regulation places
-
వైద్య సేవల రంగంలో విలీనాల జోరు!
ముంబై: హాస్పిటల్ రంగంలో నియంత్రణల కారణంగా కంపెనీల పనితీరుపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ఈ రంగంలో కొనుగోళ్లు, విలీనాలు (ఎంఅండ్ఏ) మాత్రం జోరుగానే సాగుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో ఎంఅండ్ఏ డీల్స్ 155 శాతం పెరిగి రూ.7615 కోట్ల విలువ మేర నమోదయ్యాయి. ఐదేళ్ల కాలంలో ఈ రంగంలో ఎఅండ్‌ఏ లావాదేవీలు ఈ స్థాయిలో నమోదుకావటం ఇదే ప్రథమం. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీల విలువ రూ.2,991 కోట్లుగా ఉంది. రెండు పెద్ద డీల్స్ ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను రూ.4,000 కోట్లకు, మ్యాక్స్ హెల్త్‌కేర్‌ను రూ.2,351 కోట్లకు కొనుగోలు చేసే డీల్స్ 2018–19లో చోటు చేసుకున్నాయి. ఈ రెండింటిలోనూ మార్కెట్ ధర కంటే ప్రీమియానికే ఒప్పందాలు జరిగాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఒక్కో షేరును నాటి మార్కెట్ ధర రూ.144 కంటే అధికంగా రూ.170 ధరకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగింది. మ్యాక్స్ హెల్త్‌కేర్ మార్కెట్ విలువ రూ.2,170 కోట్లుగా ఉంటే, రూ.4,298 కోట్ల ఈక్విటీ విలువ లెక్క కట్టారు. దీని కింద మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం కూడా ఉంది. ఈ రంగం పనితీరు ఇటీవలి కాలంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ నాణ్యమైన హెల్త్‌కేర్ ఆస్తులు కావడంతో ప్రీమియం ధరను చెల్లించేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో వివరించింది. దేశ వైద్య సేవల రంగంలో 70 శాతం వాటా ప్రైవేటు రంగం చేతుల్లోనే ఉంది. రియల్ ఎస్టేట్‌పై ఖర్చు, ఎక్విప్మెంట్ వ్యయాలు తదితర రూపంలో ఎక్కువ పెట్టుబడులు అవసరం అవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరంతోపాటు వాటిపై రాబడులకు చాలా సమయం తీసుకునే ఈ రంగంలో స్థిరీకరణ అన్నది సంస్థలకు మెరుగైన ఆప్షన్ అవుతుందని ఇక్రా పేర్కొంది. -
పేదలకు ఊరట
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అయితే గతంలో జీవో 166 కింద వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించేందుకు వెసులుబాటు కల్పించింది. జీవో 166 కింద దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల స్థలాలను జీవోలు 58, 89 కింద క్రమబద్ధీకరించాలని ఆదేశిస్తూ తాజాగా జీవో 179 జారీ చేసింది. అదే విధంగా క్రమబద్ధీకరణ విధివిధానాలు పేర్కొంటూ, మూడు విడతల్లో రుసుం చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూ మరో జీవో 134 విడుదల చేసింది. నిలిచిపోయిందిలా... దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నగరంలోని ఆక్రమిత స్థలాల్లోపేదలు నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ 2008 ఫిబ్రవరి 16న జీవో 166 జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 1,22,637 మంది ఇళ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు కొన్నింటిని తిరస్కరించారు. అర్హులకు తగిన రుసుం చెల్లించేందుకు కన్వెయన్స్ డీడ్ కూడా అందజేశారు. అయితే క్రమబద్ధీకరణ దశలవారీగా కొనసాగుతుండగా, ప్రక్రియను నిలిపి వేయాలని సీపీఎం అప్పటి నగర శాఖ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జీవో 166 కింద క్రమబద్ధీకరణను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా క్రమబద్దీకరణ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అర్హులు తక్కువే... ఇళ్ల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ అందులో అర్హత సాధించినవి తక్కువే. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 31,960 పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా.. జిల్లా భూ అథారిటీ (డీఎల్సీ) 27,744 దరఖాస్తులను తిరస్కరించింది. మరో 102 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టగా... 4,114 మంది దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అయితే అందులో కేవలం 32 మంది మాత్రమే రుసుం చెల్లించారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 80చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 19,927 దరఖాస్తులు రాగా.. వాటిలో 2,342 మాత్రమే అర్హత సాధించాయి. 80–250 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 10,277 దరఖాస్తులు రాగా 1308... 250–500 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 1,133 దరఖాస్తులు రాగా 351... 501కి పైగా చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 823 దరఖాస్తులు రాగా 113 మాత్రమే అర్హత సాధించాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇళ్ల భూ క్రమబద్ధీకరణకు 90,677 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. అందులో 79,549 దరఖాస్తులను తిరస్కరించారు. అర్హత సాధించిన దరఖాస్తులను మూడు దశల్లో పరిధిల్లో క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించారు. రెవెన్యూ జిల్లా స్థాయి పరిధిలో మొత్తం 7,683 దరఖాస్తులు అర్హత సాధించగా... వాటిలో 5,034 మంది దరఖాస్తుదారులకు కన్వెయన్స్ డీడ్ అందజేశారు. అయితే 92 మంది దరఖాస్తుదారులు మాత్రమే రుసుం చెల్లించారు. మిగిలిన 2,557 మంది రుసుం చెల్లించలేదు. అదే విధంగా సీసీఎల్ఏ విభాగం 996 దరఖాస్తులను ఆమోదించి... 582 కన్వెయన్స్ డీడీ నోటీసులు జారీ చేసింది. వారిలో ఇద్దరు మాత్రమే రుసుం చెల్లించారు. ప్రభుత్వ పరిధిలో మొత్తం 351 దరఖాస్తులు అర్హత సాధించాయి. ప్రభుత్వ తాజా ఆదేశాలతో అర్హులైన దరఖాస్తులకు ఊరట లభించినట్లయింది. రుసుం చెల్లింపులిలా... దరఖాస్తుదారులు ఆక్రమిత స్థలాల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ రుసుం మూడు వాయిదాల్లో చెల్లించొచ్చు. నవంబర్ 1లోగా తొలి వాయిదా, డిసెంబర్ 1లోగా రెండో వాయిదా, జనవరి 1లోగా మూడో వాయిదా చెల్లించాలి. ఏక కాలంలో చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తారు. క్రమబద్ధీకరణ ఇలా.. ♦ 125 గజాలకు ఉచితంగాక్రమబద్ధీకరణ. ♦ 150 గజాల లోపు భూములు నోటిఫైడ్ గుర్తించిన మురికివాడల్లో ఉంటే మార్కెట్ విలువలో 10 శాతం. ♦ 250 గజాల లోపు ఉంటే మార్కెట్ విలువలో 25 శాతం. ♦ 500 గజాల లోపు ఉంటే మార్కెట్ విలువలో 50 శాతం. ♦ 1,000 గజాల లోపు ఉంటే 75 శాతం. ♦ 1,000 గజాల కంటే అధికంగా ఉంటే పూర్తి మార్కెట్ విలువ చెల్లించాలి. ♦ ఖాళీ స్థలాలకు మాత్రం విస్తీర్ణంతో సంబంధం లేకుండా పూర్తి మార్కెట్ విలువ చెల్లించాల్సి ఉంటుంది. ♦ జీవో 58, 59 తరహాలోనే ఆన్లైన్లో క్రమబద్ధీకరణ దరఖాస్తులుసమర్పించాలి. ♦ ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. ♦ దరఖాస్తుల స్వీకరణ అనంతరం తక్షణమే ఆన్లైన్లోనే దరఖాస్తుదారుడికి నోటీసు జారీ. ♦ 1,000 గజాలు దాటితే ప్రభుత్వానికి దరఖాస్తు సిఫార్సు. ♦ ప్రభుత్వం ఆమోదిస్తే సంబంధిత తహసీల్దార్ ద్వారా కన్వెయన్స్‌డీడ్ జారీ. ♦ జనవరి 31, 2019లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి. -
అంచనా తప్పింది!
♦ యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన కరువు ♦ నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు ♦ గుర్తించిన ఖాళీ స్థలాల్లో సగానికే అర్జీలు ♦ నోటీసుల జారీలో యంత్రాంగం వైఫల్యం జిల్లా వ్యాప్తంగా 601 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 5,700 మంది పొజిషన్లో ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో చాలామంది దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పటివరకు కేవలం 2,984 మందికే రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ లెక్క తప్పింది. మిగులు భూముల క్రమబద్ధీకరణ ఖజానాకు కాసులవర్షం కురిపిస్తుందని భావించిన సర్కారు అంచనాలు తలకిందులవుతున్నాయి. పట్టణ భూగరిష్ట పరిమితి (యూఎల్సీ) భూముల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం అని హెచ్చరించినా ఆక్రమణదారులు పెద్దగా స్పందించడం లేదు. ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తులు చే యని స్థలాలను స్వాధీనం చేసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. ఖాళీ భూములను 22ఏ కింద ప్రభుత్వ భూములుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. జీఓ 92 కింద యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మిగులు భూములుగా గుర్తించిన స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 601 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించిన జిల్లా యంత్రాంగం.. వీటిలో 5,700 మంది పోజిషన్లో ఉన్నట్లు నిర్ధారించింది. సగం మందికే నోటీసులు యూఎల్సీ స్థలాల రెగ్యులరైజేషన్‌కు ఇదే ఆఖరి చాన్స్ అని ప్రకటించిన జిల్లా యంత్రాంగం.. ఈ మేరకు శివార్లలోని 11 మండలాల్లో గుర్తించిన ఖాళీ మిగులు భూముల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను వారం రోజుల క్రితమే పూర్తి చేసినట్లు ప్రకటించింది. ప్రతి కాలనీకి ప్రత్యేక బృందాలను పంపి మరీ క్రమబద్ధీకరణ సమాచారాన్ని చేరవేసినట్లు స్పష్టం చేసింది. అధికారయంత్రాంగం చెప్పినట్లు క్షేత్రస్థాయిలో నోటీసుల జారీ జరగలేదని, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. రాజధాని పరిసరాల్లో 11 మండలాల్లో 5,476 పార్శిళ్లలో యూఎల్సీ ఖాళీ స్థలాలున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు సర్వేలో తేలింది. తగ్గిన ఖాళీ స్థలాలు మిగులు భూములను కూడా క్రమబద్ధీకరణ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్నాళ్ల క్రితం రెవెన్యూ సిబ్బందితో జిల్లా యంత్రాంగం సర్వే చేయించింది. దీంట్లో 5,476 చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించింది. తాజాగా క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీఓ జారీ చేయగానే వీటి సంఖ్య భారీగా తగ్గింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి ఖాళీ స్థలాల జాబితా రూపొందించడంతో ఈ సంఖ్య 4,720గా తేలింది. ఈ మేరకు గుర్తించిన స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తూ వీరందరికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినా అది సాధ్యపడలేదు. అర్జీల సమర్పణకు తుది గడువు సమీపించినా.. ఇప్పటివరకు కేవలం 2,984 మందికే నోటీసులు అందజేసి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకున్నారు. క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు పొడగిస్తారనే ధీమా కాబోలు.. నోటీసుల జారీని చాలా తేలికగా తీసుకున్నారు. మిగులు భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ ధరకు అటు ఇటుగా వెచ్చించి కొనుగోలు చేసిన భూములకు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కొందరికి సాధ్యంకాకపోవడం.. న్యాయపర చిక్కులు.. స్థలాలు చేతులు మారడం వంటివి దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది.