Serious damage
-
స్కిల్ కుంభకోణం వివరాలు బహిర్గతం చేయకుండా ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను, దర్యాప్తు చేస్తున్న అధికారులను లక్ష్యంగా చేసుకుంటూ భౌతిక దాడులకు, తీవ్ర ఆరోపణలకు దిగిన తెలుగుదేశం పార్టీ వర్గాలు... ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట రాకుండా న్యాయస్థానాల్లో గట్టిగా వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని, సీఐడీ చీఫ్ సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. అందులో భాగంగా స్కిల్ కుంభకోణం గురించిన వాస్తవాలను పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు వివరించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎన్.సంజయ్‌లపై ఆ వర్గాలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశాయి. స్కిల్ కుంభకోణం కేసు లేదా ఇతర ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా సుధాకర్‌రెడ్డి, సంజయ్‌ను ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పత్రికా సమావేశాలు పెట్టడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వారిద్దరిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. అంతేకాక సుధాకర్‌రెడ్డి, సంజయ్ నిర్వహించిన సమావేశంపై విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సంజయ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. సమావేశాలు పెడుతూ, హోటళ్లలో ఉంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సత్యనారాయణ తన పిటిషన్లో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వెంట్ రూల్స్‌కు విరుద్దంగా వీరు వ్యవహరిస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలను రహస్యంగా ఉంచాల్సింది పోయి సమావేశాలు పెట్టి బహిర్గతం చేయడం నైతిక విలువలకు విరుద్ధమన్నారు. చంద్రబాబుతో పాటు ఇతర నిందితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ, స్టేట్మెంట్లు ఇస్తున్నారని వివరించారు. స్కిల్ కేసులో నిర్వహించిన సమావేశాల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సుధాకర్‌రెడ్డి, సంజయ్ నుంచి వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సత్యనారాయణ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
గుబాళించని కాఫీ
హుద్‌హుద్ ధాటికి పంట నాశనం భారీగా ధరలు పతనం కిలో గింజలు రూ.150 పాడేరు: ఏటా గిరిజన రైతులను ఆదుకుంటున్న కాఫీకి ఈ ఏడాది మన్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. హుద్‌హుద్ ధాటికి ఈ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో కాఫీ గింజలకు రెట్టింపు ధర లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. రెండేళ్లుగా బ్రెజిల్, వియత్నాం దేశాల్లో కాఫీ దిగుబడులు తగ్గడంతో ఏజెన్సీలో సేంద్రియ పద్ధతిలో పండించిన కాఫీకి బెంగళూరు మార్కెట్లో డిమాండ్ ఉండేది. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఆ రెండు దేశాల్లో దిగుబడులు పెరిగాయి. బెంగళూరు మార్కెట్లోని పెద్ద వ్యాపారులంతా విదేశాల్లో కాఫీ గింజల కొనుగోలుపైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇక్కడ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. కిలో రూ.150లకు మించి విజయవాడ వ్యాపారులు ఏజెన్సీలో కాఫీ గింజలను కొనుగోలు చేయడం లేదు. ఏజెన్సీలో లక్షా 40 వేల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. 96 వేల ఎకరాల్లోని వాటి నుంచి ప్రస్తుతం ఫలసాయం వస్తోంది. గతేడాది 6 వేల టన్నుల కాఫీ గింజల దిగుబడితో రూ.11.40 కోట్ల వ్యాపారం జరిగింది. కిలో రూ.190 నుంచి రూ.210లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది పూత బాగా వచ్చింది. సుమారు 7 వేల టన్నుల దిగుబడి ఉంటుందని ఐటీడీఏ కాఫీ విభాగం, కేంద్ర కాఫీబోర్డు అధికారులు అంచనా వేశారు. ఈ తరుణంలో హుద్‌హుద్ కారణంగా 30 వేల ఎకరాల్లోని తోటలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం 4,800 టన్నుల దిగుబడి ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెండు వారాలుగా కాఫీ గింజల లావాదేవీలు సాగుతున్నాయి. కిలో రూ.140 నుంచి రూ. 150లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు తగ్గడంతో ధర రూ.200 నుంచి రూ.250 మధ్య ఉంటుందని ఆశపడిన గిరిజన రైతులకు నిరాశే మిగిలింది. -
పదేళ్లలో తుపాన్లు.. నష్టాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గత పదేళ్లలో ఏడు తుపాన్లు జిల్లాపై దాడి చేశాయి. వీటిలో నాలుగు అక్టోబర్ నెలలోనే సంభవించి తీవ్ర నష్టం కలిగించాయి. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్‌లో విరుచుకుపడిన పై-లీన్ తుపాను సుమారు రూ.వెయ్యి కోట్ల నష్టాల్లో ముంచెత్తింది. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు అంతే తీవ్రస్థాయిలో హుదూద్ తుపాను హడలుగొడుతోంది. 2003 నుంచి సంభవించిన తుపాన్లు, వాటిల్లిన నష్టాన్ని పరిశీలిస్తే... * 2003 అక్టోబర్ 6,7 తేదీల్లో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల 51 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. సుమారు 25వేల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. * 2004 అక్టోబరు 3, 4, 5 తేదీల్లో కురిసిన తుపాను వర్షాలకు 2,900 హెక్టార్లలో పంటలు పోయాయి. సుమారు 20 వేల మందిప్రజలు అవస్థలపాలయ్యారు. * 2005 సెప్టెంబరు 18,19 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులకు వరదలు వచ్చాయి. ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో 15వేల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. సుమారు 40 వేల మంది ప్రజలు నష్టపోయారు. * 2010 డిసెంబర్ 5-8 తేదీల మధ్య దాడి చేసిన జల్ తుఫాన్ అపార నష్టం మిగిల్చింది. సుమారు 3 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపింది. 1.60 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. పూరిళ్లు, కొన్ని చోట్ల పక్కా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు వందల కోట్ల నష్టం వాటిల్లింది. * 2011 అక్టోబరులో సంభవించిన నీలం తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది. రెండేళ్ల క్రితం నాటి జల్ తుఫాన్‌తో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జిల్లా రైతాంగాన్ని ఇది మరింత కుంగదీసింది. * 2012 సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు లైలా తుఫాన్ దాడి చేసింది. దీని ఫలితంగా 3 లక్షల మంది ప్రభావితం కాగా 28వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. నలుగురు చనిపోగా, 24 పశువులు కూడా మృతి చెందాయి. వందల సంఖ్యలో పూరిళ్లు కూలిపోయాయి. సమాచార వ్యవస్థ, విద్యుత్, రోడ్లులకు భారీ ఎత్తున వందల కోట్లలో నష్టం సంభవించింది. * 2013 అక్టోబర్ 12న సంభవించిన పెను తుపాను పై-లీన్, అనంతరం కురిసిన భారీ వర్షాలకు ఉద్యాన, ఆహార పంటలు ఊడ్చుకుపోయాయి. సుమారు వెయ్యి కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. -
రబీకి ‘అకాల నష్టం
- 60 ఎకరాల్లో మునిగిన వరి - లబోదిబోమంటున్న రైతాంగం మునగపాక, న్యూస్‌లైన్ : మండల వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో రబీ వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. రబీలో నాటిన వరిపంట చేతికి అందివస్తున్న తరుణంలో వర్షాలు తీరని నష్టాలకు గురి చేసిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్‌లో దెబ్బతిన్న రైతాంగం ఈసారి రబీపైనే ఆధారపడి పెద్దమొత్తంలో వరి సాగు చేపట్టింది. రబీలో వరి సాధారణ విస్తీర్ణం 48 హెక్టార్లు కాగా ఈ ఏడాది 110 హెక్టార్లకు పైగా సాగు చేసినట్లు అధికారులు చెప్పారు. ఖరీఫ్‌లో వరి చేతికి అందుతుందనుకున్న తరుణంలో తుపాన్లు కొంపముంచడం తెలిసిందే. రబీలో అయినా ఫలితాలు సాధించాలనుకుంటే అకాల వర్షం దెబ్బ తీసిందంటూ రైతులు వాపోతున్నారు. మునగపాక పరిధిలో సుమారు 60 ఎకరాలకు పైగా వరి తడిసిపోయింది. ఆవ ప్రాంతంలో నాటిన పొలాలు దాదాపు నీట మునిగిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వేలాది రూపాయలు నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదిరోజుల్లో చేతికి అందుతుందనుకున్న వరి ఒక్కసారిగా వర్షానికి దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామంటూ పీలా అప్పారావు అనే రైతు వాపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి 50.10 మిల్టీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ వర్షం రైతులకు అంత లాభసాటిగా ఉండదని వ్యవసాయాధికారి కె.నీలాధరరావు అభిప్రాయపడ్డారు.