ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధంలో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఏ) డీల్స్ పరిమాణంపరంగా పెరిగినా విలువపరంగా మాత్రం 75 శాతం క్షీణించింది. 32.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ వ్యవధిలో డీల్స్ సంఖ్య 5.2 శాతం పెరిగి 1,400కి చేరింది. 1980లో ఎంఅండ్‌ఏ డీల్స్‌ను రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత ఇదే గరిష్ట స్థాయి. గతేడాది ఏప్రిల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం 40 బిలియన్ డాలర్ల ఒప్పందం ప్రకటించగా.. ఈసారి కనీసం 5 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కూడా లేకపోవడం గమనార్హం.
ఫైనాన్షియల్ మార్కెట్ల డేటా సంస్థ రెఫినిటివ్ నివేదిక ప్రకారం.. తొలి త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్ల లోపు ఒప్పందాలే ఎక్కువగా ఉండగా .. రెండో త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్ల డీల్స్ నాలుగు నమోదయ్యాయి. ఈక్విటీ విభాగంలో 2018 తర్వాత ఈసారి ప్రథమార్ధంలో ఐపీవో మార్కెట్లో సందడి నెలకొంది. 75 చిన్న, మధ్య తరహా సంస్థలు లిస్ట్ కాగా.. 1.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. లిస్టయిన సంస్థల సంఖ్య వార్షికంగా చూస్తే 25 శాతం పెరిగినా.. సమీకరించిన నిధుల పరిమాణం మాత్రం 73 శాతం తగ్గింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
► ఫాలో ఆన్ ఆఫర్లు 127 శాతం పెరిగి 9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అదానీ గ్రూప్‌లో భాగమైన నాలుగు సంస్థల్లో 1.9 బిలియన్ డాలర్ల వాటాలు విక్రయించడం ఇందుకు ఊతమిచ్చింది.
► ఆర్థిక రంగంలో అత్యధికంగా 7.5 బిలియన్ డాలర్ల మేర ఒప్పందాలు కుదిరినప్పటికీ.. విలువపరంగా 89 శాతం తగ్గాయి. ఇండ్రస్టియల్స్ విభాగంలో 5.2 బిలియన్ డాలర్లు (11.6 శాతం డౌన్), హై టెక్నాలజీలో 5 బిలియన్ డాలర్ల (73.1 శాతం తగ్గుదల) ఒప్పందాలు కుదిరాయి.
► ప్రైవేట్ ఈక్విటీ దన్ను గల ఎంఅండ్‌ఏ డీల్స్ విలువ 8.2 బిలియన్ డాలర్లుగా (56 శాతం క్షీణత) నమోదైంది.
► ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు 10.3 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2021 తర్వాత ప్రథమార్ధంలో ఇంత అత్యధికంగా నిధులు రావడం ఇదే ప్రథమం.
► ప్రైమరీ బాండ్ల జారీ 66 శాతం పెరిగింది. ఇందులో ఫైనాన్షియల్ రంగం 81.3 శాతం, ఇండస్ట్రియల్స్ 7 శాతం మేర వాటా దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment