అంచనా తప్పింది!
♦ యూఎల్‌సీ స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన కరువు
♦ నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు
♦ గుర్తించిన ఖాళీ స్థలాల్లో సగానికే అర్జీలు
♦ నోటీసుల జారీలో యంత్రాంగం వైఫల్యం
జిల్లా వ్యాప్తంగా 601 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వీటిలో 5,700 మంది పొజిషన్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో చాలామంది దరఖాస్తు చేసుకోలేదు.
ఇప్పటివరకు కేవలం 2,984 మందికే రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ లెక్క తప్పింది. మిగులు భూముల క్రమబద్ధీకరణ ఖజానాకు కాసులవర్షం కురిపిస్తుందని భావించిన సర్కారు అంచనాలు తలకిందులవుతున్నాయి. పట్టణ భూగరిష్ట పరిమితి (యూఎల్‌సీ) భూముల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం అని హెచ్చరించినా ఆక్రమణదారులు పెద్దగా స్పందించడం లేదు. ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తులు చే యని స్థలాలను స్వాధీనం చేసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.
ఖాళీ భూములను 22ఏ కింద ప్రభుత్వ భూములుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. జీఓ 92 కింద యూఎల్‌సీ స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మిగులు భూములుగా గుర్తించిన స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 601 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించిన జిల్లా యంత్రాంగం.. వీటిలో 5,700 మంది పోజిషన్‌లో ఉన్నట్లు నిర్ధారించింది.
సగం మందికే నోటీసులు
యూఎల్‌సీ స్థలాల రెగ్యులరైజేషన్‌కు ఇదే ఆఖరి చాన్స్ అని ప్రకటించిన జిల్లా యంత్రాంగం.. ఈ మేరకు శివార్లలోని 11 మండలాల్లో గుర్తించిన ఖాళీ మిగులు భూముల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను వారం రోజుల క్రితమే పూర్తి చేసినట్లు ప్రకటించింది.
ప్రతి కాలనీకి ప్రత్యేక బృందాలను పంపి మరీ క్రమబద్ధీకరణ సమాచారాన్ని చేరవేసినట్లు స్పష్టం చేసింది. అధికారయంత్రాంగం చెప్పినట్లు క్షేత్రస్థాయిలో నోటీసుల జారీ జరగలేదని, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. రాజధాని పరిసరాల్లో 11 మండలాల్లో 5,476 పార్శిళ్లలో యూఎల్‌సీ ఖాళీ స్థలాలున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు సర్వేలో తేలింది.
తగ్గిన ఖాళీ స్థలాలు
మిగులు భూములను కూడా క్రమబద్ధీకరణ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్నాళ్ల క్రితం రెవెన్యూ సిబ్బందితో జిల్లా యంత్రాంగం సర్వే చేయించింది. దీంట్లో 5,476 చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించింది. తాజాగా క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీఓ జారీ చేయగానే వీటి సంఖ్య భారీగా తగ్గింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి ఖాళీ స్థలాల జాబితా రూపొందించడంతో ఈ సంఖ్య 4,720గా తేలింది. ఈ మేరకు గుర్తించిన స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తూ వీరందరికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినా అది సాధ్యపడలేదు.
అర్జీల సమర్పణకు తుది గడువు సమీపించినా.. ఇప్పటివరకు కేవలం 2,984 మందికే నోటీసులు అందజేసి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకున్నారు. క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు పొడగిస్తారనే ధీమా కాబోలు.. నోటీసుల జారీని చాలా తేలికగా తీసుకున్నారు. మిగులు భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ ధరకు అటు ఇటుగా వెచ్చించి కొనుగోలు చేసిన భూములకు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కొందరికి సాధ్యంకాకపోవడం.. న్యాయపర చిక్కులు.. స్థలాలు చేతులు మారడం వంటివి దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది.