స్కిల్‌ కుంభకోణం వివరాలు బహిర్గతం చేయకుండా ఆదేశాలివ్వండి | Disclosing the details of skill development case is serious loss | Sakshi
Sakshi News home page

స్కిల్‌ కుంభకోణం వివరాలు బహిర్గతం చేయకుండా ఆదేశాలివ్వండి

Published Sat, Oct 21 2023 4:40 AM | Last Updated on Sat, Oct 21 2023 3:13 PM

Disclosing the details of skill development case is serious loss - Sakshi

సాక్షి, అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుం­భ­కో­ణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా న్యాయస్థా­నాల్లో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను, దర్యాప్తు చేస్తున్న అధికారులను లక్ష్యంగా చేసుకుంటూ భౌతిక దాడులకు, తీవ్ర ఆరోపణలకు దిగిన తెలుగుదేశం పార్టీ వర్గాలు... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట రాకుండా న్యాయస్థానాల్లో గట్టిగా వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని, సీఐడీ చీఫ్‌ సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.

అందులో భాగంగా స్కిల్‌ కుంభకోణం గురించిన వాస్తవాలను పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు వివరించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎన్‌.సంజయ్‌లపై ఆ వర్గాలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) దాఖలు చేశాయి. స్కిల్‌ కుంభకోణం కేసు లేదా ఇతర ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా, ఎలాంటి సమావే­శాలు నిర్వహించకుండా సుధాకర్‌రెడ్డి, సంజయ్‌ను ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్‌టీఐ క్యాంపెయిన్‌ అధ్యక్షుడు ఎన్‌.సత్యనారా­యణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

పత్రికా సమావేశాలు పెట్టడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వారిద్దరిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోర్టును కోరారు. అంతేకాక సుధాకర్‌రెడ్డి, సంజయ్‌ నిర్వహించిన సమావేశంపై విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సంజయ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

సమావేశాలు పెడుతూ, హోటళ్లలో ఉంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సత్యనా­రా­యణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సెంట్రల్‌ సివిల్‌ సర్వెంట్‌ రూల్స్‌కు విరుద్దంగా వీరు వ్యవహరిస్తున్నారని తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు వివరాలను రహస్యంగా ఉంచాల్సింది పోయి సమావేశాలు పెట్టి బహిర్గతం చేయడం నైతిక విలువలకు విరుద్ధమన్నారు. చంద్రబాబుతో పాటు ఇతర నిందితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ, స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని వివరించారు. స్కిల్‌ కేసులో నిర్వహించిన సమావేశాల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సుధాకర్‌రెడ్డి, సంజయ్‌ నుంచి వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సత్యనారాయణ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement