన్ డాలర్ల ఒప్పందం ప్రకటించగా.. ఈసారి కనీసం 5 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కూడా లేకపోవడం గమనార్హం. ఫైనాన్షియల్ మార్కెట్ల డేటా సంస్థ రెఫినిటివ్ నివేదిక ప్రకారం.. తొలి త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్ల లోపు ఒప్పందాలే ఎక్కువగా ఉండగా .. రెండో త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్ల డీల్స్ నాలుగు నమోదయ్యాయి. ఈక్విటీ విభాగంలో 2018 తర్వాత ఈసారి ప్రథమార్ధంలో ఐపీవో మార్కెట్లో సందడి నెలకొంది. 75 చిన్న, మధ్య తరహా సంస్థలు లిస్ట్ కాగా.. 1.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. లిస్టయిన సంస్థల సంఖ్య వార్షికంగా చూస్తే 25 శాతం పెరిగినా.. సమీకరించిన నిధుల పరిమాణం మాత్రం 73 శాతం తగ్గింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఫాలో ఆన్ ఆఫర్లు 127 శాతం పెరిగి 9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అదానీ గ్రూప్‌లో భాగమైన నాలుగు సంస్థల్లో 1.9 బిలియన్ డాలర్ల వాటాలు విక్రయించడం ఇందుకు ఊతమిచ్చింది. ► ఆర్థిక రంగంలో అత్యధికంగా 7.5 బిలియన్ డాలర్ల మేర ఒప్పందాలు కుదిరినప్పటికీ.. విలువపరంగా 89 శాతం తగ్గాయి. ఇండ్రస్టియల్స్ విభాగంలో 5.2 బిలియన్ డాలర్లు (11.6 శాతం డౌన్), హై టెక్నాలజీలో 5 బిలియన్ డాలర్ల (73.1 శాతం తగ్గుదల) ఒప్పందాలు కుదిరాయి. ► ప్రైవేట్ ఈక్విటీ దన్ను గల ఎంఅండ్ఏ డీల్స్ విలువ 8.2 బిలియన్ డాలర్లుగా (56 శాతం క్షీణత) నమోదైంది. ► ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు 10.3 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2021 తర్వాత ప్రథమార్ధంలో ఇంత అత్యధికంగా నిధులు రావడం ఇదే ప్రథమం. ► ప్రైమరీ బాండ్ల జారీ 66 శాతం పెరిగింది. ఇందులో ఫైనాన్షియల్ రంగం 81.3 శాతం, ఇండస్ట్రియల్స్ 7 శాతం మేర వాటా దక్కించుకున్నాయి. -
జోరుగా కార్పొరేట్ డీల్స్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా దేశీయంగా విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్ఏ).. ఇతరత్రా కార్పొరేట్ డీల్స్ మాత్రం గతేడాది భారీగానే జరిగాయి. కోవిడ్ పూర్వ స్థాయిని మించి 159 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,103 లావాదేవీలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే విలువపరంగా 29 శాతం పెరిగాయి. 2022 వార్షిక నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం డీల్స్‌లో ఎంఅండ్ఏ తరహా ఒప్పందాల వాటా అత్యధికంగా ఉంది. 20పైగా భారీ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 2021తో పోలిస్తే రెట్టింపై 107 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. అయితే, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీన డీల్ (సుమారు 60 బిలియన్ డాలర్లు)ను మినహాయిస్తే మాత్రం ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 2021తో పోలిస్తే 15 శాతం తగ్గిందని నివేదిక తెలిపింది. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులూ 2021తో పోలిస్తే 22 శాతం తగ్గి 52 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు పేర్కొంది. అయితే, అంతకన్నా ముందు మూడేళ్ల వ్యవధితో పోలిస్తే విలువ, పరిమాణంపరంగాను 20 శాతం ఎక్కువగానే నమోదైనట్లు వివరించింది. ఇన్వెస్టర్లు భారత్‌ను దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నారని, ప్రస్తుత మార్కెట్ మందగమనం కాస్త కష్టతరంగానే ఉన్నా చాలా మందికి పెద్దగా ఆందోళకరమైన అంశం కాకపోవచ్చని ఈ ధోరణుల ద్వారా తెలుస్తోందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ దినేష్ ఆరోరా తెలిపారు. ఆకర్షణీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ.. దేశీయంగా ఆర్థిక సేవలు, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇంధనం, విద్యుత్, ఇండస్ట్రియల్స్ మొదలైన విభాగాలు ఆకర్షణీయంగా ఉండగలవని నివేదిక పేర్కొంది. గతేడాది కంపెనీలు తమ స్థానాలను పటిష్టపర్చుకోవడం, పోటీని కట్టడి చేయడం, కొత్త వినూత్న విభాగాల్లోకి ప్రవేశించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. దీనితో బ్యాంకింగ్, సిమెంట్, విమానయాన రంగాల్లో కొన్ని భారీ డీల్స్ చోటు చేసుకున్నాయని నివేదిక వివరించింది. -
సహకార బ్యాంకింగ్ ‘విలీనాల్లో’ ముందడుగు
ముంబై: వివిధ షరతులకు లోబడి రాష్ట్ర సహకార బ్యాంకుతో (ఎస్టీసీబీ) జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) విలీనాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాదన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా రావాలన్నది ఈ షరతుల్లో ఒకటి. ఎస్టీసీబీ, డీసీసీబీల విలీనానికి ఉద్దేశించిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం, 2020 గత నెల (ఏప్రిల్) 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చే విధంగా నోటిఫై అయిన సంగతి తెలిసిందే. విలీన నేపథ్యం... సహకార బ్యాంకులు ప్రధానంగా మూడు అంచెల్లో పనిచేస్తాయి. ఇందులో గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. జిల్లా స్థాయిలో సహకార కేంద్ర బ్యాంక్ పనిచేస్తుంది (దీని తరఫున మండల కేంద్రాల్లో బ్రాంచీలు పనిచేస్తాయి) మూడవ స్థాయి రాష్ట్ర సహకార బ్యాంక్. రైతుకు వడ్డీ భారం తగ్గించాలన్న ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర స్థాయి సహకార బ్యాంకులో జిల్లా స్థాయి సహకార బ్యాంకుల విలీన నిర్ణయం జరిగింది. తద్వారా రెండంచెల సహకార బ్యాంక్ వ్యవస్థకు మార్గం సుగమం అయ్యింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం, 2020 ప్రకారం ఇందుకు రాష్ట్రాలు తప్పనిసరిగా ఆర్బీఐని సంప్రదించాలి. రెండంచెల సహకార వ్యవస్థకు (షార్ట్–టర్మ్ కో–ఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్) పలు రాష్ట్రాలు ఆర్బీఐని సంప్రదిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనల్లో ముఖ్యాంశాలు ► రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనను ఆర్బీఐ పరిశీలనలోకి తీసుకుని ‘న్యాయ, ద్రవ్యపరమైన అంశాలపై’ సమగ్ర అధ్యయనం అనంతరం ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ► అదనపు మూలధనం సమకూర్చడం, అవసరమైతే ద్రవ్య పరమైన మద్దతు, లాభదాయకతతో కూడిన వ్యాపార నమూనా, పాలనా పరమైన నమూనా వంటి అంశాలు విలీన అంశ పరిశీలనలో ప్రధానంగా ఉంటాయి. ► విలీన పథకానికి మెజారిటీ వాటాదారుల మద్దతు అవసరం. ► రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ (నాబార్డ్) కూడా పరిశీలించి, తగిన సిఫారసులు చేస్తుంది. నాబార్డ్‌తో తగిన సంప్రదింపుల అనంతరం ఆర్బీఐ ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. ► విలీనానికి సంబంధించి నికర విలువ ఆధారంగా షేర్ల మార్పిడి రేషియో విషయంలో కొన్ని డీసీసీబీ షేర్హోల్డర్లకు ఎటువంటి షేర్లనూ కేటాయించలేని పరిస్థితి ఉంటే, అటువంటి డీసీసీబీలకు ప్రభుత్వం తగిన మూలధనం సమకూర్చాలి. తద్వారా షేర్హోల్డర్లకు కనీసం ఒక షేర్ చొప్పున కేటాయింపు జరగాలి. -
వైద్య సేవల రంగంలో విలీనాల జోరు!
ముంబై: హాస్పిటల్ రంగంలో నియంత్రణల కారణంగా కంపెనీల పనితీరుపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ఈ రంగంలో కొనుగోళ్లు, విలీనాలు (ఎంఅండ్ఏ) మాత్రం జోరుగానే సాగుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో ఎంఅండ్ఏ డీల్స్ 155 శాతం పెరిగి రూ.7615 కోట్ల విలువ మేర నమోదయ్యాయి. ఐదేళ్ల కాలంలో ఈ రంగంలో ఎఅండ్‌ఏ లావాదేవీలు ఈ స్థాయిలో నమోదుకావటం ఇదే ప్రథమం. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీల విలువ రూ.2,991 కోట్లుగా ఉంది. రెండు పెద్ద డీల్స్ ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను రూ.4,000 కోట్లకు, మ్యాక్స్ హెల్త్‌కేర్‌ను రూ.2,351 కోట్లకు కొనుగోలు చేసే డీల్స్ 2018–19లో చోటు చేసుకున్నాయి. ఈ రెండింటిలోనూ మార్కెట్ ధర కంటే ప్రీమియానికే ఒప్పందాలు జరిగాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఒక్కో షేరును నాటి మార్కెట్ ధర రూ.144 కంటే అధికంగా రూ.170 ధరకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగింది. మ్యాక్స్ హెల్త్‌కేర్ మార్కెట్ విలువ రూ.2,170 కోట్లుగా ఉంటే, రూ.4,298 కోట్ల ఈక్విటీ విలువ లెక్క కట్టారు. దీని కింద మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం కూడా ఉంది. ఈ రంగం పనితీరు ఇటీవలి కాలంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ నాణ్యమైన హెల్త్‌కేర్ ఆస్తులు కావడంతో ప్రీమియం ధరను చెల్లించేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో వివరించింది. దేశ వైద్య సేవల రంగంలో 70 శాతం వాటా ప్రైవేటు రంగం చేతుల్లోనే ఉంది. రియల్ ఎస్టేట్‌పై ఖర్చు, ఎక్విప్మెంట్ వ్యయాలు తదితర రూపంలో ఎక్కువ పెట్టుబడులు అవసరం అవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరంతోపాటు వాటిపై రాబడులకు చాలా సమయం తీసుకునే ఈ రంగంలో స్థిరీకరణ అన్నది సంస్థలకు మెరుగైన ఆప్షన్ అవుతుందని ఇక్రా పేర్కొంది. -
ఇతర బ్యాంకుల విలీన యోచనేదీ లేదు
న్యూఢిల్లీ: ఇతర ప్రభుత్వ బ్యాంకుల కొనుగోలు, విలీనాల యోచనేదీ లేదని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ సునీల్ మెహతా స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్యాంకు అంతర్గత కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకోవడం, ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం అధ్యాయం ఇక ముగియడంతో.. వృద్ధి, మొండిబాకీల రికవరీపై మరింతగా దృష్టి సారిస్తున్నట్లు మెహతా చెప్పారు. బ్యాంకు వృద్ధి ప్రణాళికల కోసం రూ. 5,431 కోట్ల అదనపు మూలధనం సమకూరుస్తున్నట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం వెల్లడించిన సంగతి ఆయన గుర్తు చేశారు. ఇతరత్రా మరేవైనా ప్రభుత్వ రంగ బ్యాంకులను కొనుగోలు చేసే ప్రతిపాదనేదైనా ఉందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. తమ బ్యాంకుకైతే అలాంటి యోచనేదీ లేదని వివరించారు. ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేస్తూ కేంద్రం గత నెలలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూడు బ్యాంకుల విలీనానంతరం ఏర్పడే కొత్త బ్యాంకు దాదాపు రూ. 14.5 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా ప్రభుత్వ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకు కానుంది. -
ఆర్‌కామ్–ఎయిర్‌సెల్ విలీన ఒప్పందం రద్దు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ఆర్‌కామ్–ఎయిర్‌సెల్ విలీనం కథ కంచికి చేరింది. విలీన ఒప్పందం కాలం చెల్లినట్టు రెండు కంపెనీలు ప్రకటించాయి. ‘‘ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ మొబైల్ వ్యాపారం విలీన ప్రతిపాదన పరస్పర ఆమోదం పొందడంలో విఫలం చెందింది’’ అని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ప్రకటనలో తెలిపింది. విలీనం విషయమై గతేడాది సెప్టెంబర్‌లో ఈ రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. న్యాయ, నియంత్రణపరమైన అనిశ్చిత పరిస్థితులు, స్వార్థపూరిత శక్తుల జోక్యంతో ఒప్పందానికి ఆమోదం పొందడంలో జాప్యానికి కారణమయ్యిందని ఆర్‌కామ్ ఆరోపించింది. టెలికం రంగంలో విపరీతమైన పోటీకితోడు విధానపరమైన నూతన చర్యలతో ఈ రంగానికి రుణాల లభ్యతపై తీవ్ర ప్రభావం పడినట్టు పేర్కొంది. ఇలా ఎన్నో అంశాల కారణంగా విలీన ఒప్పందం గడువు తీరిపోయినట్టు వివరించింది. వాస్తవానికి ఈ విలీనం ద్వారా రూ.45,000 కోట్ల రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఆర్‌కామ్ భావించింది. విలీనం సాకారం కాకపోవడంతో ఆదివారం సమావేశమైన ఆర్‌కామ్ బోర్డు రుణాలు తీర్చివేసేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించింది. -
మిగిలేవి పదో.. పన్నెండో!
♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరిన్ని విలీనాలు ♦ 3–4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దే ప్రయత్నాలు ♦ ఆంధ్రా బ్యాంకు స్వతంత్రంగానే కొనసాగే అవకాశాలు న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ద్వారా మొత్తం మీద 3–4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) 21 ఉండగా.. విలీనాలతో ఈ సంఖ్య 10–12కి తగ్గనుంది. ఎస్బీఐ స్థాయిలో మరో 3–4 బ్యాంకులను తయారు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి పెట్టే ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుతో పాటు మరికొన్ని మధ్యస్థాయి బ్యాంకులు స్వతంత్రంగానే కొనసాగే అవకాశముందని వివరించాయి. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనంతో ఊపు మీద ఉన్న కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మొండి బకాయిలు అదుపులోకి వస్తే మరో విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాలని యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సాలిడేషన్‌పై మరింతగా కసరత్తు జరుగుతోందంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అటు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సైతం వ్యవస్థలో కొన్ని పెద్ద బ్యాంకులు, కొన్ని చిన్నవి, ఇంకొన్ని స్థానిక బ్యాంకులు మొదలైనవి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్బీహెచ్ సహా అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును ఈ ఏడాది ఏప్రిల్ 1న విలీనం చేశారు. దీంతో ఎస్బీఐ ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల జాబితాలో చేరింది. ఈ విలీనంతో ఎస్బీఐ ఖాతాదారుల సంఖ్య 37 కోట్లకు, శాఖలు 24,000కు, ఏటీఎంల సంఖ్య 59,000కు చేరింది. పీఎన్బీ తదితర బ్యాంకుల్లో విలీనం: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) వంటి పెద్ద పీఎస్బీల్లో కొన్ని చిన్న బ్యాంకులను విలీనం చేసేందుకు ఆస్కారముందని మరో అధికారి తెలిపారు. ప్రాంతీయంగా సమతుల్యత, భౌగోళికంగా విస్తరణ, ఆర్థిక భారం, సులభతరమైన మానవ వనరుల బదలాయింపు ప్రక్రియ మొదలైన అంశాలన్నీ విలీనాలపై తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరీ బలహీనమైన బ్యాంకును పటిష్టమైన బ్యాంకులో విలీనం చేస్తే పెద్ద బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి.. అటువంటి ప్రతిపాదనలేమీ ఉండబోవని సంబంధిత అధికారి పేర్కొన్నారు. -
బ్యాంకుల్లో మరిన్ని విలీనాలు!
♦ ఎస్బీఐ బాటలో మరిన్ని బ్యాంకులు ♦ చిన్న బ్యాంకులను సొంతం చేసుకోనున్న పీఎన్బీ, బీవోబీ ♦ ఈ దిశగా కేంద్ర సర్కారు కసరత్తు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రక్షాళణలో భాగంగా తదుపరి విలీనాలపై కసరత్తు జరుగుతోంది. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే దిశగా నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం అనంతరం మరోసారి ఈ రంగంలో స్థిరీకరణపై కేంద్ర సర్కారు దృష్టి సారించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లు చిన్న బ్యాంకులను విలీనం చేసుకోవచ్చని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. ప్రభుత్వం విలీనం చేయాల్సిన బ్యాంకులపై దృష్టి పెట్టిందని... పలు చిన్న బ్యాంకులకంటే కొన్ని పెద్ద బ్యాంకులు ఉండాలన్నది ప్రధానమంత్రి కార్యాలయం యోచన అని ఆ వర్గాలు వెల్లడించాయి. పరిశీలనలో ఇవే... ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనల ప్రకారం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు పీఎన్బీలో విలీనమయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా బీవోబీ దక్షిణాదిన ప్రముఖ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును తనలో కలిపేసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు పలు ప్రతిపాదనలపై చర్చించినట్టు సంబంధిత వర్గాల తెలిపాయి. అయితే, ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయని, వీటిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారానికి ఆర్బీఐతో కలసి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో తాజా విలీనాల అంశం తెర ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్బీఐ గత వారం తీసుకొచ్చిన కఠిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నియంత్రణ పరమైన నిబంధనావళిని బ్యాంకులు చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్థిరీకరణకు దిశగా అడుగులు వేయక తప్పదు. కాగా, విలీనం విషయంలో చట్టపరంగా నడుచుకుంటామని, విలీనానికి ముందు బ్యాంకులకు అవకాశం ఇవ్వనున్నట్టు, అవసరమైతే కాంపిటీషన్ కమిషన్ అనుమతులు తీసుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రక్షాళనతోపాటు వాటిబలోపేతానికి గాను ఇంద్ర ధనుష్ కార్యక్రమాన్ని ప్రభుత్వం 2015లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.