మెదక్ రూరల్: జిల్లాలో నగదు బదిలీ పథకం మళ్లీ అమలుకాబోతోంది. కాంగ్రెస్ హయాంలో అమల్లోకొచ్చిన ఈ పథకం ఆ తర్వాత పలు కారణాలతో నిలిచిపోయిన సంగతి తెల్సిందే. అయితే అక్రమాలకు చెక్ పెట్టాలంటే నగదు బదిలీ తప్పదని భావిస్తున్న సర్కార్ తిరిగి ఈ పథకాన్ని జనవరి నుంచి పటిష్టంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యంత్రాంగం కూడా సిద్ధమైంది.
అధికారిక లెక్కల ప్రకారం..జిల్లాలో భారత్, హెచ్‌పీ, ఇండియన్ కంపెనీల పరిధిలో 3,39,742 కనె క్షన్లుండగా, దీపం పథకానికి సంబంధించిన మరో 1,75,391 కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 5,15,133 కనెక్షన్లు ఉన్నాయి. తాజా పరిణామాలతో ప్రభుత్వం అందజేసే సబ్సిడీ పొందాలంటే 5 లక్షల మంది గ్యాస్ వినియోగదారులూ తప్పకుండా తమ ఆధార్ కార్డుల ప్రతిని గ్యాస్ ఏజెన్సీలకు ఇవ్వడంతో పాటు బ్యాంకు ఖాతాను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
అంతా పారదర్శకత
మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతుంటే గ్యాస్ వినియోగదారుడు అంతమొత్తాన్ని గ్యాస్ డీలర్‌కు చెల్లించి గ్యాస్‌బండను పొందాల్సి ఉంటుంది. ఇలా గ్యాస్‌ను పొందిన వినియోగదారుల జాబితాను సదరు గ్యాస్ డీలర్ సర్కార్‌కు పంపితే వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం జమచేస్తుంది.
గ్యాస్‌బుకింగ్, డెలివరీ, సబ్సిడీ మొత్తం జమ అంతా ఆన్‌లైన్‌లో జరగడంతో అక్రమాలకు అవకాశం ఉండదని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారిలో సగం మంది కూడా గ్యాస్‌ను వాడడం లేదని, అయినప్పటికీ వారిపేరు మీద కొందరు డీలర్లు, ఇతరులు గ్యాస్‌ను బుక్ చేసుకుని ప్రభుత్వ సబ్సిడీని అక్రమంగా పొందుతున్నట్లు తెలుస్తోంది.
అందువల్లే సర్కార్ ప్రతి వినియోగదారుడూ తన ఆధార్ నంబర్‌తో పాటు, బ్యాంకు ఖాతా ప్రతిని గ్యాస్ డీలర్‌కు ఇవ్వాలని చెబుతోంది. అప్పుడు ఎవరైనా వినియోగదారునికి తెలియకుండా గ్యాస్ బుక్ చేసినా వెంటనే తెలిసిపోతుందని, అందువల్ల అక్రమాలకు తావే ఉండదని అధికారులు చెబుతున్నారు. జనవరి నుంచి జిల్లాలోని గ్యాస్ వినియోగదారులంతా గ్యాస్‌కు పూర్తి డబ్బులను చెల్లించాల్సి ఉంటుందని పదే, పదే లబ్ధిదారుల ఫోన్‌లకు గ్యాస్ ఏజెంట్లు సంక్షిప్త సమాచారాన్ని పంపుతున్నారు.
దూరాన్ని బట్టి ధర
ప్రసుత్తం గ్యాస్ ధరను దూరాన్నిబట్టి రవాణా ఖర్చులను కలుపుకుని నిర్ణయిస్తారు. ప్రస్తుతం మెదక్‌లో సిలిండర్ ధర రూ.851గా ఉంది. ఈ పూర్తి మొత్తాన్ని జనవరి నుంచి వినియోగదారులు గ్యాస్ ఏజెంట్లకు చెల్లిస్తేనే సిలిండర్ ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం రూ.451 నేరుగా లబ్ధిదారుడు ఖాతాలో జమ అవుతుంది. దీంతో నేరుగా ప్రభుత్వం గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీ మొత్తం లబ్ధిదారులకు చేరుతుంది.
వచ్చేనెల నుంచే నగదు బదిలీ!
Published Wed, Dec 24 2014 12:05 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement