ముంబై: హాస్పిటల్ రంగంలో నియంత్రణల కారణంగా కంపెనీల పనితీరుపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ఈ రంగంలో కొనుగోళ్లు, విలీనాలు (ఎంఅండ్‌ఏ) మాత్రం జోరుగానే సాగుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో ఎంఅండ్‌ఏ డీల్స్ 155 శాతం పెరిగి రూ.7615 కోట్ల విలువ మేర నమోదయ్యాయి. ఐదేళ్ల కాలంలో ఈ రంగంలో ఎఅండ్‌ఏ లావాదేవీలు ఈ స్థాయిలో నమోదుకావటం ఇదే ప్రథమం. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీల విలువ రూ.2,991 కోట్లుగా ఉంది.
రెండు పెద్ద డీల్స్
ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను రూ.4,000 కోట్లకు, మ్యాక్స్ హెల్త్‌కేర్‌ను రూ.2,351 కోట్లకు కొనుగోలు చేసే డీల్స్ 2018–19లో చోటు చేసుకున్నాయి. ఈ రెండింటిలోనూ మార్కెట్ ధర కంటే ప్రీమియానికే ఒప్పందాలు జరిగాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఒక్కో షేరును నాటి మార్కెట్ ధర రూ.144 కంటే అధికంగా రూ.170 ధరకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగింది. మ్యాక్స్ హెల్త్‌కేర్ మార్కెట్ విలువ రూ.2,170 కోట్లుగా ఉంటే, రూ.4,298 కోట్ల ఈక్విటీ విలువ లెక్క కట్టారు. దీని కింద మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం కూడా ఉంది. ఈ రంగం పనితీరు ఇటీవలి కాలంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ నాణ్యమైన హెల్త్‌కేర్ ఆస్తులు కావడంతో ప్రీమియం ధరను చెల్లించేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో వివరించింది. దేశ వైద్య సేవల రంగంలో 70 శాతం వాటా ప్రైవేటు రంగం చేతుల్లోనే ఉంది. రియల్ ఎస్టేట్‌పై ఖర్చు, ఎక్విప్‌మెంట్ వ్యయాలు తదితర రూపంలో ఎక్కువ పెట్టుబడులు అవసరం అవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరంతోపాటు వాటిపై రాబడులకు చాలా సమయం తీసుకునే ఈ రంగంలో స్థిరీకరణ అన్నది సంస్థలకు మెరుగైన ఆప్షన్ అవుతుందని ఇక్రా పేర్కొంది.
వైద్య సేవల రంగంలో విలీనాల జోరు!
Published Tue, May 7 2019 1:11 AM | Last Updated on Tue, May 7 2019 1:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment