న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ఆర్‌కామ్–ఎయిర్‌సెల్ విలీనం కథ కంచికి చేరింది. విలీన ఒప్పందం కాలం చెల్లినట్టు రెండు కంపెనీలు ప్రకటించాయి. ‘‘ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ మొబైల్ వ్యాపారం విలీన ప్రతిపాదన పరస్పర ఆమోదం పొందడంలో విఫలం చెందింది’’ అని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ప్రకటనలో తెలిపింది. విలీనం విషయమై గతేడాది సెప్టెంబర్‌లో ఈ రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.
న్యాయ, నియంత్రణపరమైన అనిశ్చిత పరిస్థితులు, స్వార్థపూరిత శక్తుల జోక్యంతో ఒప్పందానికి ఆమోదం పొందడంలో జాప్యానికి కారణమయ్యిందని ఆర్‌కామ్ ఆరోపించింది. టెలికం రంగంలో విపరీతమైన పోటీకితోడు విధానపరమైన నూతన చర్యలతో ఈ రంగానికి రుణాల లభ్యతపై తీవ్ర ప్రభావం పడినట్టు పేర్కొంది. ఇలా ఎన్నో అంశాల కారణంగా విలీన ఒప్పందం గడువు తీరిపోయినట్టు వివరించింది. వాస్తవానికి ఈ విలీనం ద్వారా రూ.45,000 కోట్ల రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఆర్‌కామ్ భావించింది. విలీనం సాకారం కాకపోవడంతో ఆదివారం సమావేశమైన ఆర్‌కామ్ బోర్డు రుణాలు తీర్చివేసేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించింది.