రబీకి ‘అకాల నష్టం
- 60 ఎకరాల్లో మునిగిన వరి
- లబోదిబోమంటున్న రైతాంగం
మునగపాక, న్యూస్‌లైన్ : మండల వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో రబీ వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. రబీలో నాటిన వరిపంట చేతికి అందివస్తున్న తరుణంలో వర్షాలు తీరని నష్టాలకు గురి చేసిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్‌లో దెబ్బతిన్న రైతాంగం ఈసారి రబీపైనే ఆధారపడి పెద్దమొత్తంలో వరి సాగు చేపట్టింది. రబీలో వరి సాధారణ విస్తీర్ణం 48 హెక్టార్లు కాగా ఈ ఏడాది 110 హెక్టార్లకు పైగా సాగు చేసినట్లు అధికారులు చెప్పారు.
ఖరీఫ్‌లో వరి చేతికి అందుతుందనుకున్న తరుణంలో తుపాన్లు కొంపముంచడం తెలిసిందే. రబీలో అయినా ఫలితాలు సాధించాలనుకుంటే అకాల వర్షం దెబ్బ తీసిందంటూ రైతులు వాపోతున్నారు. మునగపాక పరిధిలో సుమారు 60 ఎకరాలకు పైగా వరి తడిసిపోయింది. ఆవ ప్రాంతంలో నాటిన పొలాలు దాదాపు నీట మునిగిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వేలాది రూపాయలు నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదిరోజుల్లో చేతికి అందుతుందనుకున్న వరి ఒక్కసారిగా వర్షానికి దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామంటూ పీలా అప్పారావు అనే రైతు వాపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి 50.10 మిల్టీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ వర్షం రైతులకు అంత లాభసాటిగా ఉండదని వ్యవసాయాధికారి కె.నీలాధరరావు అభిప్రాయపడ్డారు.