సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో వంటగ్యాస్ నగదు బదిలీ పథకం గురువారం నుంచి మళ్లీ ఆరంభమవుతోంది. ఆధార్, బ్యాంకు ఖాతాలు కలిగిన వినియోగదారులంతా గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇకపై రూ.861 చెల్లించాల్సిందే. ఆయా వినియోగదారులందరికీ కొద్దిరోజుల తరువాత సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో కేంద్రం జమచేయనుంది. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన గ్యాస్ నగదు బదిలీ పథకం గందరగోళంగా మారడంతో నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సైతం ఈ పథకాన్ని అమలు చేసేందుకు నడుం బిగించడంతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న ప్రజలకు ఇది ఒకింత ఇబ్బంది కలిగించే అంశమే కానుంది. ఇక గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇకపై విధిగా ఆధార్, బ్యాంకు నెంబర్‌కు అనుసంధానించాల్సిందే. లేనిపక్షంలో వారికి సబ్సిడీ ధరపై గ్యాస్ కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతారు.
జిల్లాలో మొత్తం 7,26,707 డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లున్నాయి. బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.861. గృహావసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధర సబ్సిడీపై రూ.451కి అందిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో కేంద్రం భరిస్తోంది. కొత్త సంవత్సరం నుంచి బ్యాక్ ఖాతా, ఆధార్ కార్డు కలిగి ఉన్న వినియోగదారులంతా గ్యాస్ సిలిండర్ కావాలంటే తొలుత రూ.861 చెల్లించాల్సిందే.
కేంద్రం ఇచ్చే సబ్సిడీ మాత్రం వెంటనే కాకుండా కొద్ది రోజుల తరువాత సదరు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. అయితే ఇందులోనూ కొంత తిరకాసు ఉంది. వాస్తవానికి నాన్‌సబ్సిడీ కింద సిలిండర్ ధర 861.50 కాగా వినియోగదారులు ప్రస్తుతం 451.50 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే రూ.410 సబ్సిడీ చెల్లిస్తున్నట్లు లెక్క. కానీ ఇకపై వినియోగదారుడి ఖాతాలో రూ.390 జమ కానుంది. ఎందుకంటే మిగిలిన రూ.20 వ్యాట్ కింద మినహాయిస్తారు. అంటే వినియోగదారుడిపై ఈమేరకు గ్యాస్ భారం కానుంది.
గందరగోళం షురూ...
మరోవైపు జిల్లాలో ఏడు లక్షల పైచిలుకు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లుండగా, అందులో 40 శాతం మందికి ఇంతవరకు ఆధార్‌కార్డుల్లేవు. 70 శాతం మందికి బ్యాంక్ ఖాతాలను గ్యాస్ కనెక్షన్లను అనుసంధానం చేయలేదు. నగదు బదిలీ పథకం ఆరంభానికి మరో 24 గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. కేంద్రం మాత్రం ఆరు నూరైనా ఈ పథకాన్ని జనవరి ఒకటి నుంచి ప్రారంభించాల్సిందేనని ఆదేశించడంతో అధికారులు, ఎల్పీజీ డీలర్లు తలపట్టుకుంటున్నారు.
ప్రజలను చైతన్యం చేస్తేనే విజయవంతం : ఈటెల
ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని ఎల్పీజీ డీలర్లు సమావేశమై పథకం అమల్లో ఎదురుకానున్న ఇబ్బందులను చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయకపోవడం వల్లనే గత ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకుందని గుర్తు చేశారు. ‘వాస్తవానికి తెలంగాణలోని గ్రామాల్లో మెజారిటీ ప్రజలకు బ్యాంకు ఖాతాల్లేవన్నారు. ఈ దశలో రూ.861 చెల్లించి సిలిండర్ కొనాలనడం పెద్ద సమస్యే. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో పింఛన్లు ఇస్తున్నా విమర్శలొస్తున్నాయే తప్ప యాది చేసుకునేటోళ్లు లేరు.
అట్లాకాకుండా గ్యాస్ నగదు బదిలీ పథకంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలనూ భాగస్వామ్యం చేసి ప్రజలను చైతన్యం చేస్తేనే విజయవంతమవుతోంది. ఇందులో ఏమాత్రం పొరపాటు జరిగినా దానికి మమ్ముల్నే బాధ్యుల్ని చేస్తారు. ఎందుకంటే కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో ఉండేది మేమే కాబట్టి మేమే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంతో మాకు సంబంధం లేదని తప్పుకునే పరిస్థితిని మాత్రం తీసుకురాకుండా పద్దతిగా చేయండి’ అని సూచించారు.
గ్యాస్ వినియోగదారులందరు బ్యాంకు ఖాతాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం త్వరలోనే బ్యాం కర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపా రు. నగర మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడు తూ.. ఇప్పటివరకు తనకు ఆధార్ కార్డే లేదని, ఇక సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించారు. గ్యాస్‌కు, ఆధార్ లింకు పెట్టడంవల్లే ఈ సమస్య ఎదురవుతోందని అభిప్రాయపడ్డారు. ఆధార్‌తో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తే విజయవంతం అవుతుందని చెప్పారు.
మార్చి వరకు గడువు
ఎల్పీజీ జిల్లా సమన్వయకర్త నందకిషోర్ మాట్లాడుతూ.. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నప్పటికీ ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం చేసుకునేందుకు మార్చి వరకు గడు వు ఉందని అన్నారు. ఈ రెండు ఖాతాలతో గ్యాస్ కనెక్షన్ అనుసంధానం చేసుకున్న విని యోగదారులు మాత్రం జనవరి నుంచే రూ. 861.50 చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయా ల్సి ఉంటుదన్నారు. ఆ తరువాత వారి బ్యాంక్ ఖాతాలో రూ.390 జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, రాష్ట్ర ఎల్పీజీ డీలర్ల సంఘం నాయకుడు హెచ్.వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు రాధకృష్ణ, కార్యదర్శి హరిక్రిష్ణ, సభ్యులు సతీష్, సంపత్, గౌరవ్ పాల్గొన్నారు.
రేపటి నుంచి నగదు బదిలీ
Published Wed, Dec 31 2014 2:10 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement