టైప్ 2 డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతున్న సమస్య. దాదాపు 90 నుండి 95శాతం ఈ తరహా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2021లో ప్రపంచంలో 540 మిలియన్ల మధుమేహ కేసులు (ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్, 2021) ఉన్నట్లు అంచనా. ఒత్తిడి, నిశ్చల జీవనశైలి , నాణ్యత లేని, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వంటి కారణాలతో మధుమేహం విస్తరిస్తోంది. అయితే తాజా అధ్యయనం ప్రకారం అతిగా నిద్రపోవడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట.
మనిషి ఆరోగ్యంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సమయా పాలన పాటించని నిద్రకూడా ప్రమాదమే అంటున్నారు. హెచ్చు తగ్గుల నిద్రకు మన ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. నిద్ర వ్యవధిని తరచూ మార్చుకునే వారికి డయాబెటిస్ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని తాజా పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఈ పరిశోధన ప్రకారం తమ నిద్ర వ్యవధిని 31 నుంచి 45 నిముషాల పాటు మార్చుకోవడం (నిద్ర వ్యవధి ఎక్కువ/తక్కువ చేయడం) వల్ల 15 శాతం డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. ఈ వ్యవధి గంటకు మించి ఉంటే ఆ ప్రమాదం 59 శాతం పెరుగుతుంది. అతి నిద్ర కారణంగా కారణంగా డయాబెటిస్ సోకే అవకాశాలు 34 శాతం అధికంగా ఉంటుంది.
జూలై 2024 అధ్యయనం మరియు డయాబెటిస్ కేర్‌లో దీన్ని ప్రచురించారు. యూకే బయో బ్యాంక్ ద్వారా పరిశోధకులు యాక్సిలోమీటర్లు (స్మార్ట్ వాచ్) ద్వారా 84 వేల మంది నిద్ర నమూనాలను పరిశీలించారు. అతి నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. నిద్రలేమి కారణంగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావడమే కాక, తీవ్ర రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, హృద్రోగ సంబంధ వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధన పేర్కొంది.
క్రమరహిత నిద్ర అనేది ఆధునిక జీవనశైలితో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్య. వృత్తి, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, కుటుంబ కట్టుబాట్ల కారణంగా ప్రజలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు, ఇది వారి నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రకు ముందు మొబైల్ ఫోన్‌ల వంటి డిజిటల్ పరికరాల వినియోగం పెరగడం మరో ప్రధాన అంశం. మొబైల్ ఫోన్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పేలవమైన నిద్ర భవిష్యత్తులో మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment