సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అయితే గతంలో జీవో 166 కింద వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించేందుకు వెసులుబాటు కల్పించింది. జీవో 166 కింద దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల స్థలాలను జీవోలు 58, 89 కింద క్రమబద్ధీకరించాలని ఆదేశిస్తూ తాజాగా జీవో 179 జారీ చేసింది. అదే విధంగా క్రమబద్ధీకరణ విధివిధానాలు పేర్కొంటూ, మూడు విడతల్లో రుసుం చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూ మరో జీవో 134 విడుదల చేసింది.
నిలిచిపోయిందిలా...
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నగరంలోని ఆక్రమిత స్థలాల్లోపేదలు నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ 2008 ఫిబ్రవరి 16న జీవో 166 జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 1,22,637 మంది ఇళ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు కొన్నింటిని తిరస్కరించారు. అర్హులకు తగిన రుసుం చెల్లించేందుకు కన్వెయన్స్ డీడ్ కూడా అందజేశారు. అయితే క్రమబద్ధీకరణ దశలవారీగా కొనసాగుతుండగా, ప్రక్రియను నిలిపి వేయాలని సీపీఎం అప్పటి నగర శాఖ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జీవో 166 కింద క్రమబద్ధీకరణను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా క్రమబద్దీకరణ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
అర్హులు తక్కువే...
ఇళ్ల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ అందులో అర్హత సాధించినవి తక్కువే. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 31,960 పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా.. జిల్లా భూ అథారిటీ (డీఎల్‌సీ) 27,744 దరఖాస్తులను తిరస్కరించింది. మరో 102 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టగా... 4,114 మంది దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అయితే అందులో కేవలం 32 మంది మాత్రమే రుసుం చెల్లించారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 80చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 19,927 దరఖాస్తులు రాగా.. వాటిలో 2,342 మాత్రమే అర్హత సాధించాయి. 80–250 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 10,277 దరఖాస్తులు రాగా 1308... 250–500 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 1,133 దరఖాస్తులు రాగా 351... 501కి పైగా చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 823 దరఖాస్తులు రాగా 113 మాత్రమే అర్హత సాధించాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇళ్ల భూ క్రమబద్ధీకరణకు 90,677 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. అందులో 79,549 దరఖాస్తులను తిరస్కరించారు. అర్హత సాధించిన దరఖాస్తులను మూడు దశల్లో పరిధిల్లో క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించారు. రెవెన్యూ జిల్లా స్థాయి పరిధిలో మొత్తం 7,683 దరఖాస్తులు అర్హత సాధించగా... వాటిలో 5,034 మంది దరఖాస్తుదారులకు కన్వెయన్స్ డీడ్ అందజేశారు. అయితే 92 మంది దరఖాస్తుదారులు మాత్రమే రుసుం చెల్లించారు. మిగిలిన 2,557 మంది రుసుం చెల్లించలేదు. అదే విధంగా సీసీఎల్‌ఏ విభాగం 996 దరఖాస్తులను ఆమోదించి... 582 కన్వెయన్స్ డీడీ నోటీసులు జారీ చేసింది. వారిలో ఇద్దరు మాత్రమే రుసుం చెల్లించారు. ప్రభుత్వ పరిధిలో మొత్తం 351 దరఖాస్తులు అర్హత సాధించాయి. ప్రభుత్వ తాజా ఆదేశాలతో అర్హులైన దరఖాస్తులకు ఊరట లభించినట్లయింది.
రుసుం చెల్లింపులిలా...
దరఖాస్తుదారులు ఆక్రమిత స్థలాల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ రుసుం మూడు వాయిదాల్లో చెల్లించొచ్చు. నవంబర్ 1లోగా తొలి వాయిదా, డిసెంబర్ 1లోగా రెండో వాయిదా, జనవరి 1లోగా మూడో వాయిదా చెల్లించాలి. ఏక కాలంలో చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తారు.
క్రమబద్ధీకరణ ఇలా..
♦ 125 గజాలకు ఉచితంగాక్రమబద్ధీకరణ.
♦ 150 గజాల లోపు భూములు నోటిఫైడ్ గుర్తించిన మురికివాడల్లో ఉంటే మార్కెట్ విలువలో 10 శాతం.
♦ 250 గజాల లోపు ఉంటే మార్కెట్ విలువలో 25 శాతం.
♦ 500 గజాల లోపు ఉంటే మార్కెట్ విలువలో 50 శాతం.
♦ 1,000 గజాల లోపు ఉంటే 75 శాతం.
♦ 1,000 గజాల కంటే అధికంగా ఉంటే పూర్తి మార్కెట్ విలువ చెల్లించాలి.
♦ ఖాళీ స్థలాలకు మాత్రం విస్తీర్ణంతో సంబంధం లేకుండా పూర్తి మార్కెట్ విలువ చెల్లించాల్సి ఉంటుంది.
♦ జీవో 58, 59 తరహాలోనే ఆన్‌లైన్‌లో క్రమబద్ధీకరణ దరఖాస్తులుసమర్పించాలి.
♦ ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ.
♦ దరఖాస్తుల స్వీకరణ అనంతరం తక్షణమే ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుదారుడికి నోటీసు జారీ.
♦ 1,000 గజాలు దాటితే ప్రభుత్వానికి దరఖాస్తు సిఫార్సు.
♦ ప్రభుత్వం ఆమోదిస్తే సంబంధిత తహసీల్దార్ ద్వారా కన్వెయన్స్‌డీడ్ జారీ.
♦ జనవరి 31, 2019లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి.
Comments
Please login to add a commentAdd a comment