
న్యూఢిల్లీ: ఇతర ప్రభుత్వ బ్యాంకుల కొనుగోలు, విలీనాల యోచనేదీ లేదని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ సునీల్ మెహతా స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్యాంకు అంతర్గత కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకోవడం, ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం అధ్యాయం ఇక ముగియడంతో.. వృద్ధి, మొండిబాకీల రికవరీపై మరింతగా దృష్టి సారిస్తున్నట్లు మెహతా చెప్పారు.
బ్యాంకు వృద్ధి ప్రణాళికల కోసం రూ. 5,431 కోట్ల అదనపు మూలధనం సమకూరుస్తున్నట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం వెల్లడించిన సంగతి ఆయన గుర్తు చేశారు. ఇతరత్రా మరేవైనా ప్రభుత్వ రంగ బ్యాంకులను కొనుగోలు చేసే ప్రతిపాదనేదైనా ఉందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. తమ బ్యాంకుకైతే అలాంటి యోచనేదీ లేదని వివరించారు. ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేస్తూ కేంద్రం గత నెలలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూడు బ్యాంకుల విలీనానంతరం ఏర్పడే కొత్త బ్యాంకు దాదాపు రూ. 14.5 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా ప్రభుత్వ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment