మనిషి ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరం. ఆహారంతో పాటు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే అనేక ప్రమాదకరమైన అనారోగ్యాల్ని కొని తెచ్చుకున్నట్టే ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే అర్థరాత్రి దాకా మెలకువతో ఉండటం మాత్రమే కాదు, ఎక్కువ వెలుగులో ఉన్నా ప్రమాదమేనని తాజా అధ్యయనం చెబుతోంది.
85వేల మంది వ్యక్తులపై జరిపిన భారీ అధ్యయనంలో, ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రాత్రిపూట కాంతికి ఎక్స్‌పోజ్ కావడం మూలంగా (పగటిపూట కార్యకలాపాలతో సంబంధం లేకుండా) టైప్-2 మధుమేహం ముప్పును పెంచుతుందని గుర్తించారు.
రాత్రి ఆలస్యంగా నిద్రకుపక్రమించడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుందని ఇది జీవక్రియలో మార్పులకు దారితీస్తుందని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రచయిత ఆండ్రూ ఫిలిప్స్ తెలిపారు. ఇన్సులిన్ స్రావం, గ్లూకోజ్ జీవక్రియ మార్పుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుందని, చివరికి టైప్-2 డయాబెటిస్‌కి దారి తీస్తుందని తెలిపారు.
2013 -2016 మధ్య కాలంలో యూకే బయెబ్యాంకు డాటాతో, ఒక వారం పాటు మణికట్టు కాంతి సెన్సార్‌లను ధరించి 84,790 మంది ఈ స్టడీలో పాల్గొన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అంచనాల ప్రకారం 13 మిలియన్ గంటల లైట్-సెన్సర్ డేటాతో తరువాతి జీవితంలో మధుమేహం వచ్చే ప్రమాదం 67శాతంఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
జీవనశైలి, షిఫ్ట్ డ్యూటీలు, సమయానికి నిద్రపోకపోవడం లాంటివి షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయన్న విషయాన్ని పరిగణనలో తీసుకున్న పరిశోధకులు, అర్థరాత్రి 12.30 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువ కాంతికి ప్రభావితమవ్వడం కూడా అనారోగ్య సమస్యల్ని మరింత పెంచుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఎక్కువ లైట్‌కు ఎక్స్‌పోజ్ కాకుండా జాగ్రత్త పడాలని, తద్వారా టైప్-2 మధుమేహం ముప్పు నుంచి తప్పించు కోవచ్చని సూచించారు.
రాత్రి సమయంలో ప్రకాశవంతమైన వెలుగులో ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని ఫిలిప్స్ తెలిపారు. లైట్ ఎక్ప్‌పోజర్‌కి, మధుమేహం ముప్పుకు ఉన్న సంబంధాన్ని తమ పరిశోధనలో గుర్తించామన్నారు. సో.. ఈ తరహా డయాబెటిస్ నుంచి తప్పించు కోవాలంటే రాత్రిపూట పని చేసేటపుడు, ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవడం లేదా సాధ్యమైనంత చీకటి వాతావరణాన్ని సృష్టించుకోవడం సులభమైన మార్గమని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment